ఉత్త‌రాఖండ్‌లో అత్యంత అరుదైన మాంసాహార మొక్క.. ఇదే లాభం!

by Disha Web Desk 20 |
ఉత్త‌రాఖండ్‌లో అత్యంత అరుదైన మాంసాహార మొక్క.. ఇదే లాభం!
X

దిశ‌, వెబ్‌డెస్క్ః భారతదేశంలోని మంచు ప్రాంతాల్లో ఒక‌టైన ఉత్తరాఖండ్ రాష్ట్రం ఓ అద్భుత‌మైన డిస్క‌వ‌రీకి వేదిక‌య్యింది. ఆ రాష్ట్ర‌ అటవీ శాఖ అధికారులు మొదటిసారిగా పశ్చిమ హిమాలయ ప్రాంతంలో అత్యంత అరుదైన మాంసాహార మొక్కను కనుగొన్నారు. సెప్టెంబరు 2021లో ఉత్తరాఖండ్ అడవుల రీసెర్చ్ వింగ్ బృందం ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లా, మండల్ లోయలో 4,800 అడుగుల ఎత్తులో ట్రిక్యులారియా ఫుర్సెల్లాటా అనే మొక్కను కనుగొంది. ఈ మొక్క దేశంలో చివరిసారిగా 1986లో ఈశాన్య మేఘాలయ రాష్ట్రంలో కనిపించింది.

ఈ ఆవిష్కరణ ప్రతిష్టాత్మకమైన 'జర్నల్ ఆఫ్ జపనీస్ బోటనీ'లో డాక్యుమెంట్ చేశారు. "ఉత్తరాఖండ్‌లో మాత్ర‌మే కాకుండా మొత్తం పశ్చిమ హిమాలయ ప్రాంతంలోనే ఈ మొక్కను చూడటం ఇదే మొదటిసారి" అని చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (పరిశోధన) సంజీవ్ చతుర్వేది PTI వార్తా సంస్థకు తెలిపారు. సాధారణంగా ఈ మొక్క‌ పేలవమైన పోషకాలు లేని నేలపై పెరిగే మాంసాహార మొక్క. దీని సంభావ్య ఔషధ ప్రయోజనాల కారణంగా, ప్రపంచవ్యాప్తంగా శాస్త్రీయ స‌మూహంలో కొత్త ఆసక్తిని రేకెత్తించింద‌ని చ‌తుర్వేది తెలిపారు.

ఈ మొక్కను సాధారణంగా బ్లాడర్‌వోర్ట్‌లు అని పిలుస్తారు. ఇది మాంసాహారి. అత్యంత అధునాతనమైన, అభివృద్ధి చెందిన మొక్కల నిర్మాణాలు క‌లిగిన దీని ఉచ్చును ఉపయోగించి, ప్రోటోజోవా నుండి కీటకాలు, దోమల లార్వా, యువ టాడ్‌పోల్స్ వంటి వాటిని ఆహారంగా తీసుకుంటుంది. ఉత్తరాఖండ్‌లోని క్రిమిసంహారక మొక్కల ప్రాజెక్టు సంబంధించిన అధ్యయనంలో భాగంగా ఈ ఆవిష్కరణ జరిగింది. అయితే, ఈ జాతులు పర్యాటక ప్రదేశంలో ఉండ‌టం వ‌ల్ల‌, భారీ జీవసంబంధ ఒత్తిడి వ‌ల్ల‌ ముప్పును ఎదుర్కొంటున్నాయని ప‌రిశోధ‌కులు వెల్ల‌డించారు.

ఇక‌, దీని ఆపరేషన్ కేవ‌లం యాంత్రిక ప్రక్రియపై ఆధారపడి ఉంటుంది. అంటే ఎరను ఆకర్షించడానికి ట్రాప్ చేసే ఉచ్చు లోపల వాక్యూమ్ లేదా నెగటివ్ ప్రెజర్ ఏరియాను సృష్టిస్తుంది. ఈ మొక్కలు ఎక్కువగా మంచినీళ్లు, తడి నేలల్లో కనిపిస్తాయి. ఇప్పటివరకు, డ్రోసెరా, యుట్రిక్యులేరియా, పింగుయికులా జాతికి చెందిన సుమారు 20 వృక్ష జాతులు కనుగొనబడ‌గా, ఈ మొక్క‌కు సంబంధించి, రాష్ట్రంలో ఇదే మొదటి సమగ్ర అధ్యయనం కావ‌డం విశేషం.


Next Story

Most Viewed