కల సాకారం..ఫలించిన గట్టుపల్ మండల సాధన సమితి పోరాటం

by Disha Web Desk 12 |
కల సాకారం..ఫలించిన గట్టుపల్ మండల సాధన సమితి పోరాటం
X

దిశ, చౌటుప్పల్/చండూర్: గట్టుపల్ మండల ఏర్పాటు కోసం ఏళ్లుగా చేస్తున్న పోరాటం ఎట్టకేలకు ఫలించింది. శనివారం ఎనిమిది గ్రామాలతో కలిపి గట్టుప్పల్ మండల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జివో జారీ చేశారు. దీంతో గ్రామస్తులు బాణాసంచా కాల్చి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. గట్టుప్పల్ మండల ఏర్పాటు కోసం గట్టుప్పల్ మండల సాధన సమితి సుమారు 900 రోజులు నిరాహార దీక్షలు చేపట్టారు.చివరకు ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకొని గట్టుపల్ మండల ఏర్పాటు చేస్తూ నోటిఫికేషన్ విడుదల చేయడం వెనుక గ్రామస్తుల పోరాటం అమోఘం.

ముసాయిదాలో తొలగింపుతో రాజుకున్న నిప్పు

తెలంగాణ రాష్ట్రంలో కొత్త మండలాలు ఏర్పాటుకు విడుదల చేసిన ముసాయిదాలో మొదటగా గట్టుపల్ మండలాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. అందుకు కావలసిన మండల కార్యాలయాలను కూడా అక్కడ సిద్ధం చేశారు. కానీ చివరి నిమిషంలో ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ ముసాయిదా నుంచి గట్టుపల్ మండలాన్ని తొలగించారు. దీంతో రాజుకున్న నిప్పు శనివారం మండల ఏర్పాటుతో చల్లారింది. గట్టుపల్ మండలం లో ప్రస్తుతం యాదాద్రి జిల్లాలోని వాయిల పల్లి గ్రామాన్ని కలుపుతున్నట్లు ముసాయిదాలో ప్రకటించడంతో అప్పటి అధికార పార్టీ ప్రజా ప్రతినిధి మండల ఏర్పాటును అడ్డుకున్నట్లు ఆరోపణలు వినిపించాయి. అధికార పార్టీ నాయకుల మధ్య కుమ్ములాటలతో గట్టుపల్ మండల ఏర్పాటు కలగానే మిగిలిందని ఆరోపణలు గుప్పుమన్నాయి. దీంతో అప్పటి స్థానిక సర్పంచ్ అధికార పార్టీని కాదని బీజేపీలో చేరడానికి ప్రధాన కారణమని తెలుస్తోంది.

ఫలించిన మండల సాధన సమితి పోరాటం.

అప్పటినుండి గట్టుపల్ మండల ఏర్పాటు కోసం గ్రామస్తులు మండల సాధన సమితి ని ఏర్పాటు చేసుకొని పోరాటాలకు సిద్ధం అయ్యారు. సాధన సమితి కన్వీనర్ గా స్థానిక సర్పంచ్ తండ్రి ఇడెం కైలాష్ నుంచి ఉద్యమాన్ని నడిపించారు. అవకాశం దొరికిన ప్రతి దగ్గర తమ వాణిని వినిపిస్తూ మండల ఏర్పాటుకు నిరంతర పోరాటం కొనసాగించారు. తెలంగాణ రాష్ట్రంలో రెండోసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటించిన గట్టుపల్ మండలం ఏర్పాటు కాకపోవడంతో స్థానికుల ఆగ్రహజ్వాలలు మిన్నంటాయి. దీంతో స్థానిక సర్పంచ్ అధికార టీఆర్ఎస్ ను కాదని బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అయినా కూడా మండల ఏర్పాటు సాధ్యం కాకపోవడంతో నిరంతరం మండల సాధన సమితి ఆధ్వర్యంలో నిరాహార దీక్షలు కొనసాగాయి.

ఉప ఎన్నిక ఊహాగానాలతో మండల ఏర్పాటు!

ఏడేళ్లుగా స్తబ్దుగా ఉన్న గట్టుపల్ మండల ఏర్పాటు ప్రకటన తాజాగా తెరపైకి రావడానికి ప్రధాన కారణం ప్రస్తుత మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ మార్పే కారణమని తెలుస్తోంది. గత రెండు రోజుల క్రితం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ జాతీయ నాయకుడు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సమావేశమై ఆ పార్టీలో చేరికకు ఆమోదం తెలిపినట్లు గుసగుసలు వినిపించాయి. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బిజెపి నుండి ఉప ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమైనట్లు వార్తలు గుప్పుమన్నాయి. దీంతో అప్రమత్తమైన అధికార టీఆర్ఎస్ పార్టీ ఉప ఎన్నికల్లో గెలుపు కోసం దేవుడి పురం లో ప్రధాన సమస్య అయిన గట్టుపల్ మండల ఏర్పాటుకు చకచక పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది.

దీంతో శుక్రవారం మండల సాధన సమితి సభ్యులు మంత్రి జగదీష్ రెడ్డి ని కలవగా మండల ఏర్పాటుకు ముఖ్యమంత్రి స్పష్టమైన హామీ ఇచ్చినట్లు తెలిపారు. తెల్లవారేసరికి మండల ఏర్పాటు కోసం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జీవో జారీ చేయడం ఉప ఎన్నికల్లో గెలుపు కోసమేనని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఏది ఏమైనా గట్టుప్పల్ మండల ఏర్పాటు కల సాకారం కావడం తో గ్రామస్తులు సంబరాల్లో మునిగిపోయారు.



Next Story

Most Viewed