మోదీని ఆహ్వానించడానికి సీఎం రావాల్సిన అవసరం లేదు.. మంత్రి తలసాని కామెంట్స్

by Disha Web Desk 4 |
మోదీని ఆహ్వానించడానికి సీఎం రావాల్సిన అవసరం లేదు.. మంత్రి తలసాని కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రధానిని ఆహ్వానించడానికి సీఎం రావాలని ఎక్కడా ప్రోటోకాల్ లో లేదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. రాష్ట్రానికి వచ్చిన ప్రధానిని ఆహ్వానించడానికి రాష్ట్ర ప్రతినిధిగా కేబినెట్ మినిస్టర్ ఉన్నా సరిపోతుందని తెలిపారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీని బేగంపేట విమానాశ్రయంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆహ్వానించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ప్రధానిని ఆహ్వానించేందుకు సీఎం కేసీఆర్ రాకపోవడంపై బీజేపీ నేతలు అనవసరంగా రాద్దాంతం చేస్తున్నారని అన్నారు. భారత్ బయోటెక్ కు మోడీ వచ్చిన సందర్భంలో ప్రోటోకాల్ అవసరం లేదా? అని ప్రశ్నించారు. కార్యవర్గ సమావేశాలు ఉన్నాయనే నెపంతో గత వారం రోజులుగా రాష్ట్ర నేతలతో పాటు ఆయా రాష్ట్రాల నుండి వచ్చిన బీజేపీ నేతలు నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారని, వారి భాష సరిగా లేదని మండిపడ్డారు. వారందరికి చిన్న శాంపిల్ ఇచ్చేందుకే ఇవాళ యశ్వంత్ సిన్హా రాక సందర్భంగా ర్యాలీ నిర్వహించామని చెప్పారు.

రాష్ట్రానికి వస్తున్న బీజేపీ టూరిస్టులంతా తెలంగాణ అభివృద్దిని చూడాలని, ఇక్కడ జరుగుతున్న డెవలప్‌మెంట్‌ను ఒక మోడల్ గా తీసుకుని ఆయా రాష్ట్రాల్లో అమలు చేయాలని సూచించారు. ఫ్లెక్సీల విషయంలో మొదట వివాదం ప్రారంభించింది బీజేపీయేనని అన్నారు. సీఎం కేసీఆర్ ను ఉద్దేశించి వారు చేసిన దుర్మార్గపు ప్రాచారాన్ని ఒక రాజకీయ పార్టీగా తిప్పికొట్టేందుకు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశామన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను చేతిలో పెట్టుకుని బెదిరించాలని ప్రయత్నిస్తే.. ఇక్కడ ఎవరూ భయపడరని స్పష్టం చేశారు. మహారాష్ట్రలో బీజేపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని, తెలంగాణలోనూ అదే సీన్ రిపీట్ అవుతుందని ప్రచారం చేస్తున్న బీజేపీకి ఉన్న బలం ఎంత అని ప్రశ్నించారు. మోడీ గద్దెదిగిపోవాలని ప్రతిపక్షాలతో పాటు ప్రజలు కోరుతున్నారని అన్నారు. దేశంలో ప్రజలు ముందస్తు ఎన్నికలు కావాలని కోరుకుంటున్నారని, దానికి తామంతా సిద్దంగా ఉన్నామని చెప్పారు.


Next Story

Most Viewed