IAS, IPS అధికారులపై కీలక వ్యాఖ్యలు చేసిన టీడీపీ ఎమ్మెల్సీ

by Disha Web Desk 13 |
IAS, IPS అధికారులపై కీలక వ్యాఖ్యలు చేసిన టీడీపీ ఎమ్మెల్సీ
X

దిశ, ఏపీ బ్యూరో: రాజ్యాంగాన్ని గౌరవిస్తూ, చట్టప్రకారం నడుచుకోవాల్సిన ఐఏఎస్.. ఐపీఎస్ అధికారులు అయ్యా ఎస్ లుగా మారబట్టే రాష్ట్రం ఇలా తయారైంది. చట్టాలను కాపాడి, ప్రజలకు అండగా నిలవాల్సిన సివిల్ సర్వీస్ అధికారులే పాలకుల అడుగులకు మడుగు లొత్తబట్టే, రాష్ట్రంలో వ్యవస్థలన్నీ సర్వ నాశనమయ్యాయి. చంద్రబాబు హయాంలో తలబిరుసుగా మాట్లాడిన ఐఏఎస్ లంతా ఇప్పుడు అయ్యా ఎస్ అంటూ.. ఎందుకు తలదించుకుంటున్నారు? అని టీడీపీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు ప్రశ్నించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఎమ్మెల్సీ అశోక్ బాబు మీడియాతో మాట్లాడారు. 'రాష్ట్రంలో జరిగిన కొన్ని సంఘటనలతో ఈ రోజు ఫూల్స్ డే అని చాలామంది మరచిపోయారు. న్యాయం అమలు చేసే క్రమంలో ఒకేసారి రాష్ట్రానికి చెందిన 8 మంది ఐఏఎస్ అధికారులకు న్యాయస్థానం శిక్షలు వేయడమనేది బహుశా దేశ చరిత్రలో కూడా ఇదే తొలిసారి' అని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు అభిప్రాయపడ్డారు.

ఐఏఎస్ అధికారులను కోర్టు దండించింది..

'రాష్ట్ర ప్రభుత్వం, మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు కోర్టులతో చీవాట్లు తినడం, ఆఖరికి శిక్షలు వేయించుకునే వరకు వెళ్లడం నిజంగా రాష్ట్రానికి సిగ్గుచేటు. జగన్మోహన్ రెడ్డి విద్యుత్ చార్జీల పెంపుతో ప్రజలను శిక్షిస్తే, ఆయన అనాలోచిత చర్యల్లో పాలు పంచుకుంటూ ప్రజలను వేధిస్తున్న ఐఏఎస్ అధికారులను న్యాయస్థానం శిక్షించడం జరిగింది.


కోర్టు చేత శిక్షించబడిన వారంతా సీనియర్ ఐఏఎస్ అధికారులే. వారేమీ కొత్తగా నిన్నో.. మొన్నో సర్వీసుల్లోకి వచ్చినవారు కాదు. ఈ ప్రభుత్వంలో నిర్మిస్తున్న సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు.. ఇతరత్రా పనికిమాలిన భవనాలను ప్రభుత్వ పాఠశాలలు, హైస్కూళ్ల కు చెందిన స్థలాల్లో నిర్మించకూడదనేది ఎప్పటినుంచో ఉంది.

దానికి విరుద్ధంగా రాష్ట్రాల్లో అనేక చోట్ల ఈ ప్రభుత్వం వివిధ భవనాలు నిర్మించింది. దానిపై ఏపీ హైకోర్టు ప్రభుత్వానికి నోటీసులు ఇస్తే స్పందన లేదు. దీంతో ఆగ్రహించిన రాష్ట్ర అత్యున్నత ధర్మాసనం 8 మంది ఐఏఎస్ అధికారులను న్యాయస్థానానికి పిలిచి దండించింది. దాంతో వారు న్యాయమూర్తులను క్షమాపణ కోరగా సంక్షేమ హాస్టళ్లలో సేవలందించాలని ఆదేశించింది. ఈ ప్రభుత్వంలో అధికారులు, యంత్రాంగం ఎందుకు ఇలా తయారైందన్నదే అందరి సందేహం' అని ఎమ్మెల్సీ అశోక్ బాబు అన్నారు.

పద్ధతి మార్చుకోకపోతే మూల్యం చెల్లించుకోవాల్సిందే..

