పురుషుల్లో ఆకలిని ప్రేరేపిస్తున్న సూర్యకాంతి

by Disha Web Desk 19 |
పురుషుల్లో ఆకలిని ప్రేరేపిస్తున్న సూర్యకాంతి
X

దిశ, ఫీచర్స్ : ప్రపంచదేశాలు హీట్‌వేవ్స్ వంటి తీవ్ర వాతావరణ పరిస్థితుల నడుమ కొట్టుమిట్టాడుతున్నాయి. ఈ క్రమంలో సూర్యరశ్మి మనుషులకు వేడి, ఉక్కపోతను కలిగించడమే కాక ఆకలిగా కూడా మారుస్తుందని కొత్త అధ్యయనం వెల్లడించింది. ఇది పురుషుల్లో ఆకలిని పెంచే ప్రత్యేకమైన హార్మోన్‌ను ప్రేరేపిస్తుందని టెల్ అవీవ్ యూనివర్సిటీలోని హ్యూమన్ జెనెటిక్స్ అండ్ బయోకెమిస్ట్రీ డిపార్ట్‌మెంట్‌కు చెందిన పరిశోధకుల బృందం కనుగొంది. ఈ అధ్యయనం నేచర్ కమ్యూనికేషన్స్ జర్నల్‌లో ప్రచురించబడింది.

సోలార్ ఎక్స్‌పోజర్ అనేది మహిళల్లో కాకుండా పురుషుల్లో ఆహారం కోరుకునే ప్రవర్తనతో పాటు తినే ప్రక్రియను ప్రేరేపిస్తుంది. అయితే అతినీలాలోహిత(UV) రేడియేషన్ వంటి పర్యావరణ సూచనలకు పురుషులు, మహిళలు భిన్నంగా ప్రతిస్పందిస్తారా? అనేది మాత్రం పరిశోధించబడలేదు. ఎలుకలపై జరిపిన పరిశోధనలో ఈ విషయాన్ని గుర్తించగా.. 'ఎలుకలు, హ్యూమన్ మేల్స్‌లో పెరిగిన ఆకలి అనేది గ్రెలిన్ ప్రసరణ అధిక స్థాయిలతో సంబంధం కలిగి ఉంటుందని అధ్యయనం పేర్కొంది. పరిశోధకులు మూడేళ్లలో జాతీయ పోషకాహార సర్వేలో భాగంగా 3,000 మంది పార్టిసిపెంట్స్ నుంచి డేటాను విశ్లేషించారు. ఇందులో పురుషులు మాత్రమే వేసవిలో ప్రతిరోజు 300 కేలరీల అదనపు ఆహారాన్ని తీసుకునేవారని కనుగొన్నారు. ఇది ఏమంత ఎక్కువ కానప్పటికీ, ఎక్కువ కాలం ఇలాగే తీసుకుంటే అది బరువు పెరగడానికి దారితీస్తుంది.

సూర్యరశ్మికి ఎక్కువగా ఎక్స్‌పోజ్ కావడంతో చర్మ కణాల్లోని DNA దెబ్బతిని గ్రెలిన్ విడుదలవుతుంది. తద్వారా ఎక్కువగా తినాలనే కోరిక ఏర్పడుతుంది. మహిళల విషయానికొస్తే.. ఇది ఈస్ట్రోజెన్ ద్వారా నిరోధించబడవచ్చు. ఆకలి నియంత్రణను ఒక సంక్షిష్ట ప్రక్రియగా పేర్కొన్న పరిశోధకులు.. అది ఆరోగ్యాన్ని నేరుగా ప్రభావితం చేసే గ్రెలిన్, లెప్టిన్ హార్మోన్లతో సంబంధం కలిగి ఉంటుందని తెలిపారు. అందుకే భోజనం తర్వాత గ్రెలిన్ స్థాయిలు అత్యల్పంగా ఉండి, ఆ తర్వాత పెరుగుతాయి. ఈ ఫలితాలు ఎండోక్రైన్-సంబంధిత వ్యాధుల్లో సెక్స్-ఆధారిత ట్రీట్మెంట్స్ కోసం అవకాశాలకు దారితీయవచ్చని పరిశోధకులు వెల్లడించారు.

Next Story

Most Viewed