బొంతు శ్రీదేవికే మేయర్ పీఠం..?

by  |
బొంతు శ్రీదేవికే మేయర్ పీఠం..?
X

దిశ, తెలంగాణ బ్యూరో: జీహెచ్ఎంసీ మేయర్ పదవి బొంతు రామ్మోహన్ సతీమణి, చర్లపల్లి కార్పొరేటర్ శ్రీదేవికే దక్కే అవకాశం ఉందని టీఆర్ఎస్ పార్టీవర్గాల సమాచారం. శనివారం ఆ దంపతులు సీఎం కేసీఆర్ ఆశీర్వాదం కూడా తీసుకున్నారని విశ్వసనీయంగా తెలిసింది. పదవిని ఆశిస్తున్న ఇతర కార్పొరేటర్లకు స్థానిక ఎమ్మెల్యేల నుంచి సహకారం లభించడం లేదు. రామ్మోహన్ ఉద్యమ కాలం నుంచి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ వెన్నంటి ఉన్నారన్న సానుకూలత ఉంది. మిగతావారికి పార్టీలో సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని అధిష్ఠానం భావిస్తున్నట్లు సమాచారం.

ఇప్పటికే కొన్ని సామాజికవర్గాలు కూడా శ్రీదేవి అభ్యర్ధిత్వాన్ని ఖరారు చేయాలని అధినేతను కోరినట్లు ప్రచారం జరుగుతోంది. అన్నింటికి మించి మేయర్ గా బొంతు రామ్మోహన్ అనుభవం ఆయన సతీమణి పదవీ కాలంలోనూ ఉపయోగపడుతుందన్న అభిప్రాయంతో అధిష్ఠానం ఉంది. రామ్మోహన్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ కు అత్యంత సన్నిహితంగా ఉన్నారు. అందుకే సీల్డు కవర్ లో దాదాపు ఆమె పేరే ఉంటుందని చెబుతున్నారు.

ఇంకా మూడు రోజులే

మరో మూడు రోజులలో 11న గ్రేటర్ హైదరాబాద్ మేయర్ పీఠానికి ఎన్నికలు జరుగనున్నాయి. ఇన్నాండ్లుగా మేయర్, డిప్యూటీ మేయర్ పీఠాన్ని తాము చేపట్టబోమంటూ, టీఆర్ఎస్ వేచి చూసే ధోరణిని అవలంబించింది. ఎంఐఎంతో పొత్తు ప్రస్తావనే లేదని తేల్చి చెప్పింది. మేయర్ పీఠం అంశంలో బీజేపీని ఇరుకున పెట్టే ప్రయత్నం చేయాలని భావించింది. తీరా సీల్డు కవర్ లో అభ్యర్ధి పేరును పంపుతామని సీఎం కేసీఆర్ ఆదివారంనాటి సమావేశంలో స్పష్టం చేశారు.

ఆశావహుల సంఖ్య పెద్దగానే ఉంది. మేయర్ కుర్చీ తమ పరిధిలోని కార్పొరేటర్లకు ఇవ్వొద్దంటూ కొందరు ఎమ్మెల్యేలు ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు తెలిసింది. ప్రస్తుత మేయర్ రామ్మోహన్ భార్య శ్రీదేవికే ఇవ్వాలని ఓ ఎమ్మెల్యే స్పష్టం చేశారని సమాచారం. కొందరు మహిళా అభ్యర్ధులు మేయర్ కుర్చీ కోసం విశ్వప్రయత్నాలు చేశారు. ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టలేకపోయారు. ఏ ఎమ్మెల్యే కూడా మేయర్, డిప్యూటీ మేయర్ పదవుల కోసం అధిష్ఠానానికి సిఫారసు చేయలేదు. నెత్తిమీద కుంపటి ఎందుకు ఎత్తుకోవాలన్న ఉద్దేశ్యంతో తమ పరిధి కార్పొరేటర్లకు మేయర్ పీఠం దక్కకుండా ప్రయత్నాలు చేశారని అంటున్నారు.

ఏకు మేకులవుతారని

తమ పరిధిలోని కార్పొరేటర్ మేయర్ గా ఎన్నికైతే ఏకు మేకయ్యే అవకాశముందన్న నెపంతోనే ఎమ్మెల్యేలు రికమండ్ చేయడం లేదని చెబుతున్నారు. ఇప్పటికే మేయర్ రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ ప్రాతినిధ్యం వహించే డివిజన్లు, ఎమ్మెల్యేల మధ్య అభిప్రాయ బేధాలు ఉన్నాయి. ఎన్నికల వేళ ఉప్పల్ లో ఇవి తారస్థాయిలో కనిపించాయి.

ప్రచారంలో చాలా రోజుల వరకు కార్పొరేటర్లు కనిపించలేదన్న ఆరోపణలు ఉన్నాయి. మేయర్ గా ఎన్నికైనవారు కేబినేట్ హోదా పొందుతారు. ప్రోటోకాల్ సమస్య తలెత్తుంది. మేయర్ ఆధిపత్యం కొనసాగుతుంది. తాము ఎమ్మెల్యేలుగా ఉన్నా మేయర్ తర్వాతే అన్నట్లుగా జనంలోకి వెళ్లాల్సి వస్తుంది. అందుకే మేయర్ కుర్చీ తమవారికి ఇవ్వొద్దంటూ అధిష్ఠానాన్ని వేడుకుంటున్నట్లు విశ్వససనీయంగా తెలిసింది. ఈ అన్ని పరిణామాలు బొంతు దంపతులకు సానుకూలంగా మారాయని అంటున్నారు. సీఎం కేసీఆర్ కూడా అంగీకరించడంతో శ్రీదేవి మేయర్ పదవిని అలంకరించడం ఖాయమనే చెబుతున్నారు.

Next Story