రికార్డుల ప‌రిశీల‌న లేదు.. ఆ కార్య‌ద‌ర్శికి స‌పోర్ట్‌గా నిలిచేందుకేనా..?

by Disha Web Desk 13 |
రికార్డుల ప‌రిశీల‌న లేదు.. ఆ కార్య‌ద‌ర్శికి స‌పోర్ట్‌గా నిలిచేందుకేనా..?
X

దిశ ప్ర‌తినిధి, వ‌రంగ‌ల్ : ఎనుమాముల వ్య‌వ‌సాయ మార్కెట్లో జ‌రుగుతున్న జీరో దందాపై ఓ వైపు మార్కెటింగ్ శాఖ అధికారులు విచారణ చేప‌డుతుండ‌గానే.. మ‌రోవైపు జీరో ట్రేడింగ్ జోరుగా సాగుతుండ‌టం గ‌మ‌నార్హం. అధికారుల విచార‌ణ ఏపాటిది అన్న విష‌యం ఈ ప‌రిణామాలే తెలియ‌జేస్తున్నాయి. మార్కెట్‌కు రావాల్సిన ఒక శాతం ప‌న్ను, ప్ర‌భుత్వానికి చేరాల్సిన‌ ఐదు శాతం జీఎస్టీ వ్యాపారులు, అధికారుల జేబుల్లోకి చేరుతున్న వైనంపై 'దిశ' మీడియాలో వ‌రుస‌గా క‌థ‌నాలు వెలువడుతున్న విష‌యం పాఠ‌కులకు విధితమే.

'దిశ' మీడియాలో వ‌చ్చిన క‌థ‌నాల ఆధారంగా వ‌రంగ‌ల్ కలెక్ట‌ర్ గోపి ఆదేశాల‌తో వ‌రంగ‌ల్ మిర్చి కొనుగోళ్ల‌ను ప‌ర్య‌వేక్షించే అధికారి ప్ర‌సాద్‌కు విచార‌ణ బాధ్య‌త‌లు అప్ప‌గించారు. ఈ నేప‌థ్యంలో వ‌రంగ‌ల్ గ్రెయిన్ మార్కెట్‌లో సోమ‌వారం మార్కెట్ అధికారులు కొంత‌మంది పాల‌క వ‌ర్గం స‌భ్యుల‌తో ఆయ‌న భేటీ అయిన‌ట్లు తెలిసింది. అయితే ఓ వైపు విచార‌ణ కొన‌సాగుతుండ‌గానే.. మార్కెట్‌లో మాత్రం య‌థేచ్ఛ‌గా జీరో దందా కొన‌సాగ‌డం గ‌మ‌నార్హం.

ఉత్తుత్తి విచార‌ణేనా..?

ఎనుమాముల మార్కెట్లో జ‌రుగుతున్న‌ జీరో దందాలో మార్కెట్ కార్య‌ద‌ర్శి రాహుల్‌ది కీల‌క పాత్ర‌గా ఆరోప‌ణ‌లున్నాయి. వీడియోల‌తో స‌హా దిశ మీడియాలో క‌థ‌నాలు వెలువ‌డ్డాయి. ఇదే విష‌యాన్ని ఆయ‌న దృష్టికి తీసుకెళ్లినా స్పంద‌న క‌రువు. క‌నీస చ‌ర్య‌లు లేవు. మార్కెట్లో బాహాటంగానే జీరో దందా కొన‌సాగుతోంది. క‌నీసం క‌ట్ట‌డికి య‌త్నించ‌డం లేదు. ఈ నేప‌థ్యంలోనే ఉన్న‌తాధికారుల దృష్టికి తీసుకెళ్ల‌డంతో విచార‌ణ చేప‌డుతున్న‌ట్లుగా స్ప‌ష్టం చేశారు. సోమ‌వారం అధికారులు మార్కెట్‌ను సంద‌ర్శించారు.

అయితే అధికారుల విచార‌ణ కొన‌సాగిస్తున్న తీరుపై మాత్రం అనుమానాలు క‌లుగుతున్నాయి. విచార‌ణ‌కు అవ‌స‌ర‌మైన రికార్డుల ప‌రిశీల‌న‌, సీసీ ఫుటేజీల ప‌రిశీల‌న‌, ద‌డ్వాయిల‌ను విచారించ‌డం చేయాల్సి ఉంద‌ని, అయితే ఇవేమీ చేయ‌కుండా.. అయింద‌నిపించాల‌నే దృక్ప‌థంతోనే వ్య‌వ‌హ‌రిస్తున్న‌ట్లుగా మార్కెట్ వ‌ర్గాల ద్వారా తెలుస్తోంది. జీరో దందాలో పాలు పంచుకుంటున్న వారిని కాపాడే ప్ర‌య‌త్నం జ‌రుగుతోంద‌న్న విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. మార్కెట్ కార్య‌ద‌ర్శి రాహుల్‌ను కాపాడేందుకు పాల‌క వ‌ర్గంతో సంబంధం లేని రాజ‌కీయ నేత ప్ర‌య‌త్నం చేస్తున్న‌ట్లుగా కూడా తెలుస్తోంది.

మార్కెట్లో దోపిడీ ఇలా..


జీరో దందా తో మార్కెట్ కు రావలసిన రాబడి గంటకు వేలల్లో, రోజుకు లక్షల్లో గండి పడుతున్నట్లు అవగతమవుతోంది. వాస్తవానికి ఖరీదు దారు కొనుగోలు చేసిన సరకులు క్వింటాకు ఆరోజు నిర్ణయించబడిన ధరపై ఒక (1%) శాతం మార్కెట్ కు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అలాగే 5%(ఐదు శాతం) జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణకు.. వెయ్యి బస్తాల సరుకు 500 క్వింటాళ్లు కొనుగోలు చేస్తే, ఆ రోజు ధర 18000 పలికితే మార్కెట్ నిబంధనల ప్రకారం 1%శాతం ప్ర‌కారం.. 9వేల రూపాయల వ‌ర‌కు ఖరీదుదారుడు మార్కెట్ కు పన్ను రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. అలాగే 5% జీఎస్టీ 45 వేల రూపాయలు చెల్లించాలి.

అయితే ఈ మొత్తాన్ని చెల్లించకుండా ఖరీదు దారులు, అధికారులు కుమ్మక్కై మార్కెట్ ఆదాయానికి గండి కొడుతున్నారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన సరుకుకు అసలు రశీదు కాకుండా కేవలం తెల్ల కాగితం మీద బస్తాలు, తూకం వివరాలు నమోదు చేస్తున్నట్లు రైతులు ఖరాఖండిగా చెబుతున్నారు.




Next Story

Most Viewed