రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలి: జస్టిస్ ఎన్వీ రమణ

by Dishanational1 |
రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలి: జస్టిస్ ఎన్వీ రమణ
X

దిశ, సికింద్రాబాద్: ప్రతి ఒక్కరూ రాజ్యాంగాన్ని గౌరవించాలని, అది అందరికీ రక్షణ కవచంగా నిలుస్తుందని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీకి ఎంతోమంది గొప్పవారిని తీర్చిదిద్దిన గొప్ప చరిత్ర ఉందని గుర్తుచేశారు. స్వాతంత్ర్య పోరాటం నుంచి నవభారత నిర్మాణం వరకు పోషించినవారిలో ఎక్కువమంది ఇక్కడ చదువుకున్నవారేనని కొనియాడారు. ఉస్మానియా యూనివర్సిటీ 82వ స్నాతకోత్సవ వేడుకలు శుక్రవారం ఓయూ ఠాగూర్ ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు.

ఈ వేడుకల్లో 2021-2022 విద్యాసంవత్సరానికి సంబంధించిన స్వర్ణ పతకాలు, పీహెచ్ డీ పట్టాలు సాధించినవారికి వాటిని ప్రదానం చేశారు. వివిధ శాఖల డీన్లు, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుల సమావేశం లాంఛనంగా నిర్వహించారు. అనంతరం ప్రారంభమైన పట్టాల ప్రదాన హోదాలో రాష్ట్ర గవర్నర్ తమిళి సై, ముఖ్య అతిథిగా జస్టిస్ ఎన్వీ రమణ హాజరయ్యారు. వేదికపై ముఖ్య అతిథితోపాటు గవర్నర్, ఓయూ వీసీ ప్రొఫేసర్ రవీందర్, రిజిస్ట్రార్ ప్రొఫేసర్ లక్ష్మీనారాయణ, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు, డీన్లు హాజరయ్యారు. అనంతరం వీసీ రవీందర్ పట్టాలు, పతకాలు పొందనున్న విద్యార్థులచే వర్సిటీ సాంప్రదాయం ప్రకారం ప్రతిజ్ఞ చేయించారు. ముందుగా వర్సిటీ నివేదికను వీసీ చదివి వినిపించారు. ఆ తరువాత జస్టీస్ ఎన్వీ రమణకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా జస్టిస్ రమణ మాట్లాడుతూ ప్రతి ఒక్కరి జీవితంలో విద్య ఎంతో ముఖ్యమైన పాత్ర పోషిస్తుందన్నారు.

ప్రపంచీకరణ కారణంగా విశ్వసంస్కృతి స్థానిక సంస్కృతులు, సాంప్రదాయాలను దెబ్బతీస్తోందని తెలిపారు. 2021 యునెస్కో నివేదిక ప్రకారం ఈ శతాబ్దం చివరివరకు దాదాపు ఏడు వేల భాషలు కనుమరుగయ్యే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ప్రపంచీకరణను తాను తప్పుబట్టడం లేదని తెలిపారు. ప్రతి ఒక్కరూ మాతృభూమి, మాతృభాష, మాతృదేశాన్ని మరవకూడదని, సమాజంతో సంబంధాలను కొనసాగించాలని సూచించారు. మూలాలను మరిచిపోతే జాతి క్షమించదని తెలిపారు. తెలుగు అద్భుత సాహిత్యం అందుబాటులో ఉందని, దానిని ప్రతి ఒక్కరూ చదవాలని పిలుపునిచ్చారు. ప్రముఖ కవి దాశరథి పద్యాలను చదువుతూ , 'నా తెలంగాణ కోటి రతనాల వీణ' అంటూ ముగించారు.

గవర్నర్ డాక్టర్ తమిళి సై సౌందరరాజన్ మాట్లాడుతూ పట్టాలు స్వీకరించిన ప్రతి ఒక్కరూ జీవితంలో ధైర్యంగా ఉండాలని, ఇప్పుడే జీవితం ప్రారంభమైందని అనుకోవాలని సూచించారు. తల్లిదండ్రులు, గురువులను గౌరవించాలని పిలుపునిచ్చారు. వారు చేసిన త్యాగాలు, వారి శిష్యరికం ఫలితంగానే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నారనేది గుర్తుంచుకోవాలని చెప్పారు. విజయానికి ఎటువంటి అడ్డదారులు ఉండబోవని, కష్టపడి వాటిని సాధించుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ సామర్థ్యాలను పూర్తిగా ప్రదర్శించినపుడే ఎంతటి లక్ష్యాన్నైనా సాధించుకోవచ్చని చెప్పారు. కష్టతరమైన లక్ష్యాలను నిర్దేశించుకుని, కష్టపడి సాధించుకోవాలన్నారు. సెల్ ఫోన్ ను ప్రతి ఒక్కరూ మితిమీరి వినియోగిస్తున్నారని, సెల్ ఫోన్ వినియోగాన్ని తగ్గించుకోవాలని సూచించారు. కనీసం 5 నిమిషాలు కూడా సెల్ పోన్ లేకుండా ఉండలేకపోతున్నారని అభిప్రాయపడ్డారు. అనంతరం గవర్నర్ చేతుల మీదుగా 43 బంగారు పతకాలను ప్రదానం చేశారు. రసాయన శాస్త్ర విభాగంలో నాలుగు బంగారు పతకాలు సాధించి వేదుల తేజశ్రీ ప్రధాన ఆకర్షణగా నిలిచారు. అనంతరం గవర్నర్, ప్రధాన న్యాయమూర్తి చేతుల మీదుగా పీహెచ్ డీ పూర్తి చేసిన 221 మందికి పట్టాలను ప్రదానం చేశారు. స్నాతకోత్సవం సందర్భంగా పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, రాష్ట్ర మానవ హక్కుల సంఘం చైర్మెన్ జస్టిస్ చంద్రయ్య, రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మెన్ బోయినపల్లి వినోదక్కుమార్, ఉన్నత విద్యామండలి చైర్మెన్ ప్రొఫెసర్ లింబాద్రి, ఇఫ్లూ వీసీ ప్రొఫెసర్ ఈ. సురేష్ కుమార్, విదేశాంగ శాఖ ఉన్నతాధికారి రాజశేఖర్, కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శ్రీనగేశ్ తదితరులు పాల్గొన్నారు.



Next Story