బీజేపీ ఎమ్మెల్యేకు షాక్.. అభివృద్ధి కార్యక్రమాలకు వెళ్లకుండా అడ్డుకున్న టీఆర్ఎస్

by Disha Web Desk 12 |
బీజేపీ ఎమ్మెల్యేకు షాక్.. అభివృద్ధి కార్యక్రమాలకు వెళ్లకుండా అడ్డుకున్న టీఆర్ఎస్
X

దిశ, దుబ్బాక : కేంద్ర ప్రభుత్వం పెంచిన డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలు తగ్గించాలంటూ.. అభివృద్ధి పనులను ప్రారంభించడానికి వెళ్లిన ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ నాయకులు అడ్డుకున్న ఘటన సిద్దిపేట జిల్లాలో చోటుచేసుకుంది. సిద్దిపేట జిల్లా తొగుట మండలం గుడికందుల గ్రామంలో బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు, పార్టీ కార్యకర్తలతో కలిసి గ్రామంలో మినీ కూరగాయల మార్కెట్ ప్రారంభోత్సవానికి వెళ్లారు. ఎమ్మెల్యే వస్తాడని ముందుగా తెలుసుకున్న టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే రఘునందన్ రావు కారు ముందు టీఆర్ఎస్ నాయకులు ప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. దీంతో మార్కెట్ ప్రాంతంలో బీజేపీ, టీఆర్ఎస్ రెండు పార్టీల మధ్య ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది.

రైతులు పండించిన వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, అంతేకాకుండా పెంచిన డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలను తగ్గించాలని, గ్రామంలో నిర్మించిన యాభై డబుల్ బెడ్ రూమ్ నిరుపేదలకు ఇవ్వాలని నిరసన తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఇరువర్గాలను సముదాయించే ప్రయత్నం చేశారు. అనంతరం ఎమ్మెల్యే రఘునందన్ రావు పార్టీ కార్యకర్తలతో కలిసి మిరుదొడ్డి పోలీస్ స్టేషన్ లో ధర్నాకు దిగారు. స్టేషన్ లో బైఠాయించి సీఐ, ఎస్ఐలను సస్పెండ్ చేయాలని నినాదాలు చేశారు. పోలీసుల నిర్లక్ష్యం వల్లే ఎమ్మెల్యే రఘునందన్ రావును అడ్డుకున్నారని ఆరోపించారు.

Next Story

Most Viewed