Minister Jagadish Reddy: మంత్రికి చుక్కెదురు.. ఇచ్చిన హామీలు ఎక్కడ పోయాయని నిలదీత

by Dishanational1 |
Villagers demanded minister Jagadish Reddy to fulfill the promises he has given
X

దిశ, మర్రిగూడ: Villagers demanded minister Jagadish Reddy to fulfill the promises he has given| కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీలో జిల్లా ఇన్ చార్జి మంత్రి జి. జగదీష్ రెడ్డికి మునుగోడు నియోజకవర్గంలోని మర్రిగూడ మండలం బుధపక్షపల్లి గ్రామపంచాయతీలో బుధవారం ఏఐఎస్ఎఫ్ కార్యకర్తల నుండి చుక్కెదురయింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సమయంలో కేసీఆర్ ప్రజలకు ఇచ్చిన హామీలు ఎక్కడ పోయాయని ప్రశ్నించారు. ఏండ్లు గడుస్తున్నా ఇప్పటివరకు పెన్షన్ లు గతిలేవని, దళితులకు ఇస్తానని చెప్పిన మూడు ఎకరాల భూమి జాడలేదని నిలాదీశారు. ఉచిత ప్రసంగాలు ఇవ్వటమే తప్ప టీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజల యోగ క్షేమాలు పట్టడం లేదని అన్నారు. రైతులకు ఎరువులు, పురుగుల మందులు ఇస్తున్నామని చెప్పి మరిచారంటూ ప్రభుత్వం పై విరుచుకుపడ్డారు. అర్హులకు డబుల్ బెడ్ రూమ్ లు, రుణ మాఫీలు, రేషన్ కార్డుల హామీలు ఇప్పటివరకు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఐదేండ్లు గడిచినా చర్లగూడెం రిజర్వాయర్ లో భూములు కోల్పోయిన రైతులకు ప్రభుత్వం న్యాయం చెయ్యలేదని, కేవలం గద్దెను ఎక్కడం కోసమే ప్రజలకు నకిలీ హామీలిచ్చి పబ్బం గడుపుతున్నారని ఏఐఎస్ఎఫ్ కార్యకర్తలు మంత్రిని ప్రశ్నల వర్షంతో నిలదీయడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ నిరసనలో ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు బూడిద సురేష్, సీపీఐ కుదాబక్ష్ పల్లి గ్రామ శాఖ సహాయ కార్యదర్శి పొట్ట అశోక్, ఎఐవైఎఫ్ నాయకులు శ్రీనివాస్, మధుకర్, సుభాష్, కుమార్, గణేష్ పాల్గొన్నారు.

మంత్రికి పలువురు వినతి పత్రాలు అందజేత

రాష్ట్ర ప్రభుత్వం మర్రిగూడ మండలంలో ఆడపడుచుల పెళ్లిళ్లకు మంజూరు చేసిన 76 చెక్కులను లబ్ధిదారులకు మంత్రి అందజేశారు. శివన్న గూడెం నుండి వయా నామాపురం మీదుగా తేరట్పల్లి వరకు రోడ్డు గుంతలు పడి అస్తవ్యస్తంగా ఉందని నిధులు మంజూరు చేయాలని కోరుతూ ఫ్లోరోసిస్ విముక్తి పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు కంచు కట్ల సుభాష్, నామాపురం ఎంపీటీసీ సభ్యులు ఊరి పక్క సరితా నగేష్ మంత్రికి వినతి పత్రం అందజేశారు. అలాగే కేసీఆర్... సాగర్, హుజూర్నగర్ లో ఇచ్చినటువంటి హామీని మునుగోడు నియోజకవర్గంలోని అన్ని గ్రామ పంచాయతీలకు అమలు చేయాలని కోరుతూ కాంగ్రెస్ సర్పంచులు వినతిపత్రం అందజేశారు. ట్రై మోటర్ సైకిల్ అందజేయాలని కోరుతూ అంతంపేట గ్రామానికి చెందిన వికలాంగుడు సూరిగి రాములు మంత్రికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఆడపడుచులకు తన సొంత ఖర్చులతో చీరలను అందజేశారు. కార్యక్రమంలో దేవరకొండ ఆర్డీఓ గోపి రామ్, మర్రిగూడ తహశీల్దార్ సంఘమిత్ర, ఎంపీపీ మెండు మోహన్ రెడ్డి, జెడ్పీటీసీ పాశం సురేందర్రెడ్డి, సర్పంచులు నల్ల యాదయ్య, సుధాకర్ నాయక్ తో పాటు అన్ని గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు పాల్గొన్నారు.



Next Story