ప్రపంచ చరిత్రలో బిగ్గెస్ట్ ‘చిత్రకళా’ చోరీలు

by  |
ప్రపంచ చరిత్రలో బిగ్గెస్ట్ ‘చిత్రకళా’ చోరీలు
X

దిశ, ఫీచర్స్ : ప్రపంచంలోనే రికార్డు స్థాయిలో సేల్ అయిన పుస్తకం బైబిల్. అంతేకాదు షాపుల్లో అత్యధికంగా దొంగిలించబడ్డ పుస్తకమూ ఇదే. ఇలాంటి న్యూస్ విన్నప్పుడు, వీటిని కూడా దొంగిలిస్తారా? అనే అనుమానం కలగవచ్చు. కాగా ‘చిత్రకళా’ చోరులు కూడా ఆ కోవకే చెందుతారు. 1990 మార్చి 18న బోస్టన్‌లోని ‘ఇసాబెల్లా స్టీవర్ట్ గార్డనర్ మ్యూజియం’లో జరిగిన దొంగతనం కూడా అలాంటిదే. పోలీసు అధికారులుగా మ్యాజియం భవనంలోకి ప్రవేశించిన ఇద్దరు వ్యక్తులు.. సెక్యూరిటీ గార్డులను కట్టిపడేసి ‘వెర్మీర్, ఎడ్వర్డ్ మానెట్, రెంబ్రాం‌డ్‌, ఎడ్గార్ డెగాస్‌’ గీసిన చిత్రాలతో పాటు 500 మిలియన్ డాలర్ల విలువైన 13 ప్రసిద్ధ కళాకృతులను దొంగిలించారు. చరిత్రలో అతి పెద్ద ‘ఆర్ట్ హీస్ట్’గా నిలిచిపోయిన ఈ చోరీ జరిగి మూడు దశాబ్దాలు గడుస్తున్నా.. స్టీవర్ట్ గార్డనర్ మ్యూజియంలో ఇప్పటికీ కాన్వాస్‌ల ఖాళీ ఫ్రేమ్‌లే వేలాడుతున్నాయి. కాగా ఈ రియల్ ఇన్సిడెంట్‌పై నెట్‌ఫ్లిక్స్‌లో తాజాగా విడుదలైన ‘దిస్ ఈజ్ ఏ రాబరీ- ద వరల్డ్స్ బిగ్గెస్ట్ ఆర్ట్ హీస్ట్’ అనే సిరీస్ విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. అయితే ఇదే తరహా సంచలనాత్మక దోపిడీలు చరిత్రలో చాలానే ఉండగా అందులో కొన్ని.. మీ కోసం!

స్టోలెన్.. ‘ద స్క్రీమ్’ ఆర్ట్ వర్క్ :

2004లో నార్వే, ఓస్లో మంచ్ మ్యూజియంలో ఇలాంటి దొంగతనమే జరిగింది. ఆగస్టు నెలలో మిట్ట మధ్యాహ్నం పూట ఇద్దరు దొంగలు పిస్టల్‌తో మ్యూజియంలోకి ప్రవేశించి, ప్రఖ్యాత నార్వేయిన్ మాస్టర్ ఎడ్వర్డ్ మంచ్ చేతుల్లో ప్రాణం పోసుకున్న ఐకానిక్ ఆర్ట్ వర్క్ ‘ద స్క్రీమ్’, ‘మడోన్నా’ను ఎత్తుకెళ్లారు. ఈ కేసుకు సంబంధించి ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు.. కొన్ని నెలల తర్వాత 2006లో ఈ చిత్రాలను తిరిగి రికవర్ చేశారు. ఇక 1994లో లిల్లేహమ్మర్‌లో జరిగిన వింటర్ ఒలింపిక్స్ ప్రారంభరోజున ఓస్లోలోని నేషనల్ మ్యూజియంలోకి ప్రవేశించిన ఇద్దరు దొంగలు.. ‘ద స్క్రీమ్’ కాన్వాస్‌ మరో వెర్షన్‌ను దొంగిలించారు. అంతేకాదు “బ్యాడ్ సెక్యూరిటీకి వెయ్యి ధన్యవాదాలు!” అని ఓ మెసేజ్‌ను రాసిపెట్టి వెళ్లడం విశేషం. ఈ ఆర్ట్ వర్క్ తిరిగిచ్చేందుకు దొంగలు 1 మిలియన్ డాలర్స్ డిమాండ్ చేసినా అందుకు ప్రభుత్వం ఒప్పుకోలేదు. అయితే మూణ్నెళ్ల తర్వాత నార్వేజియన్ ఓడరేవు పట్టణం అస్గార్డ్‌స్ట్రాండ్‌లోని ఒక హోటల్‌లో ఈ ఆర్ట్ వర్క్ అన్ డ్యామేజ్డ్‌గా లభించింది. చివరకు1996లో నలుగురు వ్యక్తుల్ని ఈ దొంగతనం కేసులో దోషులుగా నిర్ధారించారు.

