రైతులకు కొత్త సమస్య.. యాసంగి ధాన్యం అమ్మకానికి తిప్పలు!

by Disha Web Desk 2 |
రైతులకు కొత్త సమస్య.. యాసంగి ధాన్యం అమ్మకానికి తిప్పలు!
X

దిశ, తెలంగాణ బ్యూరో: వరి సాగుచేసిన రైతులకు కొత్త సమస్య వచ్చి పడుతున్నది. ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ కొనేదిలేదని ఇప్పటికే స్పష్టం చేసింది. కొనుగోలు కేంద్రాలను పెట్టబోమని కూడా చెప్పింది. బాయిల్డ్ రైస్ కొనడానికి సిద్ధంగా లేదని నెపాన్ని ఎఫ్‌సీఐ మీదకు నెడుతున్నది. రాష్ట్రంలోని ప్రైవేటు వ్యాపారులు, రైస్ మిల్లర్లు మాత్రం కనీస మద్దతు ధరకు కొనడానికి సంసిద్ధంగా లేరు. పండిన పంటను ఎంతో కొంతకు అమ్ముకోవాలని రైతులు డిసైడ్ అయిపోయారు. అంతిమంగా రైతులు ఒక్కో క్వింటాకు రూ. 500 చొప్పున నష్టపోయే అవకాశం ఏర్పడింది. ప్రభుత్వం కొనకుండా చేతులెత్తేయడం ప్రైవేటు వ్యాపారులకు వరంగా మారింది. కనీస మద్దతు ధర పకడ్బందీగా అమలుచేయడానికి విజిలెన్స్ విభాగం, పౌర సరఫరాల శాఖ ఏ మేరకు చొరవ తీసుకుంటాయన్నది కూడా ప్రశ్నార్థకంగా మారింది.

బాయిల్డ్​ కొనమన్న కేంద్రం.. ముడి బియ్యం ఇయ్యమన్న రాష్ట్రం

బాయిల్డ్‌ రైస్‌ ఎట్టిపరిస్థితుల్లో తీసుకునేది లేదని కేంద్రం.. కేంద్రం కోరుకున్నట్లు ముడి బియ్యం ఇవ్వబోమని రాష్ట్రం తేల్చి చెప్పాయి. కేంద్రానికి బియ్యం ఇవ్వలేని పరిస్థితుల్లో కొనుగోలు కూడా కష్టమేనని భావించిన ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా యాసంగి ధాన్యం సేకరించలేమని ప్రకటించింది. ప్రభుత్వాల వైఖరి ఇలా ఉంటే యాసంగి వరి ధాన్యాన్ని కొనేది ఎవరని రైతులు ఆందోళన చెందుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వరి ధాన్యం కొనుగోలు విషయంలో అనుసరిస్తున్న విధానాలు రైతులను నిలువునా ముంచే విధంగా కనిపిస్తున్నాయి. రెండు ప్రభుత్వాల మధ్య ఈ విషయంలో కొనసాగుతున్న వివాదం తేలక ముందే ప్రత్యామ్నాయ అవకాశాలు లేక, పంట మార్పిడికి వీలు కాక రైతులు వరిసాగు వైపే మొగ్గుచూపారు. ఎప్పటి మాదిరిగానే సాధారణ సాగుకు మించి యాసంగిలో వరి నాట్లు వేశారు. యాసంగికి వరి సాగు చేయవద్దని రైతులకు ప్రభుత్వం పిలుపు ఇచ్చినా అనివార్య పరిస్థితుల్లో ఆ పంటనే వేయక తప్పలేదు. రాష్ట్రంలో 35.84 లక్షల ఎకరాల్లో యాసంగి సీజన్‌లో వరిసాగు చేయగా.. సుమారు 70 లక్షల టన్నులకు పైగా దిగుబడి వస్తుందని అంచనా.

ప్రకటన రాకపోతుందా?

జలవనరుల్లో నీరు పుష్కలంగా ఉండడంతో పంట చేతికొచ్చే సమయానికి ప్రభుత్వాల విధానాల్లో ఏమైనా మార్పు రాకపోతుందా అన్న ఆశతో వరి సాగు చేసిన రైతులకు ఇప్పుడు మద్దతు ధర గుబులు పట్టుకున్నది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వరిధాన్యం కొనుగోలు చేయకపోతుందా.. అనే ఆశలు కూడా రైతుల్లో ఉన్నాయి. గతంలోనూ పలు సందర్భాల్లో రైతుల అంశాల్లో చివరి సమయంలో కేసీఆర్​ నిర్ణయాలు తీసుకుంటుండటంతో.. ఈసారి కూడా అదే ఆశతో ఉంటున్నారు.

మిల్లర్లైతే.. ధర కష్టమే

ప్రభుత్వం ఎలాగూ కొనుగోలు కేంద్రాలు పెట్టడం లేదు. రైతులు గత్యంతరం లేని పరిస్థితుల్లో మిల్లర్లు, వ్యాపారులకే అమ్ముకోవాల్సి ఉంటుంది. స్వంతంగా మిల్లుకు వెళ్ళి బియ్యంగా మార్చుకుని నేరుగా ఎఫ్‌సీఐకి అమ్ముకునే పరిస్థితి లేకపోవడంతో నష్టమైనా తప్ప మిల్లర్లకే విక్రయించాల్సిందే. కేంద్ర ప్రభుత్వం సాధారణ రకం వరికి క్వింటాల్‌కు రూ. 1,940, ఏ గ్రేడ్‌ రకానికి రూ. 1,960 ధర ప్రకటించింది. ఈ కనీస మద్దతు ధరకు కూడా మిల్లర్లు వరిధాన్యం కొనుగోలు చేసే అవకాశాలు లేవు. అంతేగాకుండా యాసంగిలో పండే ధాన్యం మిల్లింగ్‌ చేస్తే బియ్యం విరిగి పోయి నూక ఎక్కువ వస్తుందని మిల్లర్లు మొదట్నుంచీ తిరకాసు పెడుతూనే ఉన్నారు. అందుకే యాసంగి ధాన్యాన్ని బాయిల్డ్‌ బియ్యంగానే మార్చి విక్రయిస్తారు.

బయటి రాష్ట్రాల్లో బాయిల్డ్‌ బియ్యం వినియోగం తగ్గడం, కేంద్రం బాయిల్డ్‌ బియ్యాన్ని సేకరించక పోవడంతో రైసు మిల్లర్లు కూడా ఆ ధాన్యం కొనుగోలు చేసి ఏమి చేయాలనే పరిస్థితుల్లో ఉన్నామంటూ ముందుగానే ప్రచారానికి దిగుతున్నారు. నూక రూపంలో వచ్చే నష్టాన్ని భర్తీ చేసుకోవడానికి ధర తగ్గించక తప్పదని మిల్లర్లు పేర్కొంటుండగా.. మద్దతు ధర తగ్గితే పెట్టుబడులుపోను శ్రమ ఫలితం దక్కే అవకాశం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో రైతులు ముందుగానే మిల్లర్లతో ఒప్పందం చేసుకున్నారు. రూ. 1300 నుంచి రూ. 1400 క్వింటా చొప్పున విక్రయించేందుకు అగ్రిమెంట్​ కుదిరింది. ఒకవేళ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు పెట్టినా.. ఈ రైతులకు అంతకు మంచి రూపాయి రాదు. కానీ, ప్రభుత్వం వైపు నుంచి కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. ప్రభుత్వం పట్టుమీద ఉన్నట్టే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకుంటే రైతులు ఈసారి భారీ నష్టాలు ఎదుర్కొవాల్సి వస్తోంది.


Next Story