- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎన్టీఆర్ వైద్య సేవలకు నిధుల గ్రహణం.. ప్రభుత్వ ఆసుపత్రులకు రూ.708 కోట్ల బకాయిలు
ఏపీలో ఎన్టీఆర్ వైద్య సేవ బకాయిలు రూ.708 కోట్లు పెండింగ్‌లో పడటంతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలకు ముప్పు పొంచి ఉంది. వెండర్లు జూన్ నుండి సరుకులు నిలిపివేస్తామన్నారు.

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలోని ప్రభుత్వాసుపత్రుల్లో ఎన్టీఆర్ వైద్య సేవల నిర్వహణకు తగిన నిధులు లేకపోవడం ఇప్పుడు తీవ్ర సమస్యగా మారుతోంది. ఈ పథకం కింద పేదలకు ఉచిత వైద్య సేవలు అందిస్తున్న ప్రభుత్వ బోధనా ఆసుపత్రులు, జిల్లా ఆసుపత్రులకు ప్రభుత్వం నుంచి దాదాపు రూ. 708 కోట్ల బిల్లులు పెండింగ్‌లో పడ్డాయి. రీయింబర్స్‌మెంట్ నిధుల విడుదలలో జరుగుతున్న ఈ జాప్యం వల్ల ఆసుపత్రులలో మందుల కొనుగోలు, వైద్య పరికరాల నిర్వహణ, రక్త పరీక్షల నిర్వహణపై తీవ్ర ప్రభావం పడుతోందని ఆసుపత్రుల అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్నిచోట్ల అత్యవసర మెడికల్ వస్తువుల కొరత కూడా వేధిస్తోందని సమాచారం.
ముంచుకొస్తున్న మెటీరియల్ కొరత
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలు మెరుగవడంతో రోగుల తాకిడి గతం కంటే గణనీయంగా పెరిగింది. ప్రతి నెలా వేలాది మంది పేద రోగులు గుండె, క్యాన్సర్, కిడ్నీ, న్యూరో సంబంధిత శస్త్రచికిత్సల కోసం ప్రభుత్వ ఆసుపత్రులనే ఆశ్రయిస్తున్నారు. అయితే, వీటికి సంబంధించిన వ్యయం పెరుగుతున్నా నిధులు సకాలంలో అందకపోవడంతో ఆసుపత్రులపై ఆర్థిక భారం తీవ్రమవుతోంది. మరోవైపు, సర్జికల్స్, మందులు, ల్యాబ్ మెటీరియల్ సరఫరా చేసే వెండర్లకు కూడా రూ. 15 నుంచి రూ. 20 కోట్ల మేర బకాయిలు పేరుకుపోయాయి.
గత మూడు నెలలుగా బిల్లులు రాకపోవడంతో, పాత బకాయిలు చెల్లించకుంటే జూన్ నెల నుంచి ఆపరేషన్లకు అవసరమైన మెటీరియల్ సరఫరా చేయలేమని వెండర్లు ఆసుపత్రుల యాజమాన్యాలకు ఖరాఖండిగా తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో భవిష్యత్తులో వైద్య సేవలు ఎక్కడ నిలిచిపోతాయోనని వైద్య సంఘాలు ఆందోళన పడుతూ, బకాయిలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాయి.
ప్రైవేటు ఆసుపత్రులకు రూ. 1,000 కోట్ల చెల్లింపులు..
ఇదిలావుండగా, ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ అనుబంధ ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలకు ఉన్న బకాయిలను తీర్చేందుకు కూటమి ప్రభుత్వం 'ట్రై-పార్టీ బిల్ డిస్కౌంటింగ్ అగ్రిమెంట్' (టీబీడీఏ) విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా రూ. 1,000 కోట్ల బకాయిల చెల్లింపు ప్రక్రియను ప్రారంభించగా, ఇప్పటివరకు రూ. 901 కోట్ల మేర చెల్లింపులు జరిగాయి. గత వైసీపీ ప్రభుత్వం జూన్ 2024 నాటికి రూ. 2,403 కోట్ల బకాయిలను మిగల్చగా, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పాత బకాయిలతో పాటు తాజా వైద్య సేవలకు కలిపి మొత్తం రూ. 5,556 కోట్లను ఆసుపత్రుల యాజమాన్యాలకు చెల్లించింది. అయినప్పటికీ, గత, ప్రస్తుత కాలానికి సంబంధించి ఆసుపత్రులకు ఇంకా రూ. 3,746.68 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఇందులో ప్రైవేటు ఆసుపత్రులకు చెల్లించాల్సిన రూ. 2,044.17 కోట్లలోనే ప్రస్తుతం రూ. 1,000 కోట్ల చెల్లింపుల ప్రక్రియ కొనసాగుతోందని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.






