‘దిశ’ ఎఫెక్ట్.. బ్యాంక్ ఖాతాదారులకు హామీ ఇచ్చిన రీజినల్ డీజీఎం

by Aamani |
‘దిశ’ ఎఫెక్ట్..  బ్యాంక్ ఖాతాదారులకు హామీ ఇచ్చిన రీజినల్ డీజీఎం
X

దిశ, మంగపేట : ‘బ్యాంకులో బంగారం మాయం’ అప్రైజర్ చేతివాటం పేరుతో ఈ నెల 26న ‘దిశ వరంగల్ జిల్లా టాబ్లాయిడ్ లో వచ్చిన కథనానికి రాజుపేట కెనరా బ్యాంక్ రీజనల్ డీజీఎం శ్రీనివాసరావు, ఏజీఎం వరంగల్ లు స్పందించారు. సోమవారం మండలంలోని రాజుపేట కెనరా బ్యాంకును సందర్శించి బంగారం మాయమైన విషయంలో విచారణ చేపట్టినట్లు తెలిపారు. ఈ సందర్భంగా రీజనల్ డీజీఎం శ్రీనివాసరావు విలేకర్లతో మాట్లాడుతూ బ్యాంకులో 3 వేల బంగారం ప్యాకెట్లకు గాను 27 ప్యాకెట్లు మాయమైనట్లు గుర్తించామని, వాటి బరువు సుమారు 2 కేజీలకు పైగా రూ. కోటి 50 లక్షల వరకు విలువ ఉంటుందని అంచనా వేసినట్లు తెలిపారు. బ్యాంకు నియమ నిబంధనల మేరకు నియమించిన గోల్డ్ అప్రైజర్ నమ్మకంతో బ్యాంకు సిబ్బందిని మోసం చేసినట్లు గుర్తించామని, ఇందులో బ్యాంకు సిబ్బంది ప్రమేయంపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నందున బ్యాంకులో పని చేస్తున్న సిబ్బందిని స్థానంలో కొత్త సిబ్బందిని నియమించి ఖాతాదారులకు సేవలందించనున్నట్లు తెలిపారు.

ఖాతాదారులు ఆందోళన చెందవద్దు..

బ్యాంకులో జరిగిన గోల్డ్ మాయంపై ఖాతాదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కెనరా బ్యాంకు జాతీయ బ్యాంకు కాబట్టి నష్టపోయిన ఖాతాదారులకు వెంటనే బంగారం రీయింబర్స్ మెంట్ చేయనున్నట్లు తెలిపారు. బ్యాంకు పని దినాలు రెగ్యులర్ గా ఉంటాయని మాయమైన బంగారం ఖాతాదారులను గుర్తించే పనిలో తమ సిబ్బంది ఉన్నదని త్వరలోనే ఖాతాదారులను గుర్తించి వారికి బంగారం కావాలంటే బంగారం డబ్బు కావాలంటే డబ్బు రీయింబర్స్ మెంట్ చేయడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు బ్యాంక్ రీజనల్ డీజీఎం శ్రీనివాసరావు, ఎజీఎంలు భరోసా ఇచ్చారు.

కెనరా బ్యాంకులో బంగారం మాయమైన విషయం ఈ నెల 26 ఆదివారం దిశ పత్రిక వెలుగులోకి తేవడంతో ఖాతాదారులు ఆందోళన చెందారు. 25 శనివారం, 26ఆదివారం బ్యాంకుకు సెలవు ఉండడంతో ఈ రెండు రోజులు విషయం తెలియక ఖాతాదారులు ఆందోళన చెందడమే కాకుండా బంగారం మాయమైన విషయమై దిశలో వచ్చిన వార్త విషయంలో రిపోర్టర్ కి వందలాదిగా ఫోన్లు చేసి ఆరా తీశారు. నిబంధనల మేరకు వివరాలు వెల్లడించకపోవడంతో ఆ నోటా ఈ నోటా కెనరా బ్యాంకులో జరిగిందనే విషయం వెలుగులోకి రావడంతో సోమవారం బ్యాంకు తెరవడంతో వందలాదిగా ఖాతాదారులు బ్యాంకుకు చేరుకొని ఆందోళన వ్యక్తం చేసేవారు. విషయం తెలుసుకున్న ఎస్సై రవికుమార్ బ్యాంకుకు చేరుకుని ఖాతాదారులను శాంతింపజేసి అధికారులతో మాట్లాడించి మాయమైన బంగారం స్థానంలో ఖాతాదారులకు వెంటనే రీయింబర్స్ మెంట్ చేస్తామని హామీ మేరకు శాంతించారు. బ్యాంకులో బంగారం మాయమైన విషయంలో అధికారులు ఈ నెల 22న కేసు నమోదు చేశారని విచారణ చేపట్టినట్లు ఎస్సై రవికుమార్ తెలిపారు.

Next Story

Most Viewed