భానుడి ప్రతాపానికి జనం విలవిల.. 437 మందికి 'వడదెబ్బ'

by Disha Web Desk 12 |
భానుడి ప్రతాపానికి జనం విలవిల.. 437 మందికి వడదెబ్బ
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన వారం రోజుల నుంచి దాదాపు 437 మందికి వడదెబ్బ తాకినట్లు వైద్యారోగ్యశాఖ గుర్తించింది. వీరందరికీ తక్షణమే అవసరమైన వైద్యాన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలోనే ఇచ్చారు. ప్రస్తుతం బాధితుల ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు జిల్లా వైద్యాధికారులు చెబుతున్నారు. పీహెచ్​ సీ కు వచ్చిన ప్రతీ వడదెబ్బ పేషెంట్లకు చికిత్స ను అందించి, మూడు రోజుల పాటు హెల్త్​ కండిషన్​ ను మానిటరింగ్​ చేస్తున్నట్లు క్షేత్రస్థాయి వైద్యులు పేర్కొంటున్నారు. ఆశా, ఏఎన్​ఎం లు ప్రతి రోజు వడదెబ్బ బాధితుడి ఆరోగ్య వివరాలను సేకరిస్తున్నారు. బీపీ, హార్డ్​ బీట్, ఫల్స్​ రేట్​, వంటివి వాటిని ఎప్పటికప్పుడు చెక్​ చేస్తున్నామని సర్కారీ డాక్టర్లు వెల్లడిస్తున్నారు.

అంతేగాక బాధితుల బాడీ డీ హైడ్రేషన్​ కాకుండా ఓ ఆర్​ఎస్​, గ్లూకోజ్​, సెలెన్​ బాటిల్స్​ ఎక్కిస్తున్నారు. సూర్యరశ్మి తాకిడి రోజురోజుకూ పెరుగుతుండటంతో పీహెచ్​ సీ కేంద్రాలకు వచ్చే ఎండ దెబ్బ బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నదని క్షేత్రస్థాయి డాక్టర్లు స్పష్టం చేస్తున్నారు. దీంతో అత్యవసరమైతేనే బయటకు రావాలని ఆరోగ్య శాఖ హెచ్చరిస్తోంది. ముఖ్యంగా 12 నుంచి 4 మధ్య సమయంలోని వచ్చే ఎండతోనే వివిధ రకాల ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉన్నదని వివరిస్తున్నారు. దీంతో ఆ సమయంలో వీలైనంత వరకు బయటకు వెళ్లకుండా ఉంటే ఎంతో మేలు జరుగుతుందని పబ్లిక్​హెల్త్​ స్పెషలిస్టులు పేర్కొంటున్నారు.

చిరు వ్యాపారులు, పశు కాపారులే అధికం..

గత వారం రోజుల నుంచి వడదెబ్బ తాకి నోళ్లలో చిరు వ్యాపారులు, పశు కాపారులే అత్యధికంగా ఉన్నట్లు వైద్యశాఖలోని ఓ ఉన్నతాధికారి చెప్పారు. వీరంతా పనులు, వ్యాపారం నిమిత్తం మధ్యాహ్నం సమయంలో ఎక్కువగా తిరుగుతున్నారు. దీంతో అతినీల లోహిత కిరణాల దాడిలో నీరసించి పోతున్నారు. అనంతరం కళ్లు తిరగడం, నాలుక ఎండిపోవడం, పెదాలు పలగడం వంటి లక్షణాలతో ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నట్లు హెల్త్​ కేర్​ స్టాఫ్​ స్పష్టం చేస్తున్నారు. కావున మధ్యాహ్నం ఎండకు వెళ్లకుంటే వడదెబ్బ ప్రమాదాన్ని తప్పించుకోవచ్చని డాక్టర్లు వివరిస్తున్నారు.

జిల్లాల్లోనే ఎక్కువ..

ఆదిలాబాద్​, నిర్మల్​, నిజామాబాద్​, గద్వాల, వికారాబాద్​, నారాయణపేట​, జగిత్యాల, సిరిసిల్ల, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వడదెబ్బ బాధితులు అధికంగా ఉన్నట్లు వైద్యారోగ్యశాఖ గుర్తించింది. ఆయా ప్రాంతాల్లో ప్రతి రోజూ సగటున 40 నుంచి 42 డిగ్రీల టెంపరేచర్​ రికార్డు అవుతుంది. దీంతో బయట తిరిగినోళ్లపై భానుడు ప్రతాపం చూపించడం ఆందోళనకరం.





Next Story