Telangana News: అక్కడ రాత్రికి రాత్రే గుట్టలను మింగేస్తున్న భూ బకాసురులు

by Disha Web Desk 12 |
Telangana News: అక్కడ రాత్రికి రాత్రే గుట్టలను మింగేస్తున్న భూ బకాసురులు
X

దిశ, మహేశ్వరం: రాత్రికి రాత్రే గుట్టలు మాయం అవుతున్నాయి. కొందరు అక్రమార్కులు ప్రకృతి సహజ సంపదను సొమ్ము చేసుకొని రూ.కోట్లు సంపాదించుకుంటున్నారు. ఈ అక్రమ మట్టి మాఫియా దందా.. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుమ్మలూరు గ్రామం లో(ఎన్నే గడ్డ) 315 సర్వే నెంబర్ లో పలు బై నెంబర్లలో గ్రామ రెవెన్యూ శివారు వరకు ఉన్న భూమిలో మూడు పువ్వులు ఆరు కాయలుగా అన్న చందంగా మట్టి తవ్వకాలు రాత్రిపూట జోరుగా జరుగుతున్నాయి. పచ్చదనంతో ఉన్న గుట్టలను తొలగిస్తూ, రాత్రికి రాత్రే గుట్టలు గుల్ల అవుతున్నాయి.

కొన్ని చోట్ల అసలు అనుమతులు లేకుండానే తవ్వుతున్నారు. మరికొన్ని చోట్ల అనుమతులు తీసుకున్నా పరిమితులకు మించి, హద్దులు దాటి పాతాళంలోకి మట్టి తవ్వకాలు జరుపుతున్నారు. మట్టి దందా జోరుగా నడుస్తున్న అటువైపు మైనింగ్ శాఖ అధికారులు కన్నెత్తి చూడటం లేదు. దీంతో పచ్చని చెట్లతో ఉండే గుట్టలు ఈ అక్రమార్కుల చేతిలో పిండిలాగా తయారవుతున్నాయి. ప్రకృతి సిద్ధంగా ఉన్న సహజ సంపదను కొల్లగొట్టి అక్రమార్కులు రూ. కోట్లు సంపాదిస్తున్నారు.


తుమ్మలూరు గ్రామానికి చెందిన ఓ వ్యక్తి, ఇతర గ్రామాలకు చెందిన అక్రమార్కులు..రైతుల వద్ద రూ.200 చొప్పున ఒక ట్రిప్‌కి కొనుగొలు చేసి ఓ ప్రదేశంలో మట్టిని నిల్వ చేసి, మార్కెట్లో గిరాకీ రాగానే అమ్ముతున్నారు. మరికొంత మంది అక్రమార్కులు పలు కంపెనీలకు, వెంచర్ లోకి మట్టిని ట్రిప్ కు రూ. 3000 నుంచి రూ. 4000 వరకు అమ్ముకుంటున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. రైతుల వద్దకు అక్రమార్కులు వెళ్లి.. ఎకరాకు లక్ష రూపాయల చొప్పున ఇస్తామని, అన్ని అనుమతులు మేమే చూసుకుంటామాని చెప్పి రైతులతో బేరసారాలు మాట్లాడుకుని తవ్వకాలు జరుపుతున్నారు. టిప్పర్ల‌లో ఓవర్ లోడ్ తో మట్టిని తరలిస్తున్నారు.

తుమ్మలూరు గ్రామం నుంచి తుమ్మలూరు గేట్ కి వెళ్లే ప్రధాన రహదారి, తుమ్మలూరు నుండి మొహబ్బత్ నగర్ వెళ్లే ప్రధాన రహదారి పూర్తిగా గుంతల మయంగా మారిపోయాయి. దీంతో వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ రహదారిపై ద్విచక్ర వాహనదారులు ప్రయాణం చేయాలంటే ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని వెళ్లాల్సిన దుస్థితి వస్తుందని ప్రయాణికులు పేర్కొంటున్నారు. ఒకపక్క ప్రభుత్వం హరితహారం పేరుతో చెట్లు పెంచాలని చెబుతుంటే.. మరో ప్రక్క గుట్ట పైన ఉండే చెట్లను తొలగిస్తుంటే ఏ అధికారికీ కనిపించడం లేదా అని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. భవిష్యత్ లో గ్రామంలో ఉన్న ఎన్నో గుట్ట కనుమరుగైపోతుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మైనింగ్ శాఖ అధికారులు కళ్లు తెరవాలని గ్రామస్తులు కోరుతున్నారు.



Next Story

Most Viewed