న్యాయం చేస్తారా.. చావమంటారా.. MRO ఆఫీస్ ముందు రైతు నిరసన..

by  |
న్యాయం చేస్తారా.. చావమంటారా.. MRO ఆఫీస్ ముందు రైతు నిరసన..
X

దిశ, మణుగూరు : భద్రాది కొత్తగూడెం జిల్లాలో రెవెన్యూ అధికారుల అవినీతి బాగోతం బట్టబయలైంది. మణుగూరు మండల పరిధిలోని మల్లారం రెవెన్యూ గనిబోయినగుంపు గ్రామ సమీపంలో సర్వే నెంబర్ 49/25/అ లో విస్తీర్ణం య.5.03 గుంటల భూమి, ఆశ్వాపురం మండలం మనుబోతులగూడెం గ్రామానికి చెందిన మిడియం సింగయ్య పేరిట ఉంది. అయితే ఈ భూమిని రెవెన్యూ అధికారులతో పింగాళి చిన రాజు అనే వ్యక్తి కుమ్మకై రైతుబంధు పాసు పుస్తకం మంజూరు చేయించుకున్నాడు. అధికారులకు ముడుపులు ముట్టజెప్పడం వల్లే సింగయ్య భూమిని చిన రాజు అనే వ్యక్తి పేరుమీదకు మార్చారని అంటున్నారు స్థానికులు.

ఈ విషయమై సింగయ్య ఎమ్మార్వోకు విన్నవించగా.. చిన రాజుకు సింగయ్యలకు నోటీసులు జారీ చేసి విచారించారు. అయితే విచారణలో నకిలీ ధృవపత్రాలు సృష్టించి చిన రాజు భూమిని తన పేరుమీద చేయించుకున్నాడని తేలింది. అయినా ఇప్పటి వరకు అతనిపై చర్యలు తీసుకోలేదు. ఈ విషయమై సింగయ్య తనకు న్యాయం చేయాలంటూ ఎమ్మార్వో కార్యాలయం ముందు పడుకొని నిరసన వ్యక్తం చేశాడు. ఇప్పటివరకు జిల్లా కలెక్టర్, సబ్ కలెక్టర్‌తో పాటు సంబంధిత అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోకపోవడం గమనార్హం.

కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతుబంధు, ధరణి లాంటి పథకాలను అధికారులు నీరుగార్చుతున్నారనే దానికి ఈ ఘటన నిదర్శనమని ప్రజలు అంటున్నారు. అధికారులకు డబ్బులు ముట్టజెప్పితే ఎవరి భూమినైనా ఎవరి పేరుమీదికైనా మారుస్తారా అంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి సింగయ్యకు న్యాయం చేయాలని అప్పటివరకు కార్యాలయం ముందే ఉంటానని వెల్లడించారు.



Next Story