ట్రంప్ వలస విధానంపై మిన్నంటిన నిరసనలు.. రణరంగంగా మారిన మినియాపాలిస్

by Malleboina Mahesh |

అమెరికా దేశంలో భారీగా పెరుగుతున్న వలసలను అరికట్టేందుకు ట్రంప్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే.

ట్రంప్ వలస విధానంపై మిన్నంటిన నిరసనలు.. రణరంగంగా మారిన మినియాపాలిస్
X

దిశ, వెబ్ డెస్క్: అమెరికా దేశంలో భారీగా పెరుగుతున్న వలసలను అరికట్టేందుకు ట్రంప్ ప్రభుత్వం (Trump's government) కఠిన చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. అయితే ట్రంప్ వలస విధానాలపై అమెరికాలోని మినియాపాలిస్‌లో వలస వాదులు భారీ నిరసనలు (Huge protests) చేపట్టారు. కాగా ఈ నిరసనలను అరికట్టేందుకు పోలీసులు రంగంలోకి దిగగా.. ఒక్కసారిగా హింసాత్మకంగా మారాయి. నికోలెట్ అవెన్యూ వద్ద ఫెడరల్ ఏజెంట్లు (Federal agents) జరిపిన కాల్పుల్లో అలెక్స్ జెఫ్రీ ప్రెట్టి అనే వ్యక్తి మరణించగా, పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. 'ఆపరేషన్ మెట్రో సర్జ్' పేరుతో ఫెడరల్ బలగాలు సాగిస్తున్న అణచివేత చర్యలే ఈ దారుణానికి కారణమని స్థానికులు మండిపడుతున్నారు.

కాల్పుల వార్తతో ఆగ్రహించిన వందలాది మంది ప్రజలు వీధుల్లోకి రావడంతో, వారిని చెదరగొట్టడానికి బలగాలు టియర్ గ్యాస్‌ను (Tear gas) ప్రయోగించాయి. దీంతో ఆ నగరం యుద్ధ వాతావరణాన్ని తలపిస్తోంది. ఈ ఘటనపై మిన్నెసోటా గవర్నర్ టిమ్ వాల్జ్ (Governor Tim Walz) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. స్థానిక చట్టాలను, రాష్ట్ర అధికారుల దర్యాప్తును లెక్కచేయకుండా ఫెడరల్ ఏజెంట్లు ఇష్టారాజ్యంగా వ్యవహరించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే ఫెడరల్ బలగాలను నగరం నుండి వెనక్కి పిలవాలని ఆయన వైట్ హౌస్‌ను డిమాండ్ చేశారు. అయితే, ఏజెంట్లు తమ ఆత్మరక్షణ కోసమే కాల్పులు జరిపారని ట్రంప్ సర్కార్ సమర్థించుకోవడంతో, రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాల మధ్య రాజకీయ హైడ్రామా ముదిరింది.

Next Story