ర్యాంకులు ప్రకటించిన ఎన్ఎన్ఎఫ్.. టాప్‌లో నిలిచిన సిద్దిపేట..

by Disha Web Desk 19 |
ర్యాంకులు ప్రకటించిన ఎన్ఎన్ఎఫ్.. టాప్‌లో నిలిచిన సిద్దిపేట..
X

దిశ ప్రతినిధి, సిద్దిపేట: జాతీయ నియోనాటాలజీ ఫోరమ్ బృందం చేపట్టిన సర్వేలో సిద్ధిపేట ప్రభుత్వ సర్వజన, మెడికల్ కళాశాల అనుబంధ ఆసుపత్రి నవజాత శిశు సంరక్షణ కేంద్రం (ఏస్ఎన్‌సీయూ)కు తెలంగాణ రాష్ట్రంలోనే తొలి ర్యాంకు లభించింది. ఈ మేరకు శనివారం జాతీయ స్థాయిలో స్కోరింగ్, ర్యాంకింగుల వారీగా జాబితాను వెలువరించింది. రానున్న వారంలోపు వివరణాత్మక నివేదిక సమర్పిస్తామని, వాటిలో ప్రథమ రూ.45 వేలు, ద్వితీయ రూ.35 వేలు, తృతీయ రూ.25 వేలు చొప్పున అందించనున్నామని పేర్కొంది. సిద్ధిపేట ప్రభుత్వ సర్వజన, మెడికల్ కళాశాల అనుబంధ ఆసుపత్రిలోని నవజాత శిశు సంక్షేమ కేంద్రం- ఎస్ఎన్‌సీయూ ఏర్పాటైన దరిమిలా వందలాది శిశువుల ప్రాణాలు కాపాడగల్గుతున్నామని ఆసుపత్రి వైద్య వర్గాలు తెలిపాయి.

ఇటీవలే లెవెల్ – 2ఏ, ఎస్ఎన్‌సీయూకు గుర్తింపు..

మొదట్లో చాలా జిల్లాలో లెవెల్-1 కేర్ మాత్రమే ఉండేది. తరువాత లెవెల్-2 కేర్ అంటే ఆక్సిజన్ సరఫరా మాత్రమే కాకుండా వార్మర్‌లు, సీ పాప్‌, ఫొటో థెరపీ యూనిట్లతో పాటు ఇతర సదుపాయాలు కూడా ఉండేలా ఎస్ఎన్‌సీయూలను ఏర్పాటు చేశారని, ఉమ్మడి మెదక్ జిల్లాలోనే సిద్ధిపేట ఏంసీహెచ్ లో ప్రారంభమైన ఎస్ఎన్‌సీయూకు ఇటీవల నేషనల్ నియోనాటాలజీ రమ్ (ఎన్ఎన్ఎఫ్) లెవల్ -2ఏ కేర్ యూనిట్‌గా ప్రత్యేక గుర్తింపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సిద్ధిపేట ఎస్ఎన్‌సీయూలో డాక్టర్లు అద్భుతాలు సృష్టిస్తున్నారని చెప్పేలా, ఇక్కడ వైద్య ప్రమాణాలు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాలకు దగ్గర్లో ఉన్నాయని చెప్పవచ్చునని సిద్ధిపేట ఎస్ఎన్‌సీయూ వైద్య వర్గాలు తెలుపుతున్నాయి.

కేఏంసీ తరహా బిడ్డలకు రక్షణ..

సిద్ధిపేట ఎస్ఎన్‌సీయూలో కంగారూ మదర్ కేర్ (కేఎంసీ) పద్ధతిలో బిడ్డలకు రక్షణ అందిస్తున్నారు. అంటే పుట్టిన బిడ్డలకు కంగారూ తరహాలో రక్షణ ఇస్తారు. కంగారూలలో నెలలు నిండకముందే పిల్లల్ని కంటాయి. వాటిని తమ పొట్ట దగ్గర ఉన్న సంచీలో దాచుకుని రక్షణ కల్పిస్తాయి. అదే తరహాలో నెలలు తక్కువగా పుట్టిన బిడ్డలకు, తల్లులకూ కలిపి వైద్య సదుపాయలు అందించేలా ఏర్పాటు చేశారు.

