కెనడా బలమైన, స్వతంత్ర న్యాయ వ్యవస్థతో కూడిన చట్టబద్ధమైన దేశం: జస్టిన్ ట్రూడో

by Disha Web Desk 17 |
కెనడా బలమైన, స్వతంత్ర న్యాయ వ్యవస్థతో కూడిన చట్టబద్ధమైన దేశం: జస్టిన్ ట్రూడో
X

దిశ, నేషనల్ బ్యూరో: ఖలిస్తాన్ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్యకు సంబంధించి ముగ్గురు భారతీయ పౌరుల అరెస్ట్ తర్వాత కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో కీలక వ్యాఖ్యలు చేశారు. కెనడా బలమైన, స్వతంత్ర న్యాయ వ్యవస్థతో కూడిన చట్టబద్ధమైన దేశం, దాని పౌరులందరినీ రక్షించడానికి ప్రాథమిక నిబద్ధతతో కూడిన నియమావళి కలిగి ఉందని ఒక సమావేశంలో వ్యాఖ్యానించారు. నిజ్జార్ హత్యతో కెనడాలోని సిక్కు సమాజంలో చాలా మంది అసురక్షితంగా ఉన్నారని, ప్రతి కెనడియన్‌కు కెనడాలో వివక్ష, హింస బెదిరింపులు లేకుండా సురక్షితంగా జీవించే ప్రాథమిక హక్కు ఉందని ట్రూడో అన్నారు. ఎడ్మోంటన్‌లో నివసిస్తున్న కరణ్ బ్రార్, కమల్‌ప్రీత్ సింగ్, కరణ్‌ప్రీత్ సింగ్ అనే ముగ్గురు భారతీయ పౌరులు నిజ్జార్ హత్యకు కుట్ర పన్నారని వారిపై అభియోగాలు మోపి కెనడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో కెనడా ప్రధాని ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

ప్రస్తుతానికి హత్యలో వీరి ప్రమేయంపై పూర్తి స్థాయిలో విచారణ సాగుతుందని కెనడియన్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ ఒక ప్రకటనలో పేర్కొంది. భారత్‌పై ట్రూడో చేసిన విమర్శలపై జైశంకర్ స్పందిస్తూ, ట్రూడో ఆరోపణలను అసంబద్ధం, ప్రేరేపితమైనవని కొట్టిపారేశారు. నిజ్జార్ హత్యపై కెనడాలో జరుగుతున్న పరిణామాలు వారి అంతర్గత రాజకీయాల వల్లే జరుగుతున్నాయని, భారత్‌తో ఎలాంటి సంబంధం లేదని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా భారత ప్రతిష్ట ఇప్పుడు గతంలో కంటే చాలా ఎక్కువగా ఉంది. వివిధ దేశాధినేతలు భారత్‌ను, ప్రధానమంత్రిని ప్రశంసిస్తున్నారని విదేశాంగ మంత్రి తెలిపారు.

Next Story