అయోమయంలో గులాబీ శ్రేణులు.. ఎమ్మెల్సీ V/S ఎమ్మెల్యే..

by Dishafeatures2 |
అయోమయంలో గులాబీ శ్రేణులు.. ఎమ్మెల్సీ V/S ఎమ్మెల్యే..
X

దిశ, కుత్బుల్లాపూర్ : కారులో అయోమయం నెలకొంది. మొన్నటి వరకు జంటగా కలియతిరిగిన ఆ ఇద్దరు ప్రజా ప్రతినిధులు నేడు దూరం దూరంగా వేరవుతూ కుంపటి రాజకీయాలను నడపడం ప్రజలను, పార్టీ కార్యకర్తలను కలవర పరుస్తుంది. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద, మేడ్చల్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లోపై చేయి సాధించేందుకు ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారు. పోటీలు పడుతూ ఇరువురు నేతలు చాప కింద నీరులా తమ తమ వర్గాలను విస్తరించుకుంటున్నారు. తీర్థ యాత్రలు, పనులు, ప్రారంభోత్సవాలైనా ఇద్దరూ తమ వర్గం నేతలను వెంటేసుకుని వేర్వేరుగా తిరుగుతూ కుత్బుల్లాపూర్‌లో రాజకీయ వేడి రగిలిస్తున్నారు.

అధిష్టానం ఆశీస్సులు తనవైపే, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే సీటు తనకేనని ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు గులాబీ కార్యకర్తలను తన గఢీలో దాచుకుంటున్నారు. సిట్టింగ్ నేనే ఈ సారి నాదే విజయం, కుత్బుల్లాపూర్‌లో నా బెర్త్ కన్ఫార్మ్ అనేలా కుత్బుల్లాపూర్ ప్రస్తుత ఎమ్మెల్యే వివేకానంద దూకుడు పెంచుతూ తన వర్గం కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతున్నాడు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే ఇద్దరూ విడిపోతూ వర్గాలను తయారు చేయడంతో గులాబీ కార్యకర్తలు ఎవరికి దగ్గరవ్వాలో, ఎవరికి దూరమవ్వాలో తెలియక అయోమయంలో ఉంటున్నారు. కొందరైతే ఇరు నేతలను కలుస్తూ సమన్యాయం పాటిస్తుండగా, మరికొంత మంది నేతలు, ప్రజా ప్రతినిధులు ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే వర్గంలో వేర్వేరుగా ఉంటూ తాము నచ్చిన నేతలకు మద్దతుగా నిలుస్తున్నారు.

ఎమ్మెల్యే వర్గంలో..

కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద శిబిరంలో నియోజకవర్గంలోని ఓ మున్సిపాలిటీ పాలకవర్గం, టీడీపీ మాజీ శ్రేణులు, జీహెచ్ఎంసీ కుత్బుల్లాపూర్, గాజులరామారం రెండు సర్కిల్‌కు చెందిన పార్టీ డివిజన్ అధ్యక్షులు ఎమ్మెల్యే వర్గంగా ముద్ర పడినప్పటికీ ఎమ్మెల్సీ కబురు పంపగానే వాలిపోతూ పార్టీ కార్యక్రమాలను చర్చిస్తున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో నుండి ఓ కార్పొరేటర్, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పాలకవర్గం నేతలు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఇద్దరు నేతలను కలుస్తూ అధిష్టానం ఎవ్వరికి టీఆర్ఎస్ టికెట్ ఇస్తే వారికే జై కొట్టేందుకు సిద్దమవుతున్నారు.

ఎమ్మెల్సీ శిబిరంలో..

మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు వర్గంలో రెండు సర్కిల్‌లకు చెందిన కార్పొరేటర్లు రావుల శేషగిరి, జగన్, మంత్రి సత్యనారాయణ,విజయ్ శేఖర్ గౌడ్, కార్పొరేటర్ల భర్తలు సురేష్ రెడ్డి, మహ్మద్ అరిఫ్‌లు, ఓ మున్సిపాలిటీ పాలకవర్గం నేతలు శిబిరంలో ఉంటూ ఎమ్మెల్సీ కార్యక్రమాలకు వ్యూహ రచన చేస్తున్నారు. ఎమ్మెల్సీ వచ్చే ఎన్నికల్లో ప్రత్యక్ష రాజకీయాల్లో తలపడేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఎమ్మెల్యేగా గెలుపొంది, రాబోయే కేటీఆర్ ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు చేపట్టేందుకు కుతూహలంగా ఉన్నట్లు వినికిడి. కుత్బుల్లాపూర్‌లో ఇరువురు ప్రజా ప్రతినిధులు పోటా పోటీగా తమ రాజకీయ బలాలను ప్రదర్శిస్తూ వచ్చే ఎన్నికల్లో గులాబీ జెండాతో పైచేయి సాధించేందుకు కదనరంగంలో దూకుతున్నారు. ఇరువురి వర్గపోరుతో అటు తెలంగాణ ఉద్యమ నేతలు, పార్టీ కార్యకర్తలు ఎవ్వరికి దగ్గరవ్వాలో, ఎవ్వరికి దూరం ఉండాలో తెలియక అయోమయానికి గురవుతున్నారు. మరీ టీఆర్ఎస్ అధిష్టానం ఎవ్వరిని బుజ్జగిస్తుందో, ఎవ్వరికి అసెంబ్లీ టికెట్ కేటాయిస్తుందో వేచి చూడాలి.


Next Story

Most Viewed