నష్టాల నుంచి లాభాల్లోకి మారిన సూచీలు!

by Disha Web Desk 17 |
నష్టాల నుంచి లాభాల్లోకి మారిన సూచీలు!
X

ముంబై: దేశీయ ఈక్విటీ మార్కెట్లు ఎట్టకేలకు మళ్లీ లాభాలను సాధించాయి. గత వారం వరుస మూడు సెషన్లలో నష్టాలను ఎదుర్కొన్న తర్వాత సోమవారం ట్రేడింగ్‌లో లాభాలను నమోదు చేశాయి. ఉదయం స్వల్ప నష్టాల వద్ద ప్రారంభమైన సూచీలు మిడ్-సెషన్‌కు ముందు తిరిగి పుంజుకోవడంతో లాభాల బాటపట్టాయి. ప్రధానంగా బ్యాంక్, ఆటో, మెటల్ రంగాల్లో కొనుగోళ్ల మద్దతుతో వరుస నష్టాల నుంచి నిలదొక్కుకున్నాయి. రష్యా-ఉక్రెయిన్ మధ్య మరోమారు శాంతి చర్చలు మొదలవడం, రష్యా నుంచి రాయితీతో ముడి చమురు సరఫరా అంశం నేపథ్యంలో ఆ దేశ విదేశాంగ మంత్రి భారత్‌కు రానుండటం వంటి అంశాలు సూచీలకు సానుకూలంగా మారాయి. అంతేకాకుండా అంతర్జాతీయ విమానయాన సేవలు పునఃప్రారంభం కావడంతో మదుపర్లలో సెంటిమెంట్ బలపడింది.

దీంతో మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 231.29 పాయింట్లు ఎగసి 57,593 వద్ద, నిఫ్టీ 69 పాయింట్లు పెరిగి 17,222 వద్ద ముగిశాయి. నిఫ్టీలో పీఎస్‌యూ బ్యాంక్, మెటల్, ఆటో రంగాలు మెరుగ్గా పుంజుకున్నాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో భారతీ ఎయిర్‌టెల్, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఐటీసీ, ఎస్‌బీఐ, ఇండస్ఇండ్ బ్యాంక్, పవర్‌గ్రిడ్, బజాజ్ ఫిన్‌సర్వ్, హిందూస్తాన్ యూనిలీవర్ షేర్లు లాభాల్లో కదలాడాయి. నెస్లె ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌సీఎల్ టెక్, డా రెడ్డీస్ కంపెనీల షేర్లు నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 76.16 వద్ద ఉంది.


Next Story

Most Viewed