వడ్డీ వ్యాపారుల అక్రమాలకు పోలీసులు అడ్డుకట్ట..

by Disha Web Desk 13 |
వడ్డీ వ్యాపారుల అక్రమాలకు పోలీసులు అడ్డుకట్ట..
X

దిశ, మహబూబాబాద్ టౌన్: మహాబూబాబాద్ జిల్లా పరిధిలో అక్రమ వడ్డీ వ్యాపారులు, చట్ట విరుద్ధమైన చిట్టి వ్యాపారులు, చిట్ ఫండ్స్ వారి ఆగడాలు శృతి మించడంతో వారి అక్రమ వ్యాపారాలకు అడ్డుకట్ట వేయడానికి మహాబూబాబాద్ జిల్లా పోలీసులు ఎస్పీ శరత్ చంద్ర పవార్ నేతృత్వంలో జిల్లా వ్యాప్తంగా దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అక్రమ వడ్డీ వ్యాపారుల వల్ల ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నమై, మరెంతో మంది అప్పులు తీర్చలేక, వడ్డీ వ్యాపారుల వేధింపులు తట్టుకోలేక తమ జీవితాన్ని చాలించిన ఘటనలు మన కళ్ళముందు చాలా జరిగాయని అన్నారు.

మహబూబాబాద్ జిల్లాలో కూడా గతంలో పలు ఘటనలు జరుగగా, పోలీసులు చట్టపరంగా కఠిన చర్యలు తీసుకున్నప్పటికీ, వడ్డీ వ్యాపారులు తమ వ్యాపారాన్ని కొత్త పుంతలు తొక్కిస్తు, తమ కార్యలాపాలను సాగిస్తున్న విషయం పోలీసుల దృష్టికి వచ్చిందన్నారు. మధ్య తరగతి, పేద వర్గాలకు చెందిన వారు తమ ఆర్థిక అవసరాలకు వడ్డీ వ్యాపారులను సంప్రదించగా.. ఆ వ్యాపారులు నిబంధనలకు విరుద్ధంగా ఐదు రూపాయల నుండి పది రూపాయల వరకు వడ్డీ వసూలు చేస్తూ, ప్రజల రక్తాన్ని జలగల్లా పిలుస్తున్నారన్నారు.

మరికొంతమంది వారు ఇచ్చిన అప్పుకు సెక్యూరిటీ కింద వారి ఆస్తులను కూడా క్షయ విక్రయాల రూపంలో రిజిస్ట్రేషన్ చేసుకొని తర్వాత పూర్తిగా కబ్జా చేసిన సందర్భాలు కూడా మా దృష్టికి వచ్చాయన్నారు. మరికొంతమంది అక్రమ చిట్టీలు నడిపిస్తూ.. రిజిస్టర్డ్ చిట్ ఫండ్స్ వారు కూడా చిట్టి డబ్బులు అన్ని నెలలు పూర్తిగా చెల్లించి చిట్టి ఎత్తుకున్నా, వారికి చిట్టి డబ్బులు చెల్లించకుండా రకరకాల సురటీస్ కావాలని, వెరిఫికేషన్ చెయ్యాలని నెలల తరబడి వారికి డబ్బులు సకాలంలో చెల్లించకుండా వేదిస్తున్న ఘటనలు పోలీసు వారి దృష్టికి వస్తున్నాయన్నారు. ఇటువంటి అక్రమ కార్యకలాపాలతో ఎంతోమంది ఉసురు తీసుకుంటున్న

ఈ వడ్డీ వ్యాపారులు, రిజిస్టర్డ్ చిట్ ఫండ్స్, చట్ట విరుద్ధమైన చిట్టి యజమానులపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించి జిల్లా వ్యాప్తంగా 22 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, ఏకకాలంలో ముప్పేట దాడులు నిర్వహించామని తెలిపారు. వీరి అందరిపై తెలంగాణ మనీ లెండర్స్ ఆక్ట్- 1349 లోని వివిధ సెక్షన్స్ క్రింద, చీటింగ్ సెక్షన్ 420 IPC క్రింద చట్ట సత్య తగు చర్య తీసుకోబడుతుందన్నారు. ఈ మొత్తం సోదాలలో రూ.52,02,740, ప్రోమిసోరి నోట్స్ 395, లాంగ్ బుక్స్ 97, స్మాల్ చిట్ బుక్స్ 664, ల్యాండ్ డాక్యుమెంట్స్ 16, బ్లాంక్ చెక్స్ 51, బ్యాంకు పాస్ బుక్స్ 07, చెక్ బుక్ - 01, ఏటీయమ్స్ 13 స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ ప్రత్యేక ఆపరేషన్‌లో పాల్గొన్న ఏడుగురు సీఐలు, 15 మంది ఎస్ఐలు, సిబ్బందిని వారిని గైడ్ చేసిన అడిషనల్ ఎస్పీ యోగేష్ గౌతమ్ ప్రత్యేకంగా అభినందించారు.



Next Story

Most Viewed