ఓయూలో 20 ఏళ్ల నుంచి పని చేస్తున్నాం.. మా జీతం ఇప్పటికీ రూ. 7 వేలే...

by Dishanational1 |
ఓయూలో 20 ఏళ్ల నుంచి పని చేస్తున్నాం.. మా జీతం ఇప్పటికీ రూ. 7 వేలే...
X

దిశ, సికింద్రాబాద్: ఉస్మానియా యూనివర్సిటీలో సుదీర్ఘ కాలంగా పనిచేస్తున్న తమ కనీస వేతనాలు ఇప్పించాలంటూ పారిశుద్ధ్య కార్మికులు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు వారు ఓయూ ఆర్ట్స్ కళాశాల ఎదుట గురువారం ప్రదర్శన నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ శుక్రవారం ఓయూలో నిర్వహించనున్న స్నాతకోత్సవంలో గౌరవ డాక్టరేట్ స్వీకరించబోతున్న జస్టిస్ ఎన్వీ రమణ ఓయూలో కార్మికుల పట్ల అధికారుల వైఖరిని ఒకసారి గమనించాలని కోరారు. కనీస వేతన చట్టం అమలు జరిగేలా చొరవ తీసుకుంటారని ఆశిస్తున్నట్లు కోరారు. గత ఇరవై ఏళ్లుగా ఓయూలోని వివిధ హాస్టళ్లు, కార్యాలయాలలో వాచ్ మెన్ గా కొనసాగిన కార్మికులను ఏకపక్షంగా తొలగించారని గుర్తు చేశారు.

కార్మికులు రెండు నెలలుగా అనేక రకాలుగా పోరాటాలు చేస్తే, వారిపై అక్రమ కేసులు బనాయించారని ఆరోపించారు. చివరికి వారు లేబర్ కమిషన్ ను ఆశ్రయించగా వారి మాటలను కూడా ఓయూ అధికారులు లెక్కచేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఇరవై ఏళ్లుగా ఓయూలో పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేస్తున్న తమకు కేవలం రూ. ఏడు వేలు మాత్రమే వేతనం అందజేస్తున్నారన్నారు. దీంతో జీవనం సాగించడమే దుర్భరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు పని ప్రదేశాలలో ఉపయోగించే యాసిడ్స్, ఇతర రసాయన పదార్థాల మూలంగా చర్మవ్యాధులు వస్తున్నాయన్నారు. అయినా పారిశుద్ధ్య కార్మికుల పట్ల తీసుకోవలసిన కనీస జాగ్రత్తలు, వారికి కల్పించాల్సిన సౌకర్యాలపై వర్సిటీ అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. కనీస వేతన చట్టం ప్రకారం తమకు నెలకు రూ . 15,600 చెల్లించాలని డిమాండ్ చేశారు.


Next Story

Most Viewed