భారత ల్యాప్‌టాప్ మార్కెట్లోకి శాంసంగ్ రీఎంట్రీ!

by Disha Web Desk 17 |
భారత ల్యాప్‌టాప్ మార్కెట్లోకి శాంసంగ్ రీఎంట్రీ!
X

దిశ, వెబ్‌డెస్క్: అంతర్జాతీయ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ త్వరలో భారత ల్యాప్‌టాప్ వ్యాపారంలోకి తిరిగి ప్రవేశించడానికి సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా వినియోగదారులతో పాటు సంస్థలకు అందించే విధంగా సరికొత్త ల్యాప్‌టాప్‌ల పోర్ట్‌ఫోలియోను తీసుకురాంది. అలాగే, వీటిని రూ. 40,000 కంటే తక్కువ ధరతో మొదలుకొని గరిష్ఠంగా రూ. 1,20,000 మధ్య ఉండేలా సంస్థ ప్రణాళికను కలిగి ఉంది. అంతేకాకుండా ప్రస్తుత ఏడాది చివరి నాటికి భారత ల్యాప్‌టాప్ మార్కెట్లో రెండంకెల వాటాను సొంతం చేసుకోవాలని భావిస్తోంది. ' కంపెనీ తిరిగి భారత్‌లో బలమైన పోర్ట్‌ఫోలియోతో ఉత్పత్తులను తీసుకురావాలని భావిస్తోంది. రానున్న రోజుల్లో శాంసంగ్ నుంచి ఆరు అత్యాధునిక ఫీచర్లతో పాటు మెరుగైన పనితీరు కలిగిన ల్యాప్‌టాప్‌లను ప్రవేశపెట్టనున్నామని' శాంసంగ్ ఇండియా న్యూ కంప్యూటింగ్ బిజినెస్ హెడ్ సందీప్ పోస్వాల్ చెప్పారు.

కాగా, శాంసంగ్ సంస్థ 2013-14 సమయంలో దేశీయ ల్యాప్‌టాప్ వ్యాపారం నిష్క్రమించిన సంగతి తెలిసిందే. తమ ల్యాప్‌టాప్‌ల రీ-లాంచ్‌తో ఇప్పటికే కంపెనీకి చెందిన స్మార్ట్‌ఫోన్, ట్యాబ్లెట్లను వాడుతున్న వినియోగదారులకు మరిన్ని కొత్త ఉత్పత్తులను అందించనున్నాం. అలాగే దేశీయ మార్కెట్లో ఇప్పటికే ఉన్న వాటికంటే నాణ్యమైన వాటిని సరసమైన ధరలో కస్టమర్లకు అందిస్తామని ఆయన వివరించారు. కొత్తగా రాబోయే శాంసంగ్ ల్యాప్‌టాప్‌ల కోసం ప్రీ-బుకింగ్ అందుబాటులో ఉందని, సంస్థ ఈ-కామర్స్ స్టోర్‌తో పాటు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లలో ఆన్‌లైన్ ద్వారా బుకింగ్ చేసుకోవచ్చని కంపెనీ వెల్లడించింది. ఈ వారంలో హోలి పండుగ సందర్భంగా శాంసంగ్ ల్యాప్‌టాప్‌లు అందుబాటులో ఉంటాయని, కంపెనీ రీఎంట్రీ ద్వారా ఇప్పటికే ఈ విభాగంలో ఉన్న హెచ్‌పీ, డెల్, లెనొవొ కంపెనీలకు పోటీ ఉంటుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.

Next Story