ఇకపై పెళ్లి చేసుకోవాలంటే.. కొత్త రోడ్లు వేయాల్సిందేనా..!

by  |

దిశ, వెబ్‌డెస్క్ : ప్రతి ఇంట్లో పెళ్లి అనేది ఒక ప్రత్యేక సందర్భం. సాధారణంగా పెళ్లి అంటే ప్రతి ఇంట్లో చిన్న చిన్న పనులు చేసుకోవడం, ఇంటిని మరమ్మతులు చేసుకోవడం, ఇంటికి సున్నాలు వేసుకోవడం చేస్తారు. పెళ్లికి వచ్చే తమ ఆహ్వానితులకు అన్ని సౌకర్యాలు ఉండే విధంగా చూసుకుంటాం. వారికి ఎలాంటి అసౌకర్యాలు లేకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాం. ఇంకా కొంచెం ఆర్థికంగా ఉన్న వారు అయితే ఆహ్వానితులను రెడ్ కార్పెట్‌పై స్వాగతించే విలాసవంతమైన వివాహాలను మీరు చూసి ఉండవచ్చు. కాని పెళ్లి కోసం ఏకంగా ఒక రోడ్డునే వేశారు. ఈ అరుదైన ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లాలో జరిగింది. పెళ్లికి వచ్చే ఆహ్వానితులు తమ ఇంటికి సాఫీగా వచ్చేందుకు పెళ్లికి ఒకరోజు ముందు పెళ్లికొడుకు కుటుంబం బ్లాక్‌టాప్ రోడ్డు వేయాల్సి వచ్చింది.

నరసాపురం కోర్ట్‌లో గుమాస్తాగా పనిచేస్తున్న నిరీక్షణరావు ఇటీవల తన కుమారుడి వివాహం చేశాడు. దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. ఈ క్రమంలో గ్రామంలోని తమ ఇంటికి వచ్చే రహదారి గుంతలతో నిండి ఉందని కుటుంబీకులు దృష్టికి తీసుకువచ్చారు. కొడుకు వివాహనికి వచ్చే బంధువులకు రోడ్డు ఇబ్బందిగా ఉంటుందని భావించిన నిరీక్షణరావు.. ఏకంగా కొత్త రోడ్డు వేయాలని నిర్ణయించుకున్నాడు. తన సొంత డబ్బు రూ.లక్షకు పైగా వెచ్చించి దాదాపు అర కిలోమీటర్ రోడ్డు వేశారు.

ఈ వార్త ఆ నోట, ఈ నోట వైరల్‌గా మారి.. ప్రభుత్వ ఉన్నతాధికారులకు చేరింది. వాస్తవానికి తమ గ్రామం మీదుగా నర్సాపురం నుంచి పాలకొల్లు వరకు రోడ్డు మంజూరైనా కాంట్రాక్టర్ పనులు ప్రారంభించలేదని నిరీక్షణరావు తెలిపారు. ఆ రోడ్డుపై ప్రయాణించే వారంతా చాలా కాలంగా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అందుకే పెళ్లికి వచ్చే బంధువులకు ఇబ్బంది కలగకుండా రోడ్డు వేశామని చెప్పుకొచ్చారు. అంతే తప్ప మేం ఏ పబ్లిసిటీ కోసమో, రాజకీయం చేయడానికో కాదని స్పష్టం చేశాడు నిరీక్షణ రావు.

FOLLOW US ON ► Facebook , Google News , Twitter , Koo , ShareChat , Telegram , Disha TV

Next Story