ఈసారి సాగు చేయాల్సిన పంటల ఇవే..!

154
crops

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ఏ జిల్లాలో ఏ పంట వేయాలనే అంశంపై కేంద్రం మార్గదర్శకాలు జారీ చేసింది. రాష్ట్రాల నుంచి పూర్తి సమాచారం, అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్రాలకు లేఖ రాసింది. తెలంగాణలోని 33 జిల్లాల్లో సాగు చేయాల్సిన పంటలపై స్పష్టంగా వివరించింది. పంటల సాగుకు అనుగుణంగా స్థానికంగానే ఫుడ్​ ప్రాసెసింగ్​ యూనిట్లను ఏర్పాటు చేయడం వంటి అంశాలపై కూడా సూచనలు చేసింది.

ఒక జిల్లా.. ఒకే పంట

దేశంలో రైతుల ఆదాయం రెట్టింపు చేసే విధానంలో భాగంగా కేంద్రం పలు నిర్ణయాలు తీసుకుంది. ఒక జిల్లా… ఒకే పంట కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి మైక్రో ఫుడ్​ ప్రాసెసింగ్​ ఎంటర్​ప్రైజెస్​ స్కీంను అమల్లోకి తీసుకువస్తోంది. మిషన్​ ఇంటిగ్రేటేడ్​ డెవలప్​మెంట్​ ఆఫ్​ హార్టికల్చర్​, నేషనల్​ ఫుడ్​ సెక్యూరిటీ మిషన్​, రాష్ట్రీయ కృషి వికాస్​ యోజన, ప్రధానమంత్రి కృషి వికాస్​ యోజనలో జిల్లాల వారీగా సాగు చేయాల్సిన పంటలను మార్గదర్శకాల్లో సూచించారు. రైతులకు ప్రయోజనాల కోసం ఈ నిర్ణయాలు తీసుకున్నామని, రాష్ట్రాలు అమలు చేయాలని పేర్కొన్నారు.

అమలు చేస్తారా..?

తెలంగాణ ప్రభుత్వం కేంద్ర వ్యవసాయ చట్టాలనే అమలు చేస్తామని ప్రకటించింది. వ్యవసాయ రంగంలో కేంద్రం తీసుకునే నిర్ణయాలకు కట్టుబడి ఉన్నట్లే సాగుతోంది. అందులో భాగంగానే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను సైతం ఎత్తివేయనున్నట్లు సీఎం కేసీఆర్​ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్రం మైక్రో ఫుడ్​ ప్రాసెసింగ్​ ఎంటర్​ప్రైజెస్​ స్కీం (పీఎం–ఎఫ్​ఎంఈ)పై రాష్ట్రాలకు లేఖలు పంపింది. జిల్లాల వారీగా ఏ పంటలు వేయాలి, వ్యవసాయానుబంధ రంగాల్లో అవలంబించాల్సిన అంశాలను సూచించింది. రాష్ట్రంలో ప్రధాన పంటలను కాదని తృణధాన్యాలు, మిర్చి వంటి పంటలతో పాటుగా మత్స్య అనుబంధ సాగును సూచించింది. అయితే తెలంగాణ ప్రభుత్వం దీన్ని అమల్లోకి తెస్తుందా లేదా అనేది తేలడం లేదు. నిజామాబాద్​ జిల్లాలో పసుపు పంటను సూచించిన కేంద్రం, సిరిసిల్ల జిల్లాలో మత్స్య పెంపకాన్ని పేర్కొంది.

ఫుడ్​ ప్రాసెసింగ్​ యూనిట్లు కూడా..

