ఈసారి డిజిటల్ బడ్జెట్.. అందరికీ టెస్ట్‌లు?

by  |
TS budget meetings
X

దిశ, తెలంగాణ బ్యూరో: కరోనా నేపథ్యంలో నిర్వహించే ఈ బడ్జెట్ సమావేశాలు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. ప్రభుత్వం పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నా.. ఒకింత ఆందోళన కలిగిస్తున్నది. గతేడాది సెప్టెంబరులో నిర్వహించిన సమావేశాల్లో తీసుకున్న విధంగానే ఈసారీ కరోనా నివారణ కోసం పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నది. కేంద్రం తరహాలోనే.. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈసారి బడ్జెట్ సమావేశాలను డిజిటల్ పద్ధతిలో నిర్వహించాలని యోచిస్తున్నది. ఇంకా స్పష్టమైన నిర్ణయాన్ని తీసుకోకపోయినప్పటికీ ఆ దిశగా చర్చలు మొదలయ్యాయి. అసెంబ్లీ, కౌన్సిల్ సభ్యులందరికీ పెన్‌డ్రైవ్‌ల ద్వారానే బడ్జెట్ సంబంధ డాక్యుమెంట్లను ఇవ్వాలనే ప్రతిపాదనలపై స్పీకర్, అసెంబ్లీ కార్యదర్శి, శాసన వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రాథమిక స్థాయిలో చర్చించారు.

కానీ విధానపరమైన నిర్ణయం వెలువడాల్సి ఉంది. ఒక్కసారిగా డిజిటల్ బడ్జెట్‌వైపు మారితే ఎదురయ్యే ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని పరిమిత సంఖ్యలో కాపీలను ప్రింట్ చేయించాలన్న ఆలోచన కూడా ఉంది. రెండు వేర్వేరు కౌంటర్ల ద్వారా సోషల్ డిస్టెన్స్ నిబంధన మేరకు అవసరమైన సభ్యులకు మాత్రమే పంపిణీ చేసేలా తాత్కాలిక ఏర్పాట్లపై అధికారులు చర్చిస్తున్నారు. శాసనసభ, శాసనమండలిలో గవర్నర్ ప్రసంగం, బడ్జెట్ ప్రసంగాలను ప్రత్యక్ష ప్రసారం చేయడంతో పాటు ప్రభుత్వ వెబ్‌సైట్ (ఆన్‌లైన్)లో కూడా వెంటనే అప్‌లోడ్ చేయడంపై సమావేశంలో చర్చించారు. దీని ద్వారా ఫిజికల్ కాపీల అవసరం ఉండదని, వెంటవెంటనే వినియోగించుకునే వెసులుబాటు లభిస్తుందని అధికారులు భావిస్తున్నారు. పార్లమెంటులో ఈసారి పూర్తిస్థాయి డిజిటల్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టినా రాష్ట్రంలో దాని సాధ్యాసాధ్యాలపై ఆధారపడి ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.

కరోనా పరీక్షలు కంపల్సరీ

అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, అధికారులతో పాటు అసెంబ్లీ సిబ్బంది, పాత్రికేయులు, మార్షల్స్, పోలీసు సెక్యూరిటీ సిబ్బంది.. అందరూ విధిగా కరోనా పరీక్షలు చేయించుకునేలా టెస్టింగ్ కేంద్రాలను అసెంబ్లీ ఆవరణలోనే ఏర్పాటు చేసేలా వైద్యారోగ్య శాఖ అధికారులతో స్పీకర్ చర్చించారు. నెగెటివ్ ఉన్నవారిని మాత్రమే అనుమతించాలని, పాజిటివ్ ఉన్నట్లయితే వెంటనే వెనక్కి పంపించేయాలని స్పీకర్ స్పష్టం చేశారు. ఎక్కువ మంది గుమికూడకుండా సోషల్ డిస్టెన్స్ నిబంధనతో పాటు పాత్రికేయులను కూడా పరిమిత సంఖ్యలోనే అనుమతించేలా పాస్‌లను అసెంబ్లీ కార్యదర్శి పంపిణీ చేశారు. పాత్రికేయులు కేవలం గ్యాలరీ వరకు మాత్రమే పరిమితం కావాలని, లాబీల్లోకి, ఇతర ప్రాంతాల్లోకి ప్రవేశించడంపై ఆంక్షలు విధించినట్లు తెలిపారు. మీడియా పాయింట్‌ను కూడా తాత్కాలికంగా ఎత్తివేశారు.

మండలి, అసెంబ్లీల్లో రోజూ శానిటైజేషన్​అన్ని నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేలు, వారితో పాటు కొద్దిమంది వ్యక్తిగత సహాయకులు కూడా వస్తున్నందున కరోనా పరీక్షలతోనే సరిపెట్టకుండా ప్రతీరోజు రెండుసార్లు శాసనసభ, శాసనమండలి హాళ్ళను, ప్రాంగణాన్ని శానిటైజ్ చేసేలా స్పీకర్ ఆదేశించారు. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాల్సిందేనని, అసెంబ్లీ సిబ్బందికి సహకరించాలని స్పీకర్ స్పష్టం చేశారు. పోలీసు బందోబస్తు పైనా చర్చించారు. సమావేశానికి కౌన్సిల్ డిప్యూటీ ఛైర్మన్ నేతి విద్యాసాగర్ రావు, చీఫ్ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు, అసెంబ్లీ కార్యదర్శి నర్సింహాచార్యులు, ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్‌రాజ్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, వైద్యారోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్​కుమార్, హైదరాబాద్ కలెక్టర్ శ్వేతామహాంతి, డీజీపీ మహేందర్ రెడ్డి, హోం కార్యదర్శి రవి గుప్తా, హైదరాబాద్ పోలీసు కమిషనర్ అంజనీ కుమార్, రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్​భగవత్, ఇంటెలిజెన్స్ ఐజీ ప్రభాకర్ రావు, అదనపు పోలీసు కమిషనర్ (ట్రాఫిక్) తదితరులు హాజరయ్యారు.

Next Story

Most Viewed