అక్కడ వారాంతపు సంత హైవే రోడ్డు పైనే.. నిర్వాహకులు కూడా పట్టించుకోరు..

by Disha Web Desk 13 |
అక్కడ వారాంతపు సంత హైవే రోడ్డు పైనే.. నిర్వాహకులు కూడా పట్టించుకోరు..
X

దిశ, గూడూరు: భద్రాచలం-వరంగల్ జాతీయ రహదారి అది నిత్యం వేలాది వాహనాలు ప్రయాణిస్తూ ఉంటాయి.. కానీ మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలో మాత్రం అంగడి నిర్వహించేందుకు స్థలం లేకపోవడంతో.. వారాంతపు సంత జాతీయ రహదారి పైనే నిర్వహిస్తూ ఉంటారు. వారాంతపు సంతను గూడూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో వేలం పాట నిర్వహిస్తారు.


వేలం పాటలో సంతను దక్కించుకున్న నిర్వాహకులు కనీస సౌకర్యాలను ఏర్పాటు చేయలేకపోతున్నారని మండల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారాంతపు సంతకు మండల కేంద్రంలోని ప్రజలే కాకుండా చుట్టూ ప్రక్కల గ్రామాల ప్రజలు కూడా చాలా మంది వస్తూ ఉంటారు. గూడూరు పూర్తిగా ఏజెన్సీ ప్రాంతం ఇక్కడ గిరిజన ప్రజలు ఎక్కువగా నివసిస్తూ ఉంటారు.


కావున త్వరగా సంతను వేరే ప్రదేశానికి మార్చి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని గ్రామస్తులు తెలిపారు. జాతీయ రహదారిపై సంత నిర్వహించడం వలన తరుచు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. అయిన అధికారులు మాత్రం స్పందించడం లేదని మండల ప్రజలు వాపోతున్నారు.

సంతలో టాయిలెట్స్ లేక మహిళలకు ఇబ్బందులు..

ప్రతి సంవత్సరం గూడూరు సంత వేలంపాట నిర్వహిస్తారు. వేలంపాట ద్వారా వచ్చే నిధులను సంతలో సౌకర్యాలకు మాత్రం ఏ మాత్రం ఖర్చు చేయడం లేదు. సంతకు వచ్చే మహిళలకు, సంతలో చిరు వ్యాపారం చేసుకునే మహిళలకు కనీసం టాయిలెట్ సౌకర్యం కూడా లేకపోవడంతో మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయం పై మండల అధికారులు దృష్టి సారించాలని మహిళలు వేడుకుంటున్నారు.

ఇదే అదునుగా భావించి పోలీసులు చాలన్లు వేస్తున్నారు..

గూడూరు సంత(అంగడి)కి స్థలం లేకపోవడంతో జాతీయ రహదారి పైనే సంత నిర్వహిస్తున్నారు. వ్యాపారులు ఈ క్రమంలో సంతకు వచ్చే వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సంతకు పార్కింగ్ స్థలం లేకపోవడంతో.. వాహనదారులు రోడ్డు పక్కన బైక్ లు పార్కింగ్ చేసి కూరగాయలు కొనడానికి సంతకు వెళ్లి వచ్చే సరికి పోలీసులు నో పార్కింగ్ పేరిట వాహనాలకు చలాన్లు వేస్తున్నారని వాహనదారులు వాపోతున్నారు. మరి ఈ సమస్య ఎప్పుడూ తీరుతుందో చూడాలి..



Next Story

Most Viewed