జిల్లాల వారీగా పంటల సాగు సూచించిన కేంద్రం ఆ ప్రాంతాల్లో ఏర్పాటు ఫుడ్​ ప్రాసెసింగ్​ యూనిట్ల ఏర్పాటును కూడా తెలియజేసింది. సాగును బట్టి స్థానికంగా ఈ పరిశ్రమలు ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుందని పేర్కొంది. కొన్నిచోట్ల ఇప్పటికే కొన్ని పరిశ్రమలున్నాయి. ఖమ్మంలో మిరప పౌడర్​, వనపర్తిలో నూనె, మెదక్​, వికారాబాద్​ల్లో పండ్లు, చిల్లీ, టమాటా సాస్​, జగిత్యాలలో మామిడి గుజ్జు, మహబూబ్​నగర్​లో సీతాఫలం, మామిడి గుజ్జు వంటి పరిశ్రమలు కొంత మేరకు నడుస్తున్నాయి. వీటిని మహిళా సంఘాల ఆధ్వర్యంలో నడిపిస్తున్నారు.

జిల్లాల వారీగా పంటలు ఇవే

జిల్లా సాగు చేయాల్సిన పంట (అనుబంధ పంటలు)

ఆదిలాబాద్                                       సోయాబీన్​
భద్రాద్రి కొత్తగూడెం                             మిర్చి
హైదరాబాద్​                                      రెడీ టూ ఈట్​ స్నాక్స్​
జగిత్యాల                                          మామిడి
జనగామ                                           వరి ( చిట్టి ముత్యాలు)
జయశంకర్​ భూపాలపల్లి                       మిర్చి
జోగుళాంబ గద్వాల                             పల్లి
కామారెడ్డి                                          సోయాబీన్​
కరీంనగర్​                                         వరి
ఖమ్మం                                            మిర్చి
కుమ్రం భీం ఆసిఫాబాద్​                       తృణ ధాన్యాలు
మహబూబాబాద్​                                 మిర్చి
మహబూబ్​నగర్​                                 తృణ ధాన్యాలు
మంచిర్యాల                                      మామిడి
మెదక్​                                             రెడీ టూ ఈట్​ స్నాక్స్​
మేడ్చల్​ మల్కాజిగిరి                           రెడీ టూ ఈట్​ స్నాక్స్​
ములుగు                                          మిర్చి
నాగర్​ కర్నూల్​                                  మామిడి
నల్గొండ                                          స్వీట్​ ఆరెంజ్​
నారాయణపేట                                  పల్లి
నిర్మల్​                                            సోయాబీన్​
నిజామాబాద్​                                     పసుపు
పెద్దపల్లి                                          వరి
రాజన్న సిరిసిల్ల                                ఫిషరీస్​ (మత్స్యరంగం)
రంగారెడ్డి                                         కూరగాయలు
సంగారెడ్డి                                        పాల ఆధారిత ప్రొడక్ట్స్​
సిద్దిపేట                                         కూరగాయలు
సూర్యాపేట                                     పాల ఆధారిత ప్రొడక్ట్స్​
వికారాబాద్​                                      కూరగాయలు
వనపర్తి                                          పల్లి
వరంగల్​ రూరల్​                               వెదురు, మిరప
వరంగల్​ అర్బన్​                               రెడీ టూ ఈట్ స్నాక్స్​
యాదాద్రి భువనగిరి                           పాల ఆధారిత ప్రొడక్ట్స్​

అలాగే, ఏపీలోని 13 జిల్లాల్లో కూడా సాగు చేయాల్సిన పంటలను కేంద్రం సూచించింది. అనంతపురం జిల్లాలో పల్లి, చిత్తూరులో టమాట, ఈస్ట్​ గోదావరిలో కొబ్బరి, గుంటూరులో మిర్చి, పసుపు, కడపలో అరటి, కృష్ణాలో మామిడి, కర్నూల్​లో ఉల్లి, నెల్లూరులో సిట్రల్​ (పుల్లని పండ్ల తోటలు), ప్రకాశంలో మిర్చి, పసుపు, శ్రీకాకుళం జీడిపప్పు, విశాఖపట్నం చెరుకు, విజయనగరం మామిడి, వెస్ట్​ గోదావరి అక్వా ( ఫిషరీష్​ చెరువులు) సాగు చేయాలని కేంద్రం సూచించింది.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..