కోమల్ల టోల్‌గేట్ వద్ద కేటీఆర్ కాన్వాయ్‌ను అడ్డుకున్న పోలీసులు

by Jakkula.Mamatha |

కోమల్ల టోల్‌గేట్ వద్ద బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాన్వాయ్‌ను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

కోమల్ల టోల్‌గేట్ వద్ద కేటీఆర్ కాన్వాయ్‌ను అడ్డుకున్న పోలీసులు
X

దిశ, రఘునాథపల్లి: కోమల్ల టోల్‌గేట్ వద్ద బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాన్వాయ్‌ను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కన్నెపల్లి పంప్‌హౌస్ పరిశీలనకు వెళ్తున్న కేటీఆర్‌ను టోల్‌గేట్ వద్దే నిలిపివేసిన పోలీసులు, కాన్వాయ్‌ను ముందుకు వెళ్లనివ్వలేదు.హైదరాబాద్ నుంచి కేటీఆర్ కాన్వాయ్ జనగామ జిల్లాలోకి ప్రవేశించే ముందే మండలం కొమ్మాల టోల్‌గేట్ వద్ద పోలీసులు భారీ వ్యూహాన్ని అమలు చేశారు. పెద్ద సంఖ్యలో పోలీసు బలగాలు మోహరించి, టోల్‌గేట్ వద్దే బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తల వాహనాలను పూర్తిగా నిలిపివేశారు. ఈ సందర్భంగా జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రజాప్రతినిధుల పర్యటనను అడ్డుకోవడం ప్రజాస్వామ్య విరుద్ధమని పోలీసులు నిలదీశారు. శాంతిభద్రతల సమస్యను అడ్డుపెట్టుకుని ప్రతిపక్షాల పర్యటనలను ఎలా అడ్డుకుంటారని పల్లా పోలీసులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో పోలీసులకు, పల్లాకి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసుల విచిత్రమైన ఆంక్షలపై పల్లా రాజేశ్వర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా పర్యటిస్తున్న ప్రజాప్రతినిధులను ఒక జిల్లా దాటి మరో జిల్లాకు వెళ్లకుండా అడ్డుకునే హక్కు పోలీసులకు ఎక్కడిదని నిలదీశారు. అనంతరం ప్రభుత్వం కావాలనే పోలీసులను అడ్డం పెట్టుకుని తమ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. వరదలు, అకాల వర్షాల వల్ల ప్రాజెక్టులు, పంటలు దెబ్బ తింటే వాటిని పరిశీలించే హక్కు కూడా ప్రతిపక్షాలకు లేదా అని పల్లా ఈ సందర్భంగా మండిపడ్డారు.

Next Story