డీసీసీ అధ్యక్షుడిగా సుధాకర్ రెడ్డి..? రేసులో 'అర్ద' ముందంజ

by Disha Web Desk 12 |
డీసీసీ అధ్యక్షుడిగా సుధాకర్ రెడ్డి..? రేసులో అర్ద ముందంజ
X

దిశ, వికారాబాద్ : కాంగ్రెస్ పార్టీ నూతన (డీసీసీ) జిల్లా అధ్యక్ష పదవి పగ్గాలు ఎవరు చేపట్టబోతున్నారు అనే చర్చ జిల్లాలో హాట్‌టాపిక్ అయింది. పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కాంగ్రెస్ బూత్ లెవల్ స్థాయి నుంచి పుంజుకుంటుంది. రాష్ట్రంలో కాంగ్రెస్.. టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయంగా ఎదగడమే కాకా, వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది తామేనని ఆ పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ పాలనపై ప్రజలలో ముఖ్యంగా యువతలో ఉన్న వ్యతిరేకత, దీంతోపాటు కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిన సెంటిమెంట్ కలిసిరావడం, ముఖ్యంగా తెలంగాణలో పార్టీ పగ్గాలు డైనమిక్ లీడర్ రేవంత్ రెడ్డి చేతిలో ఉండటం ఇవన్నీ తమ కలిసొచ్చే అంశాలని, అందుకే వచ్చే ఎన్నికల్లో గెలుపు తమదేననే ధీమాలో నేతలు ఉన్నారు.

కొత్తవారికి జిల్లా అధ్యక్ష పదవులు

ఇలాంటి అనుకూల సమయం, ఎన్నికలు కూడా దగ్గర పడడంతో పార్టీలో కొత్తనీరు ప్రవహిస్తే మరింత బలోపేతం అవుతుందనే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అభిప్రాయం మేరకు ఎక్కువ శాతం జిల్లా అధ్యక్షత పదవులు కొత్తవారికి ఇవ్వాలనే ఆలోచనలో ఉందని తెలుస్తోంది. పైగా ఈ మధ్య పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియలో ఎవరైతే ముందంజలో నిలుస్తారో వారికే జిల్లా పార్టీ బాధ్యతలు అప్పగిస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చినట్లు తెలుస్తుంది. దీనిని బట్టి చూస్తే వికారాబాద్ జిల్లా పార్టీ పగ్గాలు కౌన్సిలర్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్, పట్టణ అధ్యక్షుడు అర్ద సుధాకర్ రెడ్డినే వరిస్తాయనే చర్చ జరుగుతోంది. పార్టీ సభ్యత్వ నమోదులో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోనే మొదటి స్థానంలో నిలిచిన సుధాకర్ రెడ్డి ఇప్పటికే రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి దృష్టిలో ఉన్నట్లు తెలుస్తుంది.

పైగా జిల్లా కేంద్రంలోనే ఉంటూ 24 గంటలు కార్యకర్తలకు అందుబాటులో ఉండడం, అధిష్టానం నుంచి ఎలాంటి కార్యక్రమం ఇచ్చిన ప్రస్తుత జిల్లా అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తూ, మాజీ మంత్రి ప్రసాద్ కుమార్ ఏ పిలుపు ఇచ్చిన వెంటనే స్పందిస్తూ జిల్లా కేంద్రంలో పార్టీని పటిష్టం చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. పైగా 10 ఏళ్లుగా కాంగ్రెస్‌లోనే ఉంటూ పార్టీని పటిష్టం చేయడమే కాకుండా, తన రాజకీయ గురువు, మాజీ మంత్రి ప్రసాద్ కుమార్‌కు అత్యంత సన్నిహితుడుగా ఉంటున్నారు. ఇవన్నీ ఆయనకు ప్లస్ పాయింట్స్ కావడం విశేషం.

రేసు నుంచి తప్పుకోకున్న ప్రస్తుత అధ్యక్షుడు?

ఈసారి డీసీసీ పదవి ఇచ్చిన వారికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకూడదని పార్టీ కొత్త పంథా తెరమీదకు తీసుకురావడంతో రామ్మోహన్ రెడ్డి దాదాపు రేసు నుంచి తప్పుకుంటారని చర్చ నడుస్తోంది. ఇది కూడా సుధాకర్ రెడ్డి కి కలిసొచ్చే అంశం. ఇలా ఏ కోణంలో చూసినా జిల్లా అధ్యక్ష బాధ్యతలు చేపట్టే అర్హత, సత్తా సుధాకర్ రెడ్డికి మాత్రమే ఉందనే టాక్ బలంగా వినిపిస్తోంది. సుధాకర్ రెడ్డి తో పాటు ఆశావహులు రేసులో ప్రస్తుత ధారూర్ మండల అధ్యక్షుడు రఘువీరారెడ్డి కూడా ఉన్నట్లు సమాచారం. ఈయనతో పాటు పరిగికి చెందిన హనుమంతు, లాల్ కృష్ణ ప్రసాద్, తాండూర్‌కు చెందిన ఓ ముఖ్య నాయకుడు రేసులో ఉన్నట్లు సమాచారం. వీరందరిలో పార్టీ అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చూపుతుందో చూడాలి.


Next Story

Most Viewed