నాకు మంత్రి పదవి రావొద్దని మొక్కుకోండి.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

by Ramesh Goud |
నాకు మంత్రి పదవి రావొద్దని మొక్కుకోండి.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి రావొద్దని బీఆర్ఎస్ నాయకులంతా దేవుడికి మొక్కాలని, తనకు మంత్రి పదవి వస్తే అవినీతి చేసిన బీఆర్ఎస్ నాయకులు అందరినీ జైళ్లో వేస్తానని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించిన ఆయన బీఆర్ఎస్ నాయకులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్ కుటుంబం మొత్తం జైలుకు వెళ్లడం ఖాయమని, వారితో పాటు మన జిల్లా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కూడా జైలుకు వెళతాడని అన్నారు. జగదీష్ రెడ్డి తొందర పడాల్సిన అవసరం లేదని, ఆయనకు వెయ్యి కోట్ల ఆస్తి ఉందని, నాగారంలో బంగ్లాతో పాటు భూములు ఎలా సంపాదించాడని, హైదరాబాద్ లో బినామీ పేర్లతో ఎన్ని ఆస్తులు ఉన్నాయో బయటకి తీసి జైలుకు పంపిస్తామని స్పష్టం చేశారు.

అనవసరంగా తన గురించి పదే పదే మాట్లాడుతున్నారని, తనకు మంత్రి పదవి రాకుండా బీఆర్ఎస్ లోని అవినీతి నాయకులు దేవుడికి మొక్కుకోవాలని, తనకు మంత్రి పదవి వస్తే ఊరుకునే మనిషిని కాదని, అందరినీ జైలుకు పంపిస్తానని హెచ్చరించారు. బూర నర్సయ్య గౌడ్ దమ్ముంటే తనపై పోటీ చేసి గెలవాలని సవాల్ విసురుతున్నాడని, నాకు దమ్ముంది కాబట్టే కేసీఆర్ ను ఓడించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చామని, దమ్ముంది కాబట్టే కాంగ్రెస్ అధిష్టానం తనకు భువనగిరి ఇన్ చార్జి ఇచ్చిందని అన్నారు. అలాగే బూర నర్సయ్య గౌడ్ అంటే ఒక డాక్టర్ గా తమకు మంచి గౌరవం ఉందని, పిచ్చి ప్రేలాపణలు చేయకుండా ఆ గౌరవాన్ని నిలబెట్టుకోవాలని సూచించారు.



Next Story