వివాదాస్పదంగా మారిన టీఆర్ఎస్ నాయకుల తీరు.. చంపుతామంటూ బెదిరింపులు

by  |
వివాదాస్పదంగా మారిన టీఆర్ఎస్ నాయకుల తీరు.. చంపుతామంటూ బెదిరింపులు
X

దిశ, చిట్యాల: జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని నైన్‌పాక గ్రామ శివారు వ్యవసాయ భూములను సుమారు 40 ఏళ్లుగా వరికోల్‌పల్లి, కుమ్మరిపల్లి గ్రామానికి చెందిన రైతులు సాగు చేసుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత సాదాబైనామా ప్రక్రియలో పట్టాలు పొందిన రైతుల భూములను ఇటీవలే ఉన్నతాధికారుల సూచన మేరకు రెవెన్యూ శాఖ అధికారులు ఫ్రీజింగ్ చేశారు. దీంతో వేలాది మంది రైతులు బ్యాంకుల్లో తీసుకున్న రుణాలను రెన్యూవల్ చేయడానికి వన్ బీ లు రావడం లేదని వాపోతూ, తహసీల్దార్, కలెక్టర్ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేశారు. అయినప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడంతో నిన్నటి నుంచి దీక్షకు దిగారు. ఫ్రీజింగ్ భూముల గురించి మాట్లాడితే చంపుతామంటూ బెదిరింపులకు దిగారు అధికార పార్టీ నాయకులు. వివరాల్లోకి వెళితే.. నైన్‌పాక గ్రామ శివారులోని సర్వే నంబర్లు 440, 441, 442, 443 లోని 1000 ఎకరాలకు పైగా భూమిని గత 40 సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్నారు.

ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారికి పట్టా పాసు బుక్కులను సైతం జారీ చేసింది. బ్యాంకుల్లో తీసుకున్న క్రాప్ లోన్ రెన్యువల్ చేయడానికి బ్యాంకు అధికారులు 1బీ లు అడుగుతుండగా భూములను ఫ్రీజింగ్ లో పెట్టడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలుమార్లు ఈ సమస్యపై ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి, జిల్లా కలెక్టర్, స్థానిక ప్రజాప్రతినిధులకు తమ గోడు వెళ్లబోసుకున్నా పట్టించుకోకపోవడంతో రైతులు ఏకమై దీక్షకు పూనుకున్నారు. కొన్నేళ్లుగా సాగు చేసుకుంటున్న భూములకు ప్రభుత్వం పట్టాలు అందించినప్పటికీ కొంతమంది అధికార పార్టీకి చెందిన నేతల తప్పిదాల మూలంగానే భూములను ఫ్రిజింగ్ లో పెట్టారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సంవత్సరం నుంచి పట్టించుకోని అధికారులు.

గత నలభై సంవత్సరాల నుంచి వెయ్యి ఎకరాలకు పైగా భూములను సాగు చేసుకుంటున్నా.. భూముల ఫ్రీజింగ్ వెనక అధికార పార్టీకి చెందిన నేతల హస్తం ఉండడం మూలంగానే అధికారులు సైతం తమ గోడును పట్టించుకోవడం లేదని అక్కడి రైతులు ఆరోపిస్తున్నారు. సుమారు ఆరు నెలల నుంచి కలెక్టర్, రెవెన్యూ కార్యాలయాల చుట్టూ చెప్పులు అరిగేలా ప్రదక్షిణలు చేస్తున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తమ సమస్యలు పరిష్కరించాలని అక్కడి రైతులు వేడుకుంటున్నారు.

సంఘీభావం తెలిపిన గండ్ర సత్యనారాయణ రావు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన పట్టా పాస్ బుక్కులు పనిచేయకపోవడంతో దీక్షకు దిగిన రైతులకు ఏఐఎఫ్‌బీ రాష్ట్ర నాయకులు గండ్ర సత్యనారాయణరావు మంగళవారం వారికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా అక్కడి ఓ మహిళా రైతు తమ భూములను సాగు చేసుకొనివ్వడం లేదని కన్నీరు మున్నీరయ్యారు. ఈ భూమి గురించి మాట్లాడితే తన భర్తను చంపుతామని నైన్‌పాక గ్రామానికి చెందిన అధికార పార్టీ నాయకులు తొట్ల ఐల్లయ్య, గొడుగు విజేందర్, మర్రి అశోక్ లు బెదిరించారని ఆవేదన వ్యక్తం చేశారు.

Next Story

Most Viewed