అధికారులకు వార్నింగ్.. 'పద్ధతి మారాలి.. ప్రోటోకాల్ ఫాలో కావాలి'

by Disha Web |
అధికారులకు వార్నింగ్.. పద్ధతి మారాలి.. ప్రోటోకాల్ ఫాలో కావాలి
X

దిశ, కల్వకుర్తి : కల్వకుర్తి పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో గురువారం ఎంపీపీ ప్రమాణ స్వీకరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి కల్వకుర్తి ఎమ్మెల్యే జయపాల్ యాదవ్, మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యం, జడ్పీటీసీ భరత్, ఎంపీడీవో బాలచంద్ర సుజన్, తహశీల్దార్ రామ్ రెడ్డిలు పాల్గొన్నారు. మధ్యాహ్నం 2:00 గంటలకు మొదలు కావాల్సిన సభ కాస్త 3:00 గంటలకు మొదలై 5:00 గంటలకు ముగిసింది. మండల వైస్ ఎంపీపీ అధ్యక్షతన సభ ప్రారంభించారు.

అధికారుల తీరుపై జడ్పీటీసీ అసహనం..

కల్వకుర్తి మండల పరిషత్ కార్యాలయం సమస్యల సుడిగుండంగా మారిందన్నారు. అధికారులు తమ బాధ్యతలను గుర్తెరిగి వ్యవహరిస్తే బాగుంటుందని హితవు పలికారు. మండల పరిషత్ కార్యాలయం అంటే ప్రజల సంక్షేమ అవసరాల కోసమని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నారు. గతంలో కార్యాలయం సందర్శనాత్మకంగా నడిచిందని, నేటి నుంచి ఈ పద్ధతి మారాలన్నారు. రాజకీయంలో అనుభవం గొప్పది కాదని, చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా స్థాయిని బట్టి ప్రోటోకాల్ పాటించాలన్నారు. రెండు గంటల పాటు జరిగిన ఎంపీపీ ప్రమాణ స్వీకారోత్సవ సభలో కల్వకుర్తి జడ్పీటీసీ భరత్ మాట్లాడిన విధానం ప్రాధాన్యత సంతరించుకుంది.

అనంతరం ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్మన్, జడ్పీటీసీ, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, కో ఆప్షన్ మెంబర్లు నూతన ఎంపీపీ మనోహరకు శుభాకాంక్షలు తెలిపి, కల్వకుర్తి మండలంలోని గ్రామాలను అభివృద్ధి పథంలో నడపాలని ఎంపీపీకి పలు రకాల సూచనలు చేశారు. ఎంపీపీ పదవీకాలం రెండేళ్ల మూడు మాసాల ఉన్నందున మనోహర గ్రామాలపై దృష్టి సారించాలన్నారు. ఎంపీటీసీ, సర్పంచ్, అధికారులను సమన్వయం చేసుకుంటూ ప్రగతి వైపు ముందుకేల్లాలన్నారు. మండల, గ్రామాల ప్రతినిధులు ఉత్సవ విగ్రహాల వలె కాకుండా గ్రామాలను అభివృద్ధి చేసేందుకు ఫండ్ ఇవ్వాలని స్థానిక ఎమ్మెల్యేను పలువురు ప్రజా ప్రతినిధులు కోరారు. అదే క్రమంలో ప్రజా ప్రతినిధులు ఎంపీపీ సామ మనోహర చెన్న కేశవ్‌ను శాలువాతో సత్కరించి పూల బుకే, పూల దండలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పలు గ్రామాల వార్డు మెంబర్లు, పంజుగుల గ్రామ ప్రజలు, అధికారులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed