ప్రభుత్వ ఆదాయానికి గండి.. అక్రమంగా ఒక్కొక్కరి నుంచి రూ.25 వేలు వసూలు

by Disha Web Desk 2 |
ప్రభుత్వ ఆదాయానికి గండి.. అక్రమంగా ఒక్కొక్కరి నుంచి రూ.25 వేలు వసూలు
X

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: ''గోదావరి నదికి ఇరువైపులా అడ్డగోలుగా.. అక్రమంగా ఇసుక తవ్వకాలు చేస్తున్నారు.. సర్కారు నిబంధనలకు నీళ్లొదులుతున్నారు.. వేబిల్లులు లేకుండానే జీరోలో ఇసుక దందా జోరుగా సాగుతోంది. ఒక్కొక్కరి నుంచి రూ.25వేలు వసూలు చేస్తూ.. ప్రభుత్వ ఆదాయానికి పెద్ద ఎత్తున గండి కొడుతున్నారు. సన్నం ఇసుకకు ఒక్కో లారీకి అదనంగా రూ.3 నుంచి 4 వేల వరకు అక్రమంగా వసూలు చేస్తున్నారు. గోదావరికి అవతలి వైపు తవ్వకాలు చేసి. ఇవతలి వైపున డంపింగ్ చేసి ఇసుక తరలిస్తున్నారు. ఇసుక లారీల వేగంతో రహదారులపై ప్రమాదాలు జరిగి జనాలు చనిపోతున్నా.. ఎవరికీ పట్టడం లేదు'' అని స్థానిక ప్రజల వాపోతున్నారు.

వేబిల్లులు లేకుండానే ఇసుక తరలింపు

మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం కోటపల్లి మండలంలోని గోదావరి నదిలో ఇసుక అక్రమ దందా జోరుగా సాగుతోంది. నిత్యం వందల సంఖ్యలో లారీల్లో ఇసుక తరలిస్తున్నారు. కోటపల్లి మండలం కొల్లూరు-5,6, బోరంపల్లి-2లో మూడు ఇసుక క్వారీలుండగా.. పలుగుల వాగు నుంచి కూడా ఇసుక తవ్వకాలు చేస్తున్నారు. టీఎస్ఎండీసీ ఆధ్వర్యంలో ఇసుక తవ్వకాలకు అనుమతులు ఇవ్వగా.. క్వారీ నిర్వాహకులు అడ్డగోలుగా దందా చేస్తున్నారు. సాధారణ ఇసుకకు క్యూబిక్ మీటరుకు రూ.600 చొప్పున 20 క్యూ.మి.లకు గాను.. రూ.12వేలు అవుతోంది. ఇతర పన్నులతో కలిపి రూ.13150 అవుతోంది. సన్న ఇసుకకు మార్కెటులో డిమాండ్ ఉండటంతో.. లారీకి రూ.3-4వేలు అదనంగా వసూలు చేసి సన్నం ఇసుక నింపి ఇస్తున్నారు. ఇక ఎలాంటి వే బిల్లులు లేకుండానే సన్నం ఇసుక లారీలను నింపుతున్నారు. ఒక్కో లారీకి రూ.25వేలు అక్రమంగా వసూలు చేస్తుండగా.. సర్కారు ఖజానాకు వచ్చే ఆదాయానికి గండి పడుతోంది.

అటువైపు తవ్వకం.. ఇటువైపు డంపింగ్

గోదావరి నది ఒడ్డున భూపాలపల్లి జిల్లా కుంట్లం-4 వద్ద ఇసుక తవ్వకాలకు అనుమతి తీసుకుని.. కోటపల్లి మండలం ఎర్రాయిపేట వద్ద ఇసుక డంప్ పెట్టారు. మంచిర్యాల, జగిత్యాల, నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల కోసం ఇటువైపు ఇసుక డంపింగ్ చేసి.. చెన్నూర్ మీదుగా వివిధ జిల్లాలకు తరలిస్తున్నారు. గోదావరి నదిలో ఎలాంటి అనుమతులు లేకుండా ఏకంగా మొరం పోసి రోడ్లు కూడా వేశారు. గోదావరి నది లోపలికి వచ్చి ఇసుక తవ్వుతుండగా.. భూపాలపల్లి జిల్లా పరిధి దాటి మంచిర్యాల వైపు నదిలో తవ్వకాలు చేస్తున్నారు.

గోదావరి నదికి ఇరువైపులా పట్టాభూముల్లో ఇసుక తవ్వకాలకు అనుమతులు తీసుకుని.. నది లోపలి వైపు వరకు అడ్డగోలుగా లోతుగా ఇసుక తవ్వేస్తున్నారు. చెన్నూరు మంచిర్యాల మధ్య ఇసుక లారీలతో పెద్ద సంఖ్యలో ప్రమాదాలు జరుగుతున్నాయి. జైపూర్ వద్ద శివరాత్రి రోజున కారును ఇసుక లారీ ఢీకొట్టడంతో ఇద్దరు చనిపోయారు. కోటపల్లి మండలంలో ప్రతినెలా రోడ్డు ప్రమాదాలు జరుగుతుండటంతో కొందరు చనిపోగా.. చాలా మంది క్షతగాత్రులుగా మారుతున్నారు.


Next Story