సంగారెడ్డి ఉద్యమాలకు పురిటిగడ్డ : కల్వకుంట్ల కవిత

by Batti.Sumithra |

సంగారెడ్డిది ఉద్యమ చరిత్ర అని, భారతదేశ స్వాతంత్ర్య పోరాటం 1930లో జోగిపేట నుండే ప్రారంభమైందని టీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు.

సంగారెడ్డి ఉద్యమాలకు పురిటిగడ్డ : కల్వకుంట్ల కవిత
X

దిశ, సంగారెడ్డి అర్బన్ : సంగారెడ్డిది ఉద్యమ చరిత్ర అని, భారతదేశ స్వాతంత్ర్య పోరాటం 1930లో జోగిపేట నుండే ప్రారంభమైందని టీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. ఆదివారం సంగారెడ్డిలో నిర్వహించిన జెండా పండుగకు ముఖ్యఅతిథిగా హాజరై ఇన్‌చార్జ్ కులబుర్ దయాకర్ రెడ్డి, సంఘమిత్ర, శ్రీనివాస్ రెడ్డిలతో కలిసి టీఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు.

ఇదిరా మా చరిత్ర..

ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ సంగారెడ్డి గడ్డ పై పుట్టడం అదృష్టం. ఈ గడ్డకు ఉన్న చరిత్రను ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. తెలంగాణ ఉద్యమంలో ఆంధ్ర వాళ్ళు తెలంగాణకు చరిత్ర లేదని అంటే శిలాశాసనాలు గుడి కట్టి ఇదిరా మా చరిత్ర అంటూ చూపించాం అని గుర్తు చేశారు. 1969లో సదాశివపేటలో ఉద్యమంలో కాల్పులు జరిగాయని, సంగారెడ్డిలోనే ఉద్యమాలకు మొదటి అడుగు వేసిందని అన్నారు.

ఫిక్సింగ్ రాజకీయాలు మానుకోండి...

సంగారెడ్డి రాజకీయాలు ఫిక్సింగ్ రాజకీయాలని కవిత తీవ్ర విమర్శలు చేశారు. జగ్గారెడ్డి, హరీష్ రావు, దామోదర్, చింతా ప్రభాకర్, రఘునందన్ రావులు చూడడానికి వేరువేరు పార్టీలలో ఉన్నా అందరూ ఒకటే. 30 ఏళ్లుగా ఇక్కడ రాజ్యమేలుతున్న రాజకీయ పార్టీలు ఏం చేశాయో చెప్పాలని ప్రశ్నించారు. తెలంగాణ తెచ్చుకున్నదే నీళ్లు, నిధులు, నియామకాల కోసం. సింగూరు ప్రాజెక్టు 15 సంవత్సరాలుగా కుంగిపోతోంది. హైదరాబాద్‌కు నీరు అందిస్తూ 60 వేల ఎకరాలకు నీరు అందించే ప్రాజెక్టును పట్టించుకున్న పాపాన పోలేదు. తెలంగాణ మొట్టమొదటి ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు ఇక్కడ నుండే ప్రాతినిధ్యం వహిస్తున్నా పట్టించుకోలేదు అని ఆరోపించారు. దామోదర రాజనర్సింహ బావమరిది 200 ఎకరాల భూమిని కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. అభివృద్ధి చెందుతున్న జైరాబాద్ కు బుల్లెట్ ట్రైన్ ఇస్తామని ప్రకటించిన కేంద్రం ఇప్పుడు డీపీఆర్లో ఆ ఊసే లేదని అన్నారు. రఘునందన్ రావు ఎందుకు మౌనం పాటిస్తున్నారని అన్నారు. ఇతర పార్టీలు సైతం ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.

కీలక హామీలు...

తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలోకి రాగానే పాంచ జన్యం పేరుతో ఉచిత విద్య, వైద్యం అందిస్తాం. వ్యవసాయానికి ప్రాధాన్యతనిస్తూ ప్రత్యేక ఆఫీసర్లను నియమిస్తాం. యువతకు 4 లక్షల ఉద్యోగాలు కల్పిస్తూ, ఉపాధి కోసం 2 లక్షల నుంచి 20 కోట్ల వరకు బ్యాంకుతో సంబంధం లేకుండా సహాయం అందిస్తాం. సామాజిక న్యాయం పాటిస్తాం అని కవిత హామీ ఇచ్చారు. ప్రైవేట్‌లో ఫీజుల మోత, సర్కారు బడుల్లో ఉపాధ్యాయుడు ఉంటే బడి ఉండదు, బడి ఉంటే ఉపాధ్యాయుడు ఉండడు. సర్కారు దవాఖాన్లలో సోది ఉంటే దూది ఉండదు, దూది ఉంటే సూది ఉండదు. పేదవాడికి వైద్యం అందనంత దూరానికి వెళ్లింది అని ప్రభుత్వం పై విరుచుకుపడ్డారు. ఒక అమ్మకి తన పిల్లలు పడే కష్టం తెలుస్తుంది. నేను ఇచ్చిన మాట తప్పితే తెల్లాపూర్ శిలాశాసనం వద్ద కట్టేసి రాళ్లతో కొట్టండి అని కవిత సవాల్ విసిరారు.

Next Story