84 మిలియన్ డాలర్ల విలువ :

జ్యూరిచ్‌ నగరంలో ఉన్న ‘ఎమిల్ బుహెర్లే కలెక్షన్’ ఆర్ట్ మ్యూజియంలో 2008లో జరిగిన దొంగతనాన్ని యూరప్‌లోనే అతిపెద్ద ఆర్టిస్టిక్ దొంగతనాల్లో ఒకటిగా వర్ణించవచ్చు. సెజాన్నే ‘బాయ్ ఇన్ ద రెడ్ వెస్ట్ ‌కోట్’, మోనెట్ ‘పాపీ ఫీల్డ్ ఎట్ వెథ్యూయిల్’, ఎడ్గర్ డెగాస్ ‘లుడోవిక్ లెపిక్ అండ్ హిజ్ డాటర్స్’, విన్సెంట్ వాన్ గోహ్ ‘బ్లూమింగ్ చెస్ట్‌నట్ బ్రాంచెస్’ వంటి కళాఖండాలను ఈ మ్యూజియం నుంచి దొంగిలించగా, వాటి మొత్తం విలువ 84 మిలియన్ డాలర్లుగా అంచనా వేశారు. ఇంతకీ ఈ దొంగతనం ఎలా జరిగిందంటే.. 2008లో సందర్శకుల కోసం మ్యూజియంను ఓపెన్ చేయగా, ముగ్గురు దొంగలు ముసుగు ధరించి ప్రవేశించారు. వారిలో ఒకరు ప్రవేశద్వారం వద్ద గల సిబ్బందిని పిస్టల్‌తో బెదిరించగా, మిగతా ఇద్దరు ఎగ్జిబిషన్ హాల్‌లోకి వెళ్లి ఆర్ట్ వర్క్స్‌ను దొంగిలించారు. అయితే ‘వాన్ గోహ్, మోనెట్ ఆర్ట్ వర్క్స్’ కొద్ది రోజుల్లోనే కార్ పార్కింగ్‌లో వదిలేసిన ఓ వాహనంలో లభిస్తే, సెజాన్నే కళాచిత్రం సెర్బియాలో(2012) దొరికింది. ఈ దొంగతనం కేసులో నలుగురు సెర్బియా యువకులు అరెస్టయ్యారు.

ఫ్రెంచ్ స్పైడర్‌మ్యాన్ రాబరీ :

రాక్ క్లైంబర్ వెరన్ టామిక్ (ఫ్రెంచ్ స్పైడర్ మ్యాన్‌గా ప్రసిద్ధి) 2010 ఏప్రిల్ 20 తెల్లవారుజామున 3 గంటలకు పారిస్‌లోని ‘మ్యూజియం ఆఫ్ మోడర్న్ ఆర్ట్’‌‌‌ కిటికీ పైనున్న గ్లాస్ పగులగొట్టి మ్యూజియంలోకి ప్రవేశించాడు. చివరకు అతడిని పోలీసులు 2011లో చేయగా.. ఫెర్నాండ్ లెగర్ ‘స్టిల్ లైఫ్ విత్ కాండిల్ స్టిక్’ ఆర్ట్ వర్క్ దొంగిలించడానికి మాత్రమే మ్యూజియంలోకి ప్రవేశించానని చెప్పాడు. కానీ అతడు పాబ్లో పికాసో ‘డోవ్ విత్ గ్రీన్ పీస్’, హెన్రీ మాటిస్సే ‘పాస్టోరల్’, జార్జ బ్రాక్ ‘ఆలివ్ ట్రీ నియర్ ఎస్టాక్’, అమెడియో మోడిగ్లియాని ‘ఉమెన్ విత్ ఎ ఫ్యాన్’ కళాక్షేత్రాలను తన వెంట తీసుకెళ్లినట్లు తేలింది. ఈ కేసులో టామిక్‌కు ఎనిమిది సంవత్సరాల జైలు శిక్ష విధించగా, ఇందుకు సహకరించిన అతడి స్నేహితులకు కూడా శిక్షతో పాటు 104 మిలియన్ డాలర్ల జరిమానా విధించారు.

దొంగిలించిన కళా ఖండాలు..

2020లో కొవిడ్ -19 మహమ్మారి కారణంగా నెదర్లాండ్స్ మ్యూజియం మూసివేసినప్పుడు, వాన్ గోహ్ ‘ది పార్సోనేజ్ గార్డెన్ ఎట్ స్ప్రింగ్ ఇన్ న్యూనెన్ ఎట్ స్ప్రింగ్’, ఫ్రాన్స్ హాల్స్ ‘టూ లాఫింగ్ బాయ్స్’ చోరీకి గురయ్యాయి. అయితే సదరు దొంగలు పట్టుబడగా, వారి నుంచి ఆర్ట్ వర్క్స్ రికవరీ చేశారు. ఇక ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్ట్ మ్యూజియం ‘లూవ్రే’ నుంచి 1911లో వరల్డ్ ఫేమస్ లియోనార్డో డావిన్సీ ‘మోనాలిసా’ కళాఖండాన్ని ఇటాలియన్ ఉద్యోగి దొంగిలించాడు. అయితే 1913లో ఆ పెయింటింగ్ తిరిగి మ్యూజియానికి చేరింది. ఇటలీ, పలెర్మోలోని ‘ఒరాటరీ ఆఫ్ శాన్ లోరెంజో’ నుంచి కారవాగియో ‘నేటివిటీ విత్ సెయింట్ ఫ్రాన్సిస్ అండ్ సెయింట్ లారెన్స్’‌ను దొంగలు ఎత్తుకెళ్లారు. కాగా ఈ చిత్రరాజం ఇప్పటికీ మిస్సింగ్‌ లిస్ట్‌లోనే ఉంది. ఇదేకాక ఇటలీలోని పియాసెంజాలోని ‘గల్లెరియా డి ఆర్టే మోడెర్నా’ నుంచి 1997లో గుస్తావ్ క్లిమ్ట్ ‘పోర్ట్రెయిట్ ఆఫ్ ఎ లేడీ’ దొంగిలించబడగా.. 2019లో మ్యూజియం తోటమాలి గోడ వెనుకున్న ఓ చెత్త సంచిలో ఈ ఆర్ట్ వర్క్‌ను కనుగొన్నాడు.

Next Story

Most Viewed