రూ. 7.4 కోట్ల పెయింటింగ్‌ను నష్టపరిచిన సెక్యూరిటీ గార్డ్!

by Web Desk |
రూ. 7.4 కోట్ల పెయింటింగ్‌ను నష్టపరిచిన సెక్యూరిటీ గార్డ్!
X

దిశ, ఫీచర్స్ : అన్నా లెపోర్స్కాయ 'త్రీ ఫిగర్స్' పెయింటింగ్ ఇటీవలే రష్యాలోని యెల్ట్‌సిన్ సెంటర్‌లో ప్రదర్శించబడింది. సోవియట్ కాలం నాటి ఈ పెయింటింగ్‌ విలువ రూ. 7.4 కోట్లు కాగా.. ఆ కళాఖండంపై పెన్నుతో గీతలు గీసినట్లు అక్కడ పనిచేసే సెక్యూరిటీ గార్డ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. తను ఉద్యోగంలో చేరిన మొదటి రోజే ఇది జరగ్గా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

లెపోర్స్కాయ ప్రసిద్ధ పెయింటింగ్ 'త్రీ ఫిగర్స్'ను 'ది వరల్డ్ యాజ్ నాన్-ఆబ్జెక్టివిటీ, ది బర్త్ ఆఫ్ ఎ న్యూ ఆర్ట్' అనే ఎగ్జిబిషన్‌లో 7 డిసెంబర్, 2021న ప్రదర్శించారు. 1932 -1934 మధ్య చిత్రించిన ఈ మూడు బొమ్మలకు 75 మిలియన్ రూబిల్స్‌(రూ. 7.47 కోట్లు)‌తో బీమా కూడా చేయించారు. అయితే యెల్ట్‌సిన్ సెంటర్‌‌లో సెక్యూరిటీ గార్డ్‌గా చేరిన వ్యక్తిని 'త్రీ ఫిగర్స్' పెయింటింగ్ ఆకర్షించింది. కళ్లు, ముక్కు, నోరు లేకుండా చాలా ప్లెయిన్‌గా కనిపిస్తున్న ఆ ముఖ చిత్రాలకు పెన్నుతో కళ్లను గీశాడు. ఈ విధ్వంసాన్ని ఇద్దరు సందర్శకులు గుర్తించడంతో ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నేరం రుజువైతే అతడు భారీ జరిమానా సహా ఏడాది పాటు కరెక్షనల్ లేబర్ శిక్షను అనుభవించవచ్చు.

ఇక పెయింటింగ్‌లోని బొమ్మలపై కళ్లను చిత్రించింది తానేనని సెక్యూరిటీ గార్డ్ విచారణ సమయంలో ఒప్పుకున్నాడు. కాగా నిపుణుల తనిఖీ తర్వాత దెబ్బతిన్న కళాకృతిని మాస్కోకు పంపి పునరుద్ధరించినట్లు నిర్వాహకులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సదరు వ్యక్తి బలమైన ఒత్తిడి లేకుండా పెన్నుతో గీయడం వల్ల స్ట్రోక్స్ చెదిరిపోలేదని స్పష్టం చేశారు.



Next Story

Most Viewed