కొత్త బ్యాటరీ టెక్నాలజీ కోసం స్టోర్‌డాట్‌తో ఓలా ఎలక్ట్రిక్ భాగస్వామ్యం!

by Disha Web Desk 12 |
కొత్త బ్యాటరీ టెక్నాలజీ కోసం స్టోర్‌డాట్‌తో ఓలా ఎలక్ట్రిక్ భాగస్వామ్యం!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ ఛార్జింగ్ మౌలిక సదుపాయాల కోసం ఇజ్రాయెల్‌కు చెందిన స్టోర్‌డాట్ కంపెనీతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్టు తెలిపింది. ఇందులో భాగంగా స్టోర్‌డాట్ కంపెనీలు ఓలా ఎలక్ట్రిక్ పెట్టుబడులు పెట్టనుంది. స్టోర్‌డాట్ కంపెనీ అత్యంత వేగంగా ఛార్జింగ్ అందించే టెక్నాలజీ బ్యాటరీలను తయారు చేస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ) బ్యాటరీలతో పాటు ఛార్జింగ్ టెక్నాలజీలో అగ్రగామిగా ఉన్న స్టోర్‌డాట్‌తో ఒప్పందం ద్వారా బ్యాటరీ ఛార్జింగ్‌ టైమ్‌ని చాలా వరకు తగ్గించవచ్చని ఓలా ఎలక్ట్రిక్ సీఈవో భవీష్‌ అగర్వాల్‌ అన్నారు. భవిష్యత్తులో దేశవ్యాప్తంగా ఈవీలకు సంబంధించి తయారీ, అభివృద్ధి-పరిశోధనా(ఆర్అండ్‌డీ) కేంద్రం నెలకొల్పనున్నట్టు ఆయన పేర్కొన్నారు. స్టోర్‌డాట్‌లో పెట్టుబడుల ద్వారా ఓలా ఎలక్ట్రిక్ అత్యాధునికమైన వేగవంతమైన ఫాస్ట్ ఛార్జింగ్ బ్యాటరీ టెక్నాలజీ లభిస్తుంది.

దీనివల్ల కేవలం 5 నిమిషాల్లో 0-100 శాతం ఛార్జ్ పూర్తవుతుంది. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు 18 నిమిషాల ఛార్జింగ్‌తో 78 కిలోమీటర్లు ప్రయాణించేందుకు వీలుంటుంది. ప్రస్తుతం ఓలా ఈవీల్లో మోడల్‌ను బట్టి బ్యాటరీ పూర్తిగా ఛార్జింగ్ అవడానికి కనీసం 4.48 గంటల నుంచి గరిష్ఠంగా 6.30 గంటల సమయం పడుతుంది. స్టోర్‌డాట్ బ్యాటరీ టెక్నాలజీ అందుబాటులోకి వస్తే ఈ సమయం చాలా వరకు తగ్గిపోతుందని భవిష్ అగర్వాల్ తెలిపారు. అలాగే, భారత్‌లో స్టోర్‌డాట్‌కు చెందిన ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ బ్యాటరీలను తయారు చేసేందుకు ఓలా ప్రత్యేక హక్కును కలిగి ఉంటుందని భవిష్ వివరించారు. ఈవీ పరిశ్రమ భవిష్యత్తు మెరుగైన, వేగవంతమైన, అధిక శక్తి కలిగిన బ్యాటరీల ద్వారా సాధ్యమవుతుంది. స్టోర్‌డాట్ వేగవంతమైన ఛార్జింగ్ అందిస్తుందని భవిష్ అగర్వాల్ పేర్కొన్నారు.


Next Story

Most Viewed