గిరిజన గ్రామాలకు త్రీఫేజ్ కరెంట్.. కలెక్టర్లకు సెక్రటరీ ఆదేశాలు

by Disha Web Desk 13 |
గిరిజన గ్రామాలకు త్రీఫేజ్ కరెంట్.. కలెక్టర్లకు సెక్రటరీ ఆదేశాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: మారుమూల గిరిజన గ్రామాలకు కూడా త్రీఫేజ్​కరెంట్​ఇవ్వాలని అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎ. శాంతి కుమారి అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలిచ్చారు. ప్రభుత్వ ప్రాధాన్యత, ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు ఆదేశాల మేరకు ప్రతీ ఆదివాసీ, గిరిజన గ్రామాలకు విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు సకల సౌకర్యాలు ఇవ్వాలన్నారు. విద్యుత్ సౌకర్యం, పెండింగ్ లో ఉన్న పనులపై గిరిజనులు అధికంగా ఉన్న జిల్లాల కలెక్టర్లు, విద్యుత్, గిరిజన సంక్షేమం, అటవీ శాఖ అధికారులతో ఆమె బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మూడు వేలకు పైగా గుర్తించిన గ్రామాలకు ఇప్పటికే త్రీ ఫైజ్ విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు. ఇంకా మిగిలిన 239 గ్రామాలకు కూడా నెల రోజుల్లో పనులు పూర్తి చేసి విద్యుత్ సౌకర్యం అందివ్వాలన్నారు. ఆదిలాబాద్ లో 46, కొమరం భీమ్ ఆసిఫాబాద్ 98, మంచిర్యాల 26, నిర్మల్ 42, భద్రాద్రి కొత్తగూడెంలో 27 గ్రామాలకు విద్యుత్ సౌకర్యం ఇంకా అందించాల్సిన అవసరం ఉందన్నారు.


ఈ మేరకు అటవీ అనుమతులను వేగంగా ఇవ్వనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్) ఆర్.ఎం. డోబ్రియాల్ ,గిరిజన సంక్షేమ శాఖ సెక్రటరీ డాక్టర్ క్రిస్టీనా చోంగ్తు, ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల కలెక్టర్లు, అటవీ శాఖ చీఫ్ కన్జర్వేటర్లు, విద్యుత్ శాఖ (ఎన్.పీ.డీ.సీ.ఎల్) సీఎండీ గోపాల్ రావు తదితరులు పాల్గొన్నారు.

Next Story