అఖిలేష్ యాదవ్, డింపుల్ యాదవ్ ఆస్తులు, అప్పుల వివరాలివీ..

by Dishanational4 |
అఖిలేష్ యాదవ్, డింపుల్ యాదవ్ ఆస్తులు, అప్పుల వివరాలివీ..
X

దిశ, నేషనల్ బ్యూరో : ఉత్తరప్రదేశ్‌లోని కనౌజ్ లోక్‌సభ స్థానం నుంచి నామినేషన్ వేసిన సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తన ఆస్తుల వివరాలను ప్రకటించారు. తనకు రూ. 26.34 కోట్ల ఆస్తులు ఉన్నాయని ఆయన వెల్లడించారు. వీటిలో రూ.17.22 కోట్ల స్థిరాస్తులు, రూ.9.12 కోట్ల చరాస్తులు ఉన్నాయి. అఖిలేష్ వద్ద రూ.25.61 లక్షల నగదు, బ్యాంకు లాకర్లలో రూ. 5.41 కోట్ల నగదు ఉంది. విలువైన వస్తువుల కేటగిరీలో రూ.5.34 లక్షల విలువైన వ్యాయామ యంత్రాలను, రూ.1.6 లక్షల విలువైన మట్టిపాత్రలు, వంట సామాన్లను ఆయన ప్రస్తావించడం గమనార్హం. అఖిలేష్ యాదవ్‌కు గత ఐదేళ్లలో సగటు వార్షిక ఆదాయం రూ.87 లక్షల మేర లభించింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.84.52 లక్షలు, 2021-22లో రూ.1.02 కోట్లు, 2020-21లో రూ. 83.99 లక్షల వార్షిక ఆదాయాన్ని సమాజ్‌వాదీ చీఫ్ గడించారు.

భర్తకు అప్పుపడిన డింపుల్

యూపీలోని మెయిన్‌పురి లోక్‌సభ స్థానం నుంచి అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్ పోటీ చేస్తున్నారు. ఎన్నికల అఫిడవిట్ ప్రకారం.. ఆమెకు రూ.15 కోట్లకుపైగా ఆస్తి ఉంది. ఈ అఫిడవిట్‌లోని ఒక ఆసక్తికరమైన అంశం ఉంది. అదేమిటంటే.. డింపుల్ యాదవ్ తన భర్తకు రూ.54.26 లక్షల అప్పు చెల్లించాల్సి ఉంది. ఆమె వద్ద రూ. 5.1 కోట్ల చరాస్తులు, రూ.10.44 కోట్ల స్థిరాస్తులు ఉన్నాయి. డింపుల్ యాదవ్‌కు గత ఐదేళ్లలో సగటు వార్షిక ఆదాయం రూ. 65 లక్షల మేర వచ్చింది. ఆమెకు 2022-23 సంవత్సరంలో రూ.67.5 లక్షలు, 2021-22లో రూ.78.66 లక్షలు, 2020-21లో రూ.58.93 లక్షల వార్షిక ఆదాయం వచ్చింది. కనౌజ్ అనేది సమాజ్‌వాదీ పార్టీ కంచుకోట. 2019లో ఇక్కడి నుంచి బీజేపీ గెలిచింది. దీంతో ఈసారి టికెట్‌ను తన మేనల్లుడు తేజ్ ప్రతాప్ యాదవ్‌కు ఇస్తానని అఖిలేష్ తొలుత ప్రకటించారు. అయితే రెండు రోజుల్లోనే మాట మార్చి ఆ టికెట్‌ను తానే తీసుకున్నారు.



Next Story