ఎన్నికల్లో 40 శాతం యువతకే టికెట్లు.. పిలుపునిచ్చిన చంద్రబాబు

by Dishafeatures2 |
ఎన్నికల్లో 40 శాతం యువతకే టికెట్లు.. పిలుపునిచ్చిన చంద్రబాబు
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాబోయే ఎన్నికల్లో యువతకు 40 శాతం టికెట్లు ఇస్తామని టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ భవన్‌లో టీడీపీ 40వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. అభివృద్ధి కావాలంటే టీడీపీ అధికారంలో ఉండాలన్నారు. యువత పోరాడితేనే ఏదైనా సాధ్యమన్నారు. వ్యవస్థలో మార్పు తేవాలనుకునే యువత రాజకీయాల్లోకి రావాలని ఆయన పిలుపునిచ్చారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో పార్టీని బలపర్చాల్సిన బాధ్యత పార్టీ శ్రేణులదే అన్నారు. తెలంగాణలో టీడీపీ పటిష్టతపై ఫోకస్ పెడతామని స్పష్టం చేశారు. పార్టీ హైదరాబాద్‌లో పుట్టినందుకే ఆవిర్భావ దినోత్సవాన్ని ఇక్కడ నిర్వహించామన్నారు. కొందరు రాజకీయాన్ని వ్యాపారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించిన ఘనత ఎన్టీఆర్‌దేనని ఆయన కొనియాడారు.

ప్రపంచ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 40 దేశాల్లోని 200 నగరాల్లో టీడీపీ ఆవిర్భావ వేడుకలు జరుగుతున్నాయని వెల్లడించారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచం నలుమూలలా చాటిచెప్పిన వ్యక్తి ఎన్టీఆర్ అన్నారు. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఎప్పుడూ ప్రజాపక్షంలోనే అన్నారు. వెనుకబడిన వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చిన పార్టీ, తెలుగు ప్రజల గుండె చప్పుడు టీడీపీ అన్నారు. హైదరాబాద్ అభివృద్ధికి కారణం టీడీపీ అని, ఐటీ గురించి ఎవరికీ తెలియని సమయంలో భవిష్యత్‌కు పునాది వేశామని స్పష్టం చేశారు.

రాజకీయాల్లో విలువలను పెంచే పార్టీ కూడా టీడీపీ అని స్పష్టం చేశారు. ఏపీలో 33 వేల ఎకరాల్లో రాజధాని ఏర్పాటుకు కృషి చేశామన్నారు. రాజధాని కోసం రైతులు స్వచ్ఛందంగా భూములిచ్చారన్నారు. అమరావతిలో ఇన్‌సైడ్ ట్రేడింగ్ జరిగింది అరోపించారన్నారు. కానీ తనపై ఉన్న నమ్మకంతోనే రాజధాని కోసం తమ భూములను రైతులు త్యాగం చేశారని ఆయన పేర్కొన్నారు. పోలవరం ద్వారా నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టామన్నారు.

నదుల అనుసంధానంతో అందరికీ నీళ్లివాలని తలపెట్టామని ఆయన తెలపారు. అంతకు ముందు ఆదర్శనగర్‌లోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లోను సందర్శించి ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం ఎన్టీఆర్ ఘాట్‌లో నటుడు బాలకృష్ణతో కలిసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


Next Story

Most Viewed