సమస్యాత్మక భూమిలో అక్రమ వాలు గోడ నిర్మాణాన్ని అడ్డుకున్న మహిళలు...

by Kalyani |
సమస్యాత్మక భూమిలో అక్రమ వాలు గోడ నిర్మాణాన్ని అడ్డుకున్న మహిళలు...
X

దిశ , మనోహరాబాద్ : సమస్యాత్మక భూమిలో నిర్మిస్తున్న వాలు గోడను మహిళలు అడ్డుకొని కోపోద్రేకం తో కొంత భాగాన్ని కూల్చివేశారు. ఈ సంఘటన మండలంలోని కొండాపూర్ గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. గ్రామంలో ఉన్న సర్వే నంబర్ 114 లోని 11. 37 ఎకరాల భూమి గతంలో ప్రభుత్వ ఆధీనంలో ఉన్న కారిజ్ ఖాతా భూమి పట్టా భూమి గా నమోదైంది. గత రెండు రోజుల నుంచి కొంతమంది వ్యక్తులు ఈ భూమిని కొనుగోలు చేసి వాలు గోడ నిర్మాణం చేపడుతున్నారు. ఇది గమనించిన గ్రామస్తులు ఒక్కసారిగా ఆగ్రహానికి గురై నిర్మాణం జరుగుతున్న భూమి దగ్గరికి వెళ్లి మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని కొంత భాగం నిర్మాణాన్ని కూల్చివేసి పనులను ఆపివేశారు.

గత కొన్ని సంవత్సరాల నుండి ఈ భూమి కారిజ్ ఖాతా భూమిగా రెవెన్యూ రికార్డులలో నమోదు ఉందని గ్రామస్తులు తెలిపారు. ఈ భూమి గ్రామ అవసరాలతో పాటు ఇండ్లు లేని నిరుపేదలకు ఇంటి స్థలం మంజూరు చేస్తే ఇల్లు నిర్మించుకుంటామని గ్రామస్తులు తెలిపారు. ఈ భూమిపై ఒక వ్యక్తి కన్ను పడి అధికారుల అండదండలతో ఎన్ఓసి లేకుండానే అక్రమంగా పట్టా మార్పిడి చేసుకొని కొంతమంది వ్యక్తులకు కోట్లకు అమ్ముకొని సొమ్ము చేసుకుని వెళ్లిపోయాడని గ్రామస్తులు తెలిపారు.

ఈ సంఘటన స్థలానికి గ్రామానికి చెందిన మాజీ విఆర్ఓ లక్ష్మీ నరసింహ రెడ్డి మాట్లాడుతూ… ఇది ముమ్మాటికీ కారిజ్ ఖాతా భూమి అని, ఎన్ఓసీ లేకుండానే పట్టా మార్పిడి చేసుకున్నారని ఆయన తెలిపారు. పూర్తిస్థాయిలో అధికారులు విచారణ చేపట్టి కారిజ్ ఖాతా భూమిని అక్రమంగా పట్టా మార్పిడి పై పూర్తిస్థాయిలో విచారణ జరిపి గ్రామస్తులకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ప్రస్తుతం గోడ నిర్మిస్తున్న వ్యక్తులు మాట్లాడుతూ… తమ వద్ద పట్టా సర్టిఫికెట్లు ఉన్నాయని తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని గొడవను సద్దుమణిగించారు. ఏమైనా ఆధారాలతో ఉన్న సర్టిఫికెట్ ఉంటే పోలీస్ స్టేషన్ కు వచ్చి మాట్లాడుకోవాలని ఇరువర్గాలకు సూచించారు.

Next Story

Most Viewed