మీ ఇళ్ళల్లో ఒక పూట నీళ్లు లేకపోతే ఇలాగే ఉంటారా..?

by Dishanational1 |
మీ ఇళ్ళల్లో ఒక పూట నీళ్లు లేకపోతే ఇలాగే ఉంటారా..?
X

దిశ, అచ్చంపేట: గత నాలుగైదు రోజులుగా మిషన్ భగీరథ నీళ్లు రాక అవస్థలు పడుతున్నామని మహిళలు పెద్ద ఎత్తున నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మన్ననూర్ గ్రామంలోని హైదరాబాద్-శ్రీశైలం జాతీయ రహదారిపై అంబేద్కర్ చౌరస్తా వద్ద రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని అంబేద్కర్ కాలనీకి చెందిన ప్రజలు మాట్లాడుతూ.. తాగునీటి మరియు ఇతర అవసరాల కోసం గత నాలుగు రోజులుగా చాలా అవస్థలు పడుతున్నా గ్రామ సర్పంచ్ మరియు సంబంధిత అధికారులు ఏమాత్రం పట్టించుకోకపోవడంతో తమ సమస్య పరిష్కారం కోసం రోడ్డుపైకి రావాల్సి వచ్చిందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

తాగునీటి సమస్య పరిష్కరించేంతవరకు ఆందోళన విరమించలేదిలేదని కాలనీవాసులు, మహిళలు రహదారిపై భీష్మించుకుని కూర్చున్నారు. విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ శ్రీ రామ్ నాయక్, మిషన్ భగీరథ అధికారి ఆందోళన చేస్తున్న మహిళలకు నచ్చచెప్పేందుకు ఎంత ప్రయత్నించినా ససేమిరా అన్నారు. మీ ఇళ్ళల్లో ఒక పూట నీళ్లు లేకపోతే ఇలాగే ఉంటారా అని అధికారులను ప్రజాప్రతినిధులను మహిళలు నిలదీశారు.

కొన్ని గంటల్లో పరిష్కారం...

కొన్ని సాంకేతిక కారణాలు ఉత్పన్నం కావడంతో నీళ్లు రావడం లేదని, వాటిని అధిగమించేందుకు గత రెండు రోజులుగా తమ ప్రయత్నం కొనసాగుతూనే ఉందని సర్పంచ్ శ్రీరామ్ నాయక్ తెలిపారు. నాలుగైదు గంటల్లో కాలనీకి మిషన్ భగీరథ నీళ్లు సరఫరా అయ్యేలా అన్ని చర్యలు తీసుకుంటామని సర్పంచ్, సిఐ ఆదిరెడ్డి... మహిళలకు, కాలనీవాసులకు నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు.

నిలిచిన వాహనాలు...

జాతీయ రహదారిపై ఆందోళన చేస్తున్న నేపథ్యంలో శ్రీశైలం హైదరాబాద్ మరియు అచ్చంపేట మద్దిమడుగు ప్రధాన రహదారులపై పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. ఈ సందర్భంగా ఇతర ప్రాంతాలకు వెళుతున్న యాత్రికులు ప్రజలు ఆందోళనతో ఇబ్బందులు పడ్డారు. ఆందోళన అనంతరం సీఐ ఆదిరెడ్డి, ఎస్ఐ వీరబాబు, ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించారు.


Next Story

Most Viewed