భారీ లాభాలతో దూసుకెళ్లిన సూచీలు!

by Disha Web Desk 17 |
Stock Markets
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు భారీ లాభాలతో దూసుకెళ్లాయి. మంగళవారం నాటి ట్రేడింగ్‌లో వరుస ఐదురోజుల లాభాలకు బ్రేక్ పడిన తర్వాత నష్టాలను భర్తీ చేశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలకు తోడు దేశీయంగా కనిష్టాల వద్ద మదుపర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో సూచీలు రోజంతా అధిక లాభాల్లోనే ట్రేడయ్యాయి. అమెరికా ఫెడ్ సమావేశంలో వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు పెంచుతుందనే అంచనాలతో పాటు రష్యా-ఉక్రెయిన్ మధ్య చర్చల్లో స్పష్టత రానుందనే పెట్టుబడిదారుల అంచనాల కారణంగానే బుధవారం భారత స్టాక్ మార్కెట్లు గణనీయంగా ర్యాలీ చేశాయని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

దీంతో మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,039.80 పాయింట్లు పుంజుకుని 56,816 వద్ద, నిఫ్టీ 312.35 పాయింట్లు ఎగసి 16,975 వద్ద ముగిశాయి. నిఫ్టీలో మెటల్, ప్రైవేట్ బ్యాంక్, ఆటో రంగాలు అధికంగా 2 శాతానికి పైగా ర్యాలీ చేయగా, రియల్టీ అత్యధికంగా 3 శాతానికి పైగా పెరిగింది. సెన్సెక్స్ ఇండెక్స్‌లో సన్‌ఫార్మా, పవర్‌గ్రిడ్ షేర్లు మాత్రమే నష్టాలను ఎదుర్కొనగా, మిగిలిన అన్ని కంపెనీల షేర్లు లాభాలతో దూసుకెళ్లాయి. ముఖ్యంగా అల్ట్రా సిమెంట్, ఇండస్ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ, ఇన్ఫోసిస్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, టాటా స్టీల్, టెక్ మహీంద్రా, ఐటీసీ షేర్లు అధిక లాభాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 76.16 వద్ద ఉంది.


Next Story

Most Viewed