'ఎవ్వరినీ గుడ్డిగా ప్రేమించి మోసపోవద్దు'.. విశాఖపట్నంలో మంత్రి ఆర్‌కే రోజా

by Disha Web |
ఎవ్వరినీ గుడ్డిగా ప్రేమించి మోసపోవద్దు.. విశాఖపట్నంలో మంత్రి ఆర్‌కే రోజా
X

దిశ, ఏపీ బ్యూరో : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్‌కే రోజా నిప్పులు చెరిగారు. చంద్రబాబు ఓ ఉన్మాది అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విశాఖపట్నం పర్యటనలో ఉన్న రోజా శనివారం మీడియాతో మాట్లాడారు. అత్యాచారం లాంటి ఘటనలను సైతం రాజకీయం చెయ్యాలని చంద్రబాబు చూస్తున్నారంటూ మండిపడ్డారు. టీడీపీ కార్పొరేటర్ వేధింపుల వల్ల విజయవాడలో ఒక యువతి ఆత్మహత్యకు పాల్పడితే కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించని చంద్రబాబు నాయుడే అసలైన ఉన్మాది అంటూ రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాల్‌మనీ సెక్స్ రాకెట్ కేసులో సీడీల ప్రూఫ్‌లను బయటపెడితే నన్ను అన్యాయంగా ఏడాది పాటు సస్పెండ్ చేసింది చంద్రబాబు ప్రభుత్వం కాదా అని రోజా ప్రశ్నించారు. నాడు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తహసీల్దార్ వనజాక్షినిని కొట్టినప్పుడు చంద్రబాబు ఏమయ్యారు అని నిలదీశారు. ఆడ పిల్లల పుట్టుకపై కామెంట్స్ చేసిన చంద్రబాబును ప్రజలు నమ్మరని రోజా చెప్పుకొచ్చారు.

తెలుగమ్మాయిగా తెలుగు సంస్కృతిని ప్రమోట్ చేస్తా

మంత్రి పదవి వచ్చాక తిరుమల దర్శనం చేసుకుని తొలిసారి వైజాగ్ వచ్చాను. శారదా పీఠంలో రాజ్య శ్యామల దేవి అమ్మవారిని దర్శించుకున్న. స్వరూపానందేంద్ర సరస్వతి ఆశీస్సులు తీసుకున్నాను. సింహాచలం అప్పన్న స్వామిని కూడా దర్శించుకుని స్వామి వారి ఆశీస్సులు తీసుకుంటాను అని మంత్రి రోజా వెల్లడించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ సమయంలో వైజాగ్ ఇన్‌చార్జిగా పనిచేశాను. వైజాగ్ అనగానే దేవుడే కాదు.. బీచ్‌లూ.. పర్యాటక ప్రాంతాలు ఉంటాయి. తెలుగు అమ్మాయిగా తెలుగు సంస్కృతిని ప్రమోట్ చేస్తా. అలాగే శారదా పీఠాన్ని పర్యాటకంగా డెవలప్ చేసి ఇంకా ఎక్కువ మంది వచ్చేలా చేస్తానని మంత్రి రోజా హామీ ఇచ్చారు.

'హీరోయిన్‌గా అరకు లాంటి పర్యాటక ప్రాంతాలన్నీ తిరిగా.. ఇప్పుడు మంత్రిగా వాటిని మరింత అభివృద్ధి చేస్తాను. అలాగే క్రీడల శాఖ మంత్రిగా రాష్ట్రంలోని వెనుకబడిన క్రీడాకారులను వెలుగులోకి తీసుకొచ్చి వారు మెడల్ సాధించేలా ప్రోత్సహిస్తాను. విశాఖకు మంత్రి పదవి లేకున్నా.. ఉమ్మడి జిల్లా కింద కన్సిడర్ చేసి రెండు మంత్రి పదవులు ఇచ్చారు. నా మొదటి సినిమా చామంతి షూటింగ్ అరకులోనే జరిగింది. రాష్ట్రంలోని 13 జిల్లాలలోని పర్యాటక ప్రాంతాలపై షార్ట్ ఫిల్మ్స్ తీయించి.. పర్యాటకులకు వాటి గురించి తెలిసేలా వివరాలు అందిస్తాం. పర్యాటక ప్రాంతాల్లో కాటేజ్‌లు నిర్మిస్తాం. టెంపుల్ టూర్స్.. సర్క్యూట్ టూర్లు ఏర్పాటు చేస్తాం. కేంద్రంలో ఉన్న పర్యాటక మంత్రి కిషన్ రెడ్డితో సమన్వయం చేసుకుని రాష్ట్రాన్ని టూరిజం పరంగా అభివృద్ధి చేస్తాం' అని పర్యాటక శాఖ మంత్రి రోజా వెల్లడించారు.

అత్యాచార ఘటన దురదృష్టకరం

విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో యువతిపై అత్యాచార ఘటన దురదృష్టకరమని మంత్రి రోజా అన్నారు. కేంద్రం దిశ చట్టాన్ని ఆమోదించి ఉంటే అత్యాచారం చేసిన వాళ్ళని వెంటనే ఉరేసే అవకాశం ఉండేదని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా అమ్మాయిలు మాయమాటలు ట్రాప్‌లో పడొద్దని హితవు పలికారు. ఇలాంటి ఇన్సిడెంట్‌లను రాజకీయం చెయ్యాలని చూడడం ప్రతిపక్షాలకు సరికాదని మంత్రి రోజా హితవు పలికారు. ఆడపిల్లలు బయటికి వెళ్లినప్పుడు ఏమాత్రం అనుమానం కలిగినా వెంటనే దిశ యాప్‌కు ఫోన్ చెయ్యాలని సూచించారు. ఎవ్వరినీ గుడ్డిగా ప్రేమించి మోసపోవద్దని.. తల్లిదండ్రులతో ఓపెన్‌గా మాట్లాడాలని మంత్రి రోజా సూచించారు.


Next Story

Most Viewed