వైద్యఉద్యోగ సంఘాలపై‌‌ సర్కార్ 'గుర్రు'.. వారిపై స్పెషల్ ఫోకస్!

by Disha Web Desk 19 |
వైద్యఉద్యోగ సంఘాలపై‌‌ సర్కార్ గుర్రు.. వారిపై స్పెషల్ ఫోకస్!
X

దిశ, తెలంగాణ బ్యూరో: వైద్యారోగ్య ఉద్యోగ సంఘాలపై సర్కార్​గుర్రుగా ఉన్నది. ఆరోగ్యశాఖను బలోపేతం చేసేందుకు విధానాల్లో మార్పులు తేవాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే, కొందరు యూనియన్​నాయకులు చిక్కులు సృష్టిస్తున్నట్లు ప్రభుత్వం అంతర్గతంగా చేసిన పరిశీలనలో తేలింది. ఆసుపత్రుల డెవలప్‌మెంట్‌లో అడ్డుపడుతున్నట్లు అభిప్రాయాలను సేకరించింది. దీంతో అలాంటి యూనియన్​నాయకుల చిట్టాను ప్రభుత్వం వెలికితీస్తున్నది. ఆసుపత్రిలో ఏ కేడర్‌లో ఉన్నారు? ప్రజలకు ఎలా వైద్య సేవలు అందిస్తున్నారు? డ్యూటీలకు సక్రమంగా అటెండ్​అవుతున్నారా? నెలలో సగటున ఎంత సమయం వరకు దవాఖాన్లలో ఉంటున్నారు? వంటి వాటిపై ఆరా తీస్తున్నది.

విభాగాల వారీగా ఈ డేటాను సేకరించనున్నారు. అంతేగాక కోఠి ఆరోగ్యశాఖలోని హెచ్‌ఓడీల కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న వాళ్లపై కూడా ఫోకస్​పెట్టారు. డ్యూటీ డుమ్మాలకు కొట్టి హెచ్‌ఓడీ ఆఫీస్‌లకు వస్తున్నోళ్లపై కూడా నిఘా పెట్టారు. ఈ మేరకు ప్రత్యేక టీమ్‌లు అంతర్గతంగా సర్వే చేసి నివేదికను తయారు చేస్తున్నారు. ఆ నివేదిక ప్రకారం ప్రభుత్వానికి, ప్రజలకు నష్టం చేకూర్చే విధంగా ప్రయత్నించే నాయకులపై చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉన్నట్లు హెల్త్​ఆఫీసర్లలో ఒకరు చెప్పారు.

ఇప్పుడేం జరుగుతున్నది..?

ఆరోగ్యశాఖలో లాంగ్​స్టాండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వం కసరత్తులు చేస్తున్నది. అయితే సక్రమంగా విధులు నిర్వర్తించని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలనుకుంటున్నది. దీనిలో భాగంగానే శానిటేషన్, పేషెంట్ కేర్, ట్రీట్మెంట్, మందులు పంపిణీ వ్యవస్థల్లో చిక్కులు సృష్టిస్తున్నోళ్లకు పనిష్మెంట్ ఇవ్వాలనుకుంటున్నది. దీన్ని అమలు చేయాలని ప్రభుత్వం ముందుకు వెళ్తుంటే కొన్ని వైద్య సంఘాలు వాట్సాప్​గ్రూప్‌లు, సోషల్​మీడియాల్లో స్వలాభాల కోసం ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నాయి.

దీంతో ప్రభుత్వం చేసే మంచి కంటే చెడు ఎక్కువగా వ్యాప్తి చెందుతున్నది. మరోవైపు అడ్మినిస్ట్రేషన్​వ్యవస్థలో మార్పులు తేవాలని ఐఏఎస్, ఆర్డీవో స్థాయి ఆఫీసర్లకు ఆసుపత్రి మానిటరింగ్ బాధ్యతలు అప్పగించాలని ప్రభుత్వం భావిస్తున్నది. దీని వలన వ్యవస్థలో కొంత చేంజ్​వస్తుందని సర్కార్​ఆలోచిస్తున్నది. అంతేగాక డ్యూటీ సమయంలో ప్రైవేట్​ప్రాక్టీస్‌కు చెక్​పెట్టడం వంటివి చేయాలనుకుంటున్నది. కానీ కొన్ని వైద్య సంఘాలు తమ ఉనికిని కోల్పోతామనే భయంతో ప్రజలు నష్టపోతారంటూ తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయి. అలాంటి ప్రచారాలు చేసే సంఘాలకు చెక్​ పెట్టాలని ప్రభుత్వం సీరియస్​గా దృష్టి పెట్టింది.


Next Story

Most Viewed