ఊగిసలాటల మధ్య స్వల్ప లాభాలతో సరిపెట్టిన సూచీలు!

by Disha Web Desk 17 |
ఊగిసలాటల మధ్య స్వల్ప లాభాలతో సరిపెట్టిన సూచీలు!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు వారాంతం తీవ్ర ఊగిసలాటల మధ్య స్వల్ప లాభాలతో సరిపెట్టాయి. గత మూడు సెషన్లలో భారీ లాభాలతో దూసుకెళ్లిన సూచీలు శుక్రవారం మదుపర్ల నుంచి లాభాల స్వీకరణ ధోరణి కారణంగా స్థిరమైన ర్యాలీని చూశాయి. రష్యా-ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతుండటం కొంత ప్రతికూలంగా ఉన్నప్పటికీ, ముడి చమురు ధరలు దిగొస్తుండటం గ్లోబల్ మార్కెట్లతో పాటు దేశీయ స్టాక్ మార్కెట్లలో కొంత ఒత్తిడిని తగ్గించాయి. అయినప్పటికీ వివిధ అంతర్జాతీయ పరిణామాల కారణంగా గ్లోబల్ మార్కెట్లు కొంత దెబ్బతిన్నాయి. దీనికితోడు అంతర్జాతీయంగా ద్రవ్యోల్బణం అత్యధికంగా ఉండటం కూడా దేశీయ మార్కెట్లపై ప్రభావం చూపింది. ఈ కారణంగా శుక్రవారం ట్రేడింగ్‌లో స్టాక్ మార్కెట్లు రోజంతా ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి.

దీంతో మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 85.91 పాయింట్లు పెరిగి 55,550 వద్ద, నిఫ్టీ 35.55 పాయింట్లు లాభపడి 16,630 వద్ద ముగిశాయి. నిఫ్టీ లో ఆటో, ఐటీ, మీడియా రంగాలు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. మిగిలిన వాటిలో ఫార్మా, పీఎస్‌యూ బ్యాంక్, మెటల్, రియల్టీ రంగాలు రాణించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో సన్‌ఫార్మా, డా రెడ్డీస్, ఐటీసీ, పవర్‌గ్రిడ్, టైటాన్ షేర్లు లాభాలను సాధించగా, నెస్లె ఇండియా, మారుతీ సుజుకి, ఎన్‌టీపీసీ, యాక్సిస్ బ్యాంక్, టీసీఎస్, టాటా స్టీల్ షేర్లు నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 76.56 వద్ద ఉంది.


Next Story

Most Viewed