జగన్ రెడ్డి ప్రభుత్వంలో చీఫ్ సెక్రటరీలుగా పనిచేసినవారు.. డీజీపీలు అందరూ న్యాయస్థానాల్లో చేతులుకట్టుకొని నిలబడినవారే. గతంలో ప్రతిపక్షనేత చంద్రబాబుని విశాఖవిమానాశ్రయంలో అడ్డగించిన ఘటనలో నాటి డీజీపీ గౌతమ్ సవాంగ్‌ను న్యాయస్థానం కోర్టులో నిలబెట్టి, ఏసెక్షన్లు దేనికి వర్తిస్తాయో చదవమని ఆదేశించింది. మెుత్తం గౌతమ్ సవాంగ్ 3 సార్లు హైకోర్టులో దోషిలా నిలబడ్డారు.


అలాగే మాజీ సీఎస్‌లు సుబ్రహ్మణ్యం, నీలంసహానీ, సమీర్ శర్మలుకూడా కోర్టుల చేతిలో చీవాట్లుతిన్నవారే. మొన్నటికి మొన్న 8 మంది ఐఏఎస్‌లు క్షమాపణ కోరితే, అంతకు ముందు ఇంతియాజ్.. మన్మోహన్ సింగ్‌లుకూడా న్యాయస్థానం చేతిలో చీవాట్లుతిన్నారు. ఈ ప్రభుత్వంలో ఐఏఎస్ అధికారులంతా ఎందుకిలా అయ్యా ఎస్‌లుగా మారారు? అని ఎమ్మెల్సీ అశోక్ బాబు ప్రశ్నించారు.

కొడుకు పాలనలోనే కాదు.. గతంలో తండ్రిపాలనలో కూడా బీపీ ఆచార్య, శ్రీలక్ష్మి, రాజగోపాల్, శామ్యూల్, రత్నప్రభ, మన్మోహన్ సింగ్ లాంటివారు కోర్టుల చుట్టూ తిరిగారు. వారిలో కొందరు ఇప్పటికీ కోర్టువాయిదాలకు వెళ్తూనే ఉన్నారు. ప్రజలచేత ఎన్నుకోబడినవారికి అధికారానికి, రాజ్యాంగానికి మధ్య ఉండే వ్యత్యాసం తెలియచేయాల్సింది ఐఏఎస్ అధికారులే. రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాల్సిన ఐఏఎస్ అధికారులు రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గితే వారుకూడా బలికాకతప్పుదు అని ఎమ్మెల్సీ అశోక్ బాబు హెచ్చరించారు.

ఈ ప్రభుత్వంలో ఐఏఎస్ అధికారులు, ముఖ్యమంత్రి, మంత్రులు చెప్పేదానికి గంగిరెద్దుల్లా తలాడిస్తున్నారనే చెప్పాలి. ముఖ్యమంత్రి, మంత్రులు ఉండేది 5సంవత్సరాలే..కానీ ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు 30ఏళ్లపాటు సర్వీసులోఉంటారు. అలాంటివారు రాజ్యాంగాన్ని.. చట్టాలను, న్యాయాన్నికాపాడకుండా, అధికారంలోఉన్నవారి కి ఊడిగంచేస్తేఎలా? ఐఏఎస్ అధికారి ముఖ్యమంత్రో.. మంత్రోకావచ్చు కానీ ముఖ్యమంత్రి, మంత్రులెవరూ ఐఏఎస్.. ఐపీఎస్ కాలేరు. ఇండియన్ సివిల్ సర్వీసెస్ గొప్పతనం అది అని ఎమ్మెల్సీ అశోక్ బాబు చెప్పుకొచ్చారు.

సరిహద్దుల్లో ఉండి దేశాన్ని కాపాడుతున్న సైనికులకు.. ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు తక్కువేమీకాదు. వారు బోర్డర్‌లో ఉండి కాపలకాస్తే.. సివిల్ సర్వీస్ అధికారులు దేశంలోఉండి దేశాన్ని, ప్రజలను రక్షించాలి. వారిబాధ్యతను విస్మరించి, కంచెచేను మేసినట్టుగా ప్రవర్తిస్తే, వారు తగిన మూల్యం చెల్లించుకోకతప్పదు. ఐఏఎస్.. ఐపీఎస్ అధికారులు ఇకనుంచైనా వ్యవహారశైలి మార్చుకొని చట్టప్రకారం నడుచుకోవాలి అని ఎమ్మెల్సీ అశోక్ బాబు సూచించారు.

Next Story

Most Viewed