సిద్ధిపేట ఎస్ఎన్‌సీయూకే ఫస్ట్..

ఎన్ఎన్ఎఫ్, యూనిసెఫ్ ప్రాజెక్ట్ ఉమ్మడిగా రాష్ట్రాలలో ఎస్ఎన్‌సీయూల బలోపేతానికి కృషి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఎస్ఎన్‌సీయూలు, ఎఫ్‌బీ‌ఎన్‌సీ (ఫెసిలిటీ బేస్డ్ న్యూ బోర్న్ కేర్ ),

ఎన్ఎన్ఎన్ మార్గదర్శకాల ప్రకారం సేవలు అందిస్తున్నాయో.. లేదో సర్వే చేస్తాయి. ఇందులో భాగంగా ఎన్ఎన్ఎఫ్ రాష్ట్రంలో 10 ఎస్ఎన్‌సీయూలను ఏంపిక చేసి సర్వే చేపట్టాయి. ముగ్గురు న్యాయ నిర్ణేతలతో కూడిన బృందం గత జనవరి నెలలో ఒక్కొ ఎస్ఎన్‌సీయూని సందర్శించి సేవలను పరిశీలించాయి.

మంత్రి కృషితో..

సిద్ధిపేట ఎస్ఎన్‌సీయూ కేంద్రంలో క్లినికల్ సేవలు, క్లినికల్ సపోర్ట్ , ఫాలో అప్ సేవలు , మానవ వనరులు, అవసరమైన వైద్య పరికరాలు, మందులు, ఇన్ఫెక్షన్ కంట్రోల్, రే షనల్ ఆంటీ బయోటెక్ యూసేజ్, ఇన్నోవేషన్, యూనిక్ సొల్యూషన్ పారమిటర్‌లలో ఎస్ఎన్‌సీయూ పనితీరును గుర్తించి మదింపు చేశారు. పై అంశాల్లో సిద్ధిపేట ఎస్ఎన్‌సీయూ మంచి పనితీరుతో అత్యధిక మార్కులు సాధించి 10 ఎస్ఎన్‌సీయూలలో ప్రథమ స్థానంతో నిలిచింది.

ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య సంక్షేమ శాఖ మంత్రి హరీశ్ రావు ప్రత్యేక చొరవతో సిద్ధిపేట ప్రభుత్వ సర్వజన, మెడికల్ కళాశాల అనుబంధ ఆసుపత్రి నవజాత శిశు సంరక్షణ కేంద్రానికి ఇటీవలే లెవెల్ -2ఏ గుర్తింపు లభించింది. ప్రస్తుతం ఎన్ఎన్ఎఫ్ పనితీరు ఆధారంగా నిర్వహించిన సర్వేలో సిద్దిపేట ఎస్ఎన్సీయూ తెలంగాణ రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచినట్లు మెడికల్ కళాశాల ఆసుపత్రి, మెడికల్ కాలేజ్ డైరెక్టర్ శ్రీమతి తమిళ అరుసు, సూపరిండెంట్-పర్యవేక్షకులు డాక్టర్. కిషోర్ కుమార్‌లు తెలిపారు.

పసిబిడ్డల పాలిట వరం..ఏస్ఎన్‌సీయూ.. హరీశ్ రావు

ఎస్ఎన్‌సీయూలనేవి పసిబిడ్డల పాలిట వరం. పేద, మధ్య తరగతి ప్రజలకు ఆర్థిక భారం, దూర భారాన్ని తగ్గించి, మెరుగైన వైద్య సేవలు స్థానికంగానే అందుబాటులోకి వచ్చాయి. రాష్ట్రంలోనే మొదటి ర్యాంకు సిద్ధిపేట ఎస్ఎన్‌సీయూ కేంద్రానికి దక్కడం ఆనందంగా ఉంది. జిల్లా ప్రజలందరికీ గర్వ కారణం. ఎస్ఎన్‌సీయూ వైద్య అధికారులు, సిబ్బందికి ప్రత్యేక అభినందనలు తెలిపారు.

Next Story

Most Viewed