గ్రేటర్ ఫలితాలపై ఉత్కంఠ

by  |
గ్రేటర్ ఫలితాలపై ఉత్కంఠ
X

దిశ ప్రతినిధి, హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుండడంతో అభ్యర్థుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, టీడీపీలకు చెందిన నాయకులు ఎవరికి వారే తమ విజయావకాశాలను సమీక్షించుకుంటున్నారు. ముఖ్యంగా టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థుల్లో హై టెన్షన్ నెలకొన్నది. జీహెచ్ఎంసీ పోలింగ్ సరళిని అంచనా వేస్తున్న అభ్యర్థులు తమ విజయావకాశాలు ఎంత…? ఎవరి ఓట్లు పడ్డాయి, ఎవరి ఓట్లు పడే అవకాశం లేదు..? వెంట ఉండి చెయ్యి ఇచ్చిన వారు ఎవరు..? అనేది తేల్చుకునే దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఎన్నికలకు ప్రచారం నిర్వహించే సమయంలో ఓ పార్టీ వెంట ఉన్న నాయకులు, కార్యకర్తలు ఎదుటి పార్టీతో లోపాయికారి ఒప్పందాలు కుదుర్చుకుని క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారా ? అనేది కూడా క్రాస్ చెక్ చేస్తున్నారు.

పైకి గాంభీర్యం…

ఎన్నికల ఫలితాలు తమకు అనుకూలంగా ఉంటాయని పలువురు అభ్యర్థులు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా వారిలో కూడా విజయంపై తీవ్ర ఆందోళన ఉంది. ఎన్నికల రోజున పోలింగ్ సరళి సస్పెన్స్ సినిమాను తలపించగా సాయంత్రం ఐదు గంటల వరకు అతి తక్కువ ఓటింగ్ నమోదైంది. చివరి గంటలో సుమారు 10శాతం నుంచి 20శాతం వరకు పోలింగ్ నమోదైంది. ఇది ఎవరికి లాభం చేకూరుస్తుంది.. ఎవరికి నష్టం చేకూరుస్తుందనేది అంచనా వేయలేకపోతున్నారు. ఏ వర్గం ఓట్లు చివరికి అధికంగా పోలయ్యాయి..? వాటిలో తమకు పడేవి ఎన్ని..? అనేది లెక్కలు తేల్చుకునే పనిలో పడ్డారు.

అందుబాటులోకి రాని అభ్యర్థులు…

గ్రేటర్ పోలింగ్ ముగిసిన రోజు నుంచి కొంతమంది అభ్యర్థులు ఎవరికీ అందుబాటులోకి రావడం లేదు. చివరి నిమిషం వరకు ఎన్నికల ప్రచారం నిర్వహించి వెంట ఉన్న వారిని సైతం దూరం పెడుతున్నారు. ఫోన్ చేసినా స్పందించడం లేదని ముఖ్య అనుచరులు సైతం వాపోతున్నారు. ఎందుకు ఇలా..? ఓటమి భయమా..? మరేదన్న కారణమా అని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం మీద మహా నగరపాలక సంస్థ ఎన్నికల ఫలితాలు అటు అభ్యర్థుల్లో, ఇటు ప్రజల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

నేడు తేలనున్న అభ్యర్థుల భవితవ్యం..

జీహెచ్ఎంసీ ఎన్నికల కౌంటింగ్ జరుగుతున్న నేపథ్యంలో అభ్యర్థుల భవితవ్యం ఏమిటనేది నేడు తేలనుంది. సాయంత్రం మూడు గంటల వరకు ఫలితాలు వెలువడే అవకాశాలున్నాయని అధికారులు వెల్లడించిన నేపథ్యంలో అభ్యర్థుల్లో టెన్షన్ మరింత పెరిగింది.

Next Story

Most Viewed