‘జర్నలిస్టులపై వివక్ష ఎందుకు’

by  |
‘జర్నలిస్టులపై వివక్ష ఎందుకు’
X

దిశ, కరీంనగర్ సిటీ : కరోనా ప్రభావంతో రాష్ట్రంలోని అన్ని వర్గాలను ఆదుకుంటున్నామని ప్రకటిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, జర్నలిస్టుల పట్ల వివక్ష ప్రదర్శిస్తుందని బీజేపీ దళిత మోర్చా జిల్లా అధ్యక్షుడు సోమిడి వేణు ఆరోపించారు. కరోనా సెకండ్ వేవ్ కాటుకు జిల్లాలో ముగ్గురు, రాష్ట్రవ్యాప్తంగా ఐదుగురు జర్నలిస్టులు బలి కాగా, రాష్ట్ర ప్రభుత్వ నేతలు కానీ, అధికార యంత్రాంగం కానీ ఇప్పటివరకు స్పందించకపోవడం శోచనీయమన్నారు.

జర్నలిస్టులను ఫ్రంట్లైన్ వారియర్స్ గా ప్రకటించకున్నా, కరోనా బాధితులకు సేవ చేయడంలో పరోక్షంగా అందరికన్నా ముందు ఉంటున్న వారి పట్ల, నిర్లక్ష్యం ప్రదర్శించడం సముచితం కాదన్నారు. తమ ప్రాణాలు పణంగా పెట్టి విధులు నిర్వహిస్తూ, ప్రస్తుత తరుణంలో సేవలందిస్తున్న జర్నలిస్టులను ఆదుకోవాల్సిన గురుతర బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. తెలంగాణ ఉద్యమంలో సైతం వారి పాత్ర మరిచిపోలేనిదని, చిత్తశుద్ధితో విధులు నిర్వహిస్తున్న పాత్రికేయులను కరోనా మహమ్మారి బలి తీసుకుంటుండగా, వారి కుటుంబ సభ్యులు వీధిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం నిద్రలేచి మృతి చెందిన జర్నలిస్టుల కుటుంబాలకు 50 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించి, వారి కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం కల్పించాలని, జర్నలిస్టులందరికీ భీమా సౌకర్యం కల్పించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

Next Story

Most Viewed