ఆరోగ్య సిబ్బంది నైపుణ్యం పెంచుకోవాలి : డాక్టర్ చంద్రశేఖర్

163
Central-Health-Team

దిశ, కాటారం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శుక్రవారం సెంట్రల్ హెల్త్ టీమ్ తనిఖీ చేసింది. ఈ సందర్భంగా పీహెచ్‌సీలో నేషనల్ హెల్త్ మిషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవలపై ఆరా తీశారు. జాయింట్ డైరెక్టర్, పబ్లిక్ హెల్త్ స్పెషలిస్ట్ డాక్టర్ చంద్రశేఖర్, జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి డాక్టర్ శ్రీరాం, రీజినల్ హెల్త్ అండ్ ఫామిలీ వెల్ఫేర్ ఆఫీస్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రవీంద్రలు తనిఖీల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ గర్భిణికి చేస్తున్న చెకప్‌ను పరిశీలించి, హై రిస్క్ ప్రెజ్ఞెన్సీని ఎలా గుర్తి్స్తున్నారని ప్రశ్నించారు. ప్రసవాలు సిజేరియన్ చేస్తున్నారా, నార్మల్ చేస్తున్నారా, ఎలాంటి కేసులను హై లెవెల్ ఆసుపత్రికి రెఫర్ చేస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్య అవసరాల కోసం ఇతర ఆసుపత్రులకు తరలించేటప్పుడు ప్రభుత్వ వాహనాన్ని వినియోగిస్తున్నారా? లేక ఇతర వాహనాన్ని రెఫర్ చేస్తున్నారా అని అడిగారు.

అనవసరంగా పేషెంట్లను ఇతర ఆసుపత్రులకు రెఫర్ చేయొద్దని, ఇక్కడే పూర్తిస్థాయిలో పేషెంట్‌కు వైద్యసేవలు అందించాలని, స్టాఫ్ నర్సులు లేబర్ రూమ్ ప్రోటోకాల్స్ పాటించాలని సూచించారు. ప్రసవ సమయంలో ప్రతికూల పరిస్థితులు ఏర్పడితే, నైపుణ్యంతోని ప్రసవం చేసి తల్లీ బిడ్డలను రక్షించాలని, రోజురోజుకూ స్టాఫ్ నైపుణ్యం పెంచుకోవడంతో పాటు అప్‌డేట్ కావాలని తెలిపారు. అన్ని వసతులు ఉన్నాయా అని అడిగి, లేకపోవే వెంటనే సమకూర్చుకోవాలని తెలిపారు. మందుల కొరత రానివ్వొద్దని డాక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. వైద్యులు మంచి హృదయంతో సేవలు అందించాలని, ప్రజల్లో నమ్మకం కలిగించాలని, ప్రతిఒక్కరూ ఆత్మ విశ్వాసంతో పని చేయాలని ఆయన చెప్పారు. ఈ తనిఖీల్లో మెడికల్ ఆఫీసర్లు డాక్టర్ శ్రీదేవి, డాక్టర్ ఉమాదేవి, డాక్టర్ రామారావు పూనెం, క్వాలిటీ మేనేజర్ భాను కుమార్, మాస్ మీడియా ఆఫీసర్ అన్వర్, పీఎంఓ మల్లయ్య, హెల్త్ ఎడ్యుకేటర్ రాజు, సబ్ యూనిట్ ఆఫీసర్ నాగిరెడ్డి, ఏపీఎంఓ బుచ్చి రాములు తదితరులు పాల్గొన్